Tollywood Controversies in 2024: సినిమా సెలెబ్రిటీలకు చుక్కలు చూపించిన 2024

Update: 2024-12-15 02:00 GMT

Controversies in Tollywood in 2024 Explained: టాలీవుడ్‌లో కొంతమంది ప్రముఖులకు 2024 మంచి శభారంభాన్నిచ్చింది. అలాగే ఏడాది చివర్లోకొచ్చేటప్పటికి పలు వివాదాలతో అంతే చేదు అనుభవం కూడా మిగిల్చింది. కొంతమంది తమ జీవితకాలం పాటు గుర్తుపెట్టుకునే ఘటనలు కూడా ఈ ఏడాదే జరిగాయి. అందులో కొన్ని వారి కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోనుండగా... ఇంకొన్ని జీవితాంతం వేధించే మానని గాయంలా మిగిలిపోనున్నాయి. ఆ జాబితాలో అల్లు అర్జున్, జానీ మాస్టర్, మోహన్ బాబు, మంచు మనోజ్, రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, నయనతార, ధనుష్, కస్తూరి... ఇలా చెప్పుకుంటూపోతే చాలా పెద్ద జాబితానే ఉంది.

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం. ఒక్క రోజు జైలు జీవితాన్ని మర్చిపోయేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ అది అంత ఈజీగా మర్చిపోయే విషయం కాదంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఆ మొత్తం ఎపిసోడ్‌ను దేశమంతా టీవీల్లో, ఫోన్లలో ప్రత్యక్షప్రసారంలో చూసింది.

Full View

పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఈ కేసులోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ హై కోర్టు ఇచ్చిన ఇంటెరిం బెయిల్‌తో ఆయనకు రోజుల తరబడి జైల్లో ఉండాల్సిన సమస్య తప్పింది. కాకపోతే బెయిల్ ఆర్డర్ కాపీలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలో ఆలస్యం కావడంతో ఆయనకు ఒక రాత్రి జైలు జీవితం అనుభవించక తప్పలేదు.

ఇదే విషయమై అల్లు అర్జున్ తరపు లాయర్లు పలు ఆరోపణలు చేశారు. ఆయన్ను సకాలంలో బెయిల్‌పై విడుదలయ్యేలా చర్యలు తీసుకోకపోవడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందంటున్నారు. అవసరమైతే కోర్టులో తాము న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారు.

పుష్ప ఫస్ట్ పార్ట్ మూవీ అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ తీసుకొచ్చింది. పుష్ప 2 మూవీ జస్ట్ 6 డేస్‌లోనే రూ. 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ క్రాస్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. కానీ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్, పోలీసు కేసులు, కోర్టు మెట్లు, జైలు జీవితం పుష్పకు ఆ సంతోషం లేకుండా చేశాయని ఫ్యాన్స్ అంటున్నారు.

మోహన్ బాబు ఇంట్లో రచ్చరచ్చ

పుష్ప 2 సినిమా, తొక్కిసలాటలో మహిళ మృతితో అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకున్నాడు. కానీ మోహన్ బాబు విషయంలో అలా కాదు. ఆయన కుటుంబ వివాదమే జనానికి, మీడియాకు ఓ కుటుంబ కథా చిత్రం అయింది. అస్సలు టిక్కెట్టే లేకుండానే వాళ్లు ఫ్రీగా షో వేసి చూపించారు. పార్ట్ 1, పార్ట్ 2 లాంటివేవీ లేకుండానే మంచు మనోజ్, మోహన్ బాబు సీన్ బై సీన్ చెప్పిన డైలాగ్స్ వింటే... అది ఇవాళ్టి పంచాయతీ కాదని చూసే వాళ్లందరికీ అర్థమైపోయింది.

"ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పా" అని మంచు మనోజ్ ప్రశ్నించాడు. మనోజ్ భార్య వచ్చాక ఆమె మాట విని చాలా మారిపోయాడని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. "మా ఇంటి గొడవే" అని మంచు విష్ణు కప్పిపుచ్చుకున్న స్థాయి నుండి మా ఇంట్లో జరుగుతోంది ఇదేనని మోహన్ బాబు మీడియాసాక్షిగా చెప్పుకునే వరకు వెళ్లింది. సినీ పరిశ్రమలో దాదాపు 5 దశాబ్ధాల జీవితం చూసిన మోహన్ బాబు ఇంటి పంచాయతీని దేశం మొత్తం లైవ్‌లో చూసింది. ఎంతో హుందాగా ఉండే సూపర్ స్టార్ లాంటి రజినీకాంత్ లాంటి వాళ్లను పబ్లిగ్గా వేదికలపై రారాపోరా అని పిలుచుకున్న మోహన్ బాబు ఇవాళ జనం పిచ్చాపాటికి ముడిసరుకయ్యారు.

జానీ మాస్టర్‌ చేజారిన జాతీయ అవార్డ్

తెలుగు సినీ పరిశ్రమ నుండి వెలుగులోకొచ్చి అటు బాలీవుడ్ నుండి ఇటు కోలీవుడ్ వరకు సత్తా చాటుకున్న తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. కానీ నేను మైనర్‌గా ఉన్నప్పుడే ఆయన నన్ను లైంగికంగా వేధించాడంటూ ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆయన్ని గోవా వరకు పరుగెత్తేలా చేసింది. కానీ సైబరాబాద్ పోలీసులు సెప్టెంబర్ 19న గోవాకు వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 24 హై కోర్టు కండిషన్స్‌తో కూడిన బెయిల్ ఇవ్వడంతో చంచల్‌గూడ జైలు నుండి రిలీజయ్యారు.

పోక్సో యాక్ట్ కింద ఆరోపణలు రావడంతో అంతకంటే ముందే ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ అవార్డ్ చేతికందకుండానే వెనక్కెళ్లిపోయింది. జాతీయ అవార్డ్ పోవడం మాత్రమే కాదు... ఈ వివాదంతో జానీ మాస్టర్ జాతీయ స్థాయిలో అన్‌పాపులర్ అయ్యారు. నేనే తప్పు చేయలేదనేది జానీ మాస్టర్ వాదన.

మంచం కింద దాసుకోలేదన్న రామ్ గోపాల్ వర్మ

నేను మంచం కింద దాచుకోలేదు. ఎవ్వరికీ చిక్కకుండా పారిపోలేదు. నా సినిమా పనులతో నేను బిజీగా ఉన్నాను. ఏపీ పోలీసులకు చిక్కకుండా రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నాడని మీడియాలో వైరల్ అయిన వార్తలకు ఆయనిచ్చిన రియాక్షన్ ఇది. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై పెట్టిన పోస్టులతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.

ఏపీ పోలీసులు ఆయన్ను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. కానీ తీరా చూస్తే వర్మ అక్కడ లేరు. దాంతో ఆయన పారిపోయారంటూ వార్తలొచ్చాయి. ఆ వార్తలకు వర్మ వివరణ ఇచ్చుకోకతప్పలేదు. తరువాత పోలీసుల ఎదుటకు రాకతప్పలేదు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అందరిపై సెటైర్లేసే వర్మపై అప్పుడు అనేక సెటైర్లు పేలాయి.

నయనతార వైస్ ధనుష్ కాపీ రైట్స్ వివాదం

నయనతార, ధనుష్... నవంబర్ మాసంలో పెద్దగా సినిమాలు లేని టైమ్లో వీళ్లే హాట్ టాపిక్ అయ్యారు. నాన్ రౌడీ దాన్ మూవీ షూటింగ్ టైమ్లో ఆ సినిమా దర్శకుడు విగ్నేష్ శివన్‌ని నయనతార ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ధనుష్ ఆ సినిమాకు నిర్మాత. ఆ సినిమాలోంచి 3 సెకన్ల నిడివి గల వీడియో వాడుకున్నారని రూ. 10 కోట్లకు కాపీ రైట్ యాక్ట్ కింద ధనుష్ నోటీసులు పంపించారు. దాంతో శివాలెత్తిపోయిన నయనతార అందుకు ప్రతిగా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.

మీ నాన్న కస్తూరి రాజా , మీ అన్న సెల్వ రాఘవన్ లేకపోతే మీరెక్కడ... మీరు చెప్పే మంచి మాటలకు మీ చేష్టలకు పొంతనేదంటూ ఆ లేఖలో ప్రశ్నలు సంధించారు. రాధిక శరత్ కుమార్ లాంటి సీనియర్ హీరోయిన్స్ నుండి నయనతారకు సపోర్ట్ లభించింది. ధనుష్‌కు నయనతార నుండి ఆ 10 కోట్లు ఎప్పుడొస్తాయో... అసలు వస్తాయో రావో తెలియదు కానీ... ఆయన్ను నెగటివ్ షేడ్స్‌లో చూపించేందుకు నయనతార చేసిన విమర్శలు మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.

చెన్నైలో మాయమైన కస్తూరి హైదరాబాద్‌లో అరెస్ట్

తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన హీరోయిన్ కస్తూరి శంకర్ తెలుగు వారిపై చేసిన వ్యాఖ్యలు ఆమెను కేసుల పాలు చేశాయి. యాంటిసిపేటరీ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా వృధా అయ్యాయి. అరెస్ట్ అవకుండా ఉండేందుకు చెన్నైలో ఇల్లు విడిచి హైదరాబాద్ వచ్చేసిందామె. కానీ చెన్నై పోలీసులు ఆమెను వెదుక్కుంటూ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కోర్టు రిమాండ్ విధించడం, తరువాత వారం రోజులకు బెయిల్‌పై విడుదలవడం జరిగింది. కానీ ఈ వివాదం ఆమెను తెలుగు వారి ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎందుకు, వివాదంలో పడటమెందుకని తెలుగు నెటిజెన్స్ మొట్టికాయలేశారు.

Tags:    

Similar News