Karnataka SSLC Exam 2020: 32 మంది టెన్త్ విద్యార్థులకు కరోనా!

Karnataka SSLC Exam 2020 : దేశవ్యాప్తంగా కరోనా రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. రోజుకు రికార్డు స్థాయిలోనే కేసులు వస్తున్నాయి.

Update: 2020-07-04 17:27 GMT

Karnataka SSLC Exam 2020 : దేశవ్యాప్తంగా కరోనా రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. రోజుకు రికార్డు స్థాయిలోనే కేసులు వస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా కర్ణాటక లో పదో తరగతి పరీక్షలకు హాజరైన 32 మంది విద్యార్థులకు కరోనా సోకడం ఆందోళనకు గురి చేస్తోంది, ఇక మరో 80 మంది విద్యార్థులను ఇంట్లో నిర్బంధంలో ఉంచారు.. అయితే కచ్చితంగా మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించినప్పటికీ విద్యార్థులకు వైరస్‌ సోకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనితో అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.

జూలై 3 నాటికి 7.60 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష రాశారు, 14,745 మంది హాజరు కాలేదు. COVID-19 మహమ్మారి కారణంగా గతంలో మార్చి 27 మరియు ఏప్రిల్ 9 మధ్య నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలను కర్ణాటక ప్రభుత్వం వాయిదా వేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 25 నుంచి జూలై 3, మధ్య తిరిగి పరీక్షలను నిర్వహించింది. ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కొన్ని రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే..

కర్ణాటకలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి అక్కడ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు (శుక్రవారం) నాటికి ఉన్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో 1,694 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,710కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 10,608గా ఉంది.

ఇక అటు దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 22,771 కేసులు నమోదు కాగా, 442 మంది ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 6,48,315 కి చేరింది. ఇందులో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,35,433 ఉండగా, 3,94,226 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక కరోనాతో పోరాడి 18,655 మంది మరణించారు. 

Tags:    

Similar News