తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలవేళ సీన్ సీరియస్ గా మారుతోంది. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని అభిమానులు సంబరాలు చేసుకుంటున్న వేళ ఆరోగ్యరీత్యా రజనీ వెనక్కి తగ్గడంతో అభిమానులు కాస్తా నిరాశ చెందారు. తమ హీరో ఆరోగ్యం కూడా ముఖ్యమేనని సర్ది చెప్పుకుంటున్నారు. రజనీ రాకకోసం ఆతృతగా ఎదురుచూసిన కమల్ హాసన్ సైతం రజనీ నిర్ణయంపై నిరాశపడినా ఆరోగ్యమే ముఖ్యమని ఆ తర్వాతే అన్నీ అని సర్ది చెప్పుకున్నారు. ఇలాంటి టైమ్ లో తమిళ యువకుల అభిమాన హీరో దళపతిగా పేరు పడ్డ విజయ్ ఎంట్రీ ఖాయమంటూ సోషల్ మీడియాలో పుకార్లు ఓ రేంజ్ లో సాగుతున్నాయి. అంతేకాదు, విజయ్ అభిమానులు తమ హీరో కొత్త పార్టీకి ముహూర్తం కూడా పెట్టేశారు. ఎల్లుండి డిసెంబర్ 31న జయలలిత సమాధి దగ్గర హీరో విజయ్ తన కొత్త పార్టీని ప్రకటిస్తారంటూ రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారబోతున్నాయి. హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ గతంలో కొత్త పార్టీ ని రిజిస్టర్ కూడా చేశారు. విజయ్ అభిమాన సంఘం పేరుపైనే పార్టీ పేరును రిజిస్టర్ చేశారు. అయితే అదితనకు తెలియకుండా జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజకీయాల్లోకి రాననీ విజయ్ ప్రకటించారు. మరోవైపు విజయ్ తల్లి కూడా తన కుమారుడి పక్షమే వహించారు. కొత్త పార్టీ ఏర్పాట్లతో తనకు గానీ, తన కుమారుడికి గానీ ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. దాంతో విజయ్ తండ్రి చంద్రశేఖర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
వారం క్రితం విజయ్ తన అభిమానులతో రహస్యంగా సమావేశమైనట్లు ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకొద్దనీ గట్టిగా చెప్పినట్లు సమాచారం. తొందరలో తానే కొత్త రాజకీయ పార్టీని పెడతానని , అభిమానుల ఆశలు నెరవేరుస్తానని విజయ్ అభిమాన సంఘాలకు హామీ ఇచ్చినట్లు వార్తలు ప్రచారంలోకొస్తున్నాయి. విజయ్ నటించిన మాస్టర్ సినిమా 2021 సంక్రాంతికి విడుదల అవుతోంది. అంతేకాదు వచ్చే ఏడాది తలపతి 65 అనే కొత్త సినిమా షూటింగ్ కూడా మొదలవుతోంది. ఈ నేపధ్యంలో తమిళనాడులో విజయ్ అభిమానులు ఓ రేంజ్ లో ఊహల్లో మునిగి తేలుతున్నారు.