Jammu Kashmir: కశ్మీర్ లోయలో యాక్టివ్‌గా 38మంది పాక్ టెర్రరిస్టులు
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో తేలిన పాకిస్తాన్ ఉగ్రమూకల లెక్క
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో నక్కిన ఉగ్రమూకల లెక్క తేలింది. గత కొంత కాలం భారీ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న ఆర్మీ ఫుల్ డీటెయిల్స్ తెలిపింది. కశ్మీర్ లోయలో 38మంది పాక్ టెర్రరిస్టులు చురుగ్గా ఉన్నట్టు ఇంటెలిజన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఇదే సమయంలో ఇటీవల కశ్మీర్‌లో జరిగిన వరుస ఉగ్రదాడుల్లోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. తాజాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన జాబితాను నిఘా వర్గాలు సిద్ధం చేసి, కేంద్ర హోం శాఖకు సమర్పించాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు పాక్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు అదనపు భారత భద్రతా బలగాలను హోం శాఖ రంగంలోకి దించింది. దీంతో కశ్మీర్‌లోని పాక్ ఉగ్రవాదులను ఏరివేతకు భారత బలగాలు వేట ప్రారంభించాయి.
మరోవైపు.. నిఘా వర్గాలు సిద్ధం చేసిన జాబితాలో 27 మంది లష్కరే తోయిబా, 11 మంది జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు. వీరు ఉగ్రదాడుల్లో శిక్షణ తీసుకుని భారత్‌కు వచ్చినట్లు గుర్తించారు. పుల్వామా, బారాముల్లా ప్రాంతాల్లో 10 మంది పాక్ ఉగ్రవాదులు ఉండగా.. శ్రీనగర్‌లో నలుగురు, కుల్గామ్‌లో ముగ్గురు ఉన్నట్లు నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. మరో 11 మంది ఇతర ప్రాంతాల్లో ఉంటూ తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కశ్మీర్‌లోని ఇతర ఉగ్రవాదులకు సహకారం అందించడంతో పాటు భారత భద్రతా దళాలపై వీరు దాడులకు పాల్పడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు.