Jammu and Kashmir: జమ్ములో భారీ ఎన్‌కౌంటర్
Jammu and Kashmir: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. ఇటువైపు ఓ భద్రతా అధికారి మృతి, నలుగురికి గాయాలు
Jammu and Kashmir: ప్రధాని నరేంద్రమోదీ జమ్ము పర్యటన రెండ్రోజులకు ముందు ఆర్మీ స్థావరం వద్ద ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా ఒక భద్రతా అధికారి మృతి చెందారు. నలుగురు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రధాని మోదీ జమ్ము పర్యటన ఖరారవడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి ఉగ్రదాడి జరగకుండా ముందస్తు తనిఖీలు చేపట్టాయి. అయితే సంజ్వానా కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మ స్థావరానికి సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ చేపట్టగాఉగ్రవాదులు దాడులకు దిగారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మృతి చెందారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు.
ఎన్‌కౌంటర్ భీకరంగా జరుగుతోందని ఉగ్రవాదులు దాక్కున్నారని జమ్ము అదనపు డైరెక్టర్ జనరల్ ముఖేష్ సింగ్ తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో దాడులకు కుట్ర పన్నారని తెలిసి రాత్రి సుంజ్వాన్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని చుట్టుముటినట్టు తెలిపారు. ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా కాల్పులు జరిగాయని వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. భద్రతా బలగాల్లో ఓ అధికారి మృతి చెందగా నలుగురు అధికారులకు గాయాలైనట్టు ఏడీజీ ముఖేష్ సింగ్ తెలిపారు. నిన్న బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఉన్నట్టు అనుమానిస్తున్న ప్రాంతాలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. కుప్వారా లో పోలీసులు, సైన్యంతో కలిసి రెండ్రోజుల క్రితం పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 54 పిస్టల్ రౌండర్లు, 17 పిస్టల్ మ్యాగజైన్లు, 10 పిస్టల్స్‌తో పాటు ఐదు గ్రనేడ్లు ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌లో భారీగా ఆయుధాల సరఫరా జరుగుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సోదాలను ముమ్మరం చేశారు.
2018లో సుంజ్వాన్ ఆర్మీ కంటోన్మెంట్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. అప్పట్లో జరిగిన పేలుళ్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే కాకుండా గత నెల రోజులుగా కశ్మీర్ లోయలో ఉగ్రవాద చర్యలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు నిత్యం కార్డన్ సెర్చులు చేపడుతూ ఎక్కడకక్కడ ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. గత నెలలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పంచాయతీ సభ్యులు మృతి చెందగా పలువురు వలస కార్మికులు గాయపడ్డారు. ఇదిలా ఉంటే 2019 ఆగస్టులో జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను రద్దు చేశారు. జమ్ము కశ్మీర్, లడక్ పేరిట కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ 24న జమ్ములో పర్యటించనున్నారు. జమ్ములోని పల్లీ గ్రామంలో నిర్వహించే భారీ సభకు వేలాది మంది పంచాయతీ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు భారీ బందోబస్తును చేపట్టాయి.