Zakir Hussain : 11ఏళ్ల వయస్సులో అమెరికాలో మొదటి సంగీత కచేరీ..ఎన్నో సవాళ్లను అధిగమించి..భారత కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పి
Zakir Hussain : ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. జాకీర్ హుస్సేన్..తన చేతి వేళ్లతో తబలా వాయించినప్పుడల్లా ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. అతని తబలా శబ్దం వినగానే, వావ్ ఉస్తాద్ అని అనేవారు. జాకీర్ హుస్సేన్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తన కళను పోషించాడు. జీవితంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన తర్వాత కూడా ఆయన సాదాసీదాగా జీవించడానికే ఇష్టపడ్డారు. జాకీర్ హుస్సేన్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో పోరాటాలను అధిగమించాల్సి వచ్చింది.
11 సంవత్సరాల వయస్సులో అమెరికాలో మొదటి కచేరీ:
జాకీర్ హుస్సేన్ 9 మార్చి 1951న ముంబైలో జన్మించారు. జాకీర్ హుస్సేన్ తండి కూడా తబలా వాద్యకారుడు. ఆయన పేరు ఉస్తాద్ అల్లా రఖా. తబలా వాయించే నైపుణ్యాన్ని జాకీర్ తన తండ్రి నుండి వారసత్వంగా పొందాడు. చిన్నతనం నుంచి పూర్తి అంకితభావంతో వాయిద్యం వాయించడం నేర్చుకున్నాడు. 3ఏళ్ల వయస్సులో పఖావాజ్ వాయించడం నేర్చుకున్నాడు. ఈ కళ అతనికి అతని తండ్రి నేర్పించారు. 11 సంవత్సరాల వయస్సులో అమెరికాలో తన మొదటి సంగీత కచేరీని ప్రదర్శించాడు. దీని తరువాత 1973 సంవత్సరంలో తన మొదటి ఆల్బమ్ 'లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్'ని ప్రారంభించాడు.
రిజర్వ్ చేసిన బోగీలో జాకీర్ ప్రయాణం చేయలేక:
జకీర్ చిన్న వయసులోనే తబలాపై పట్టు పెంచుకున్నారు. జాకీర్ హుస్సేన్ 11-12 సంవత్సరాల వయస్సులో తబలా వాయించే ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన కచేరీల కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. తన తబలాను సరస్వతిగా భావించి, దానిని రక్షించడంలో.. పూజించేవారు. ఓ సందర్బంలో తాను ఓ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చిందని..ఆ సమయంలో రిజర్వ్డ్ కోచ్ లో ప్రయాణం చేయడానికి తన వద్ద డబ్బు లేదని..రైలులో రద్దీగా ఉండే కోచ్ లో ఎక్కి ప్రయాణించినట్లు తన జ్నాపకాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
రైలులో కూర్చొనేందుకు సీటు లేకపోవడంతో వార్తపత్రికలను కింద వేసుకుని కూర్చునేవాడనని చెప్పారు. తబలా ఎవరి పాదాలు, చెప్పులు తగలకుండా ఉండేందుకు దానిని తన ఒడిలో పెట్టుకునేవాడినంటూ చెప్పారు. ప్రయాణం సాగుతున్నంత సేపు తన తబలా తన ఒడిలో పెట్టుకునేవారట. సంగీత యాత్రలో డబ్బు లేకపోవడంతో కుటుంబానికి కూడా చాలా కాలం పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. నిరంతరం ఆర్ధిక పోరాటాలు చేశానని..ఆర్థికంగా కాస్త మెరుగుపడినప్పుడు సంగీత సమయం నుంచి కాస్త సమయాన్ని తన కుంటుంబం కోసం కేటాయించేవాడిని చెప్పారు.
భారతీయ శాస్త్రీయ సంగీతానికి గొప్ప సహకారం:
సవాళ్లతో నిండిన మార్గాన్ని అధిగమించి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు జాకీర్ హుస్సేన్. తబలా వాయించినప్పుడల్లా, ప్రజలు కొత్త ప్రపంచంలోకి ప్రయాణిస్తూ ఆనందించేవారు. భారతీయ శాస్త్రీయ సంగీత అభివృద్ధికి ఉస్తాద్ విశేష కృషి చేశారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. 2009లో జాకీర్ హుస్సేన్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంగీత పురస్కారం గ్రామీ అవార్డు కూడా లభించింది.