Helicopter Ride: ఛత్తీస్‌గఢ్‌లో చదువులో టాపర్లుగా నిలిచిన వారితో హెలికాప్టర్ రైడ్
Helicopter Ride హెలికాప్టర్ రైడ్‌తో ఆనందంలో విద్యార్థులు
Helicopter Ride: కాలేజీలో టాపర్‌గా నిలిచిన వారికి సాధారణంగా అందరి ముందు అభినందించడం గానీ, వారికి నగదు ప్రోత్సాహకం గానీ అందజేస్తుంటారు. ఇలా చేస్తే వారు ఇంకా బాగా చదువుకుంటారని భావిస్తుంటారు. కొంత వరకు ఇది నిజం కూడా. అయితే ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చదువులో టాపర్లుగా నిలిచిన వారితో హెలికాప్టర్ రైడ్ చేయించారు. 10, 12వ తరగతుల్లో టాపర్లుగా నిలిచిన వారిని హెలికాప్టర్ లో తిప్పించారు.
సీఎం చేసిన ఈ పనికి విద్యార్థులు ఆనందంతో పొంగిపోయారు. తొలిసారి గాల్లో ప్రయాణించామని, చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 88 మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పుతామని గతంలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గగన విహారం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని స్పష్టం చేశారు.