Cinema News: బడ్జెట్ 12 కోట్లు.. నష్టం 3500 కోట్లు.. ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు బ్రో!
Cinema News: 12 కోట్ల సినిమాతో 3,500 కోట్ల IPO నష్టం వచ్చింది. ఇది ఇండియా కార్పొరేట్ చరిత్రలో అరుదైన ఘటనగా నిలిచింది.

Cinema News: బడ్జెట్ 12 కోట్లు.. నష్టం 3500 కోట్లు.. ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు బ్రో!
Cinema News: ఒక చిన్న సినిమా కోసం తీసుకున్న నిర్ణయం, ఒక పెద్ద కంపెనీకి వేల కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టిందంటే నమ్మడం కష్టమే కానీ, ఇది నిజమే. ఇందిరా IVF అనే ప్రముఖ పేరెంట్ సంస్థ రూ.3,500 కోట్ల విలువైన IPO తో మార్కెట్‌లోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతుండగా, ఒక్క సినిమా ఆ ప్రణాళికను పూర్తిగా గందరగోళంలోకి నెట్టేసింది. ఈ సినిమా పేరు "తుమ్కో మేరీ కసమ్". దీని బడ్జెట్ కేవలం 12 కోట్లు మాత్రమే అయినా.. దాని ప్రభావం ఎంతో ఎక్కువగా మారింది.
ఇందిరా IVF వ్యవస్థాపకుడు అజయ్ ముర్దియా జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. సినిమా ఒక రకంగా వారి విజయ గాధను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతోనే తీసినప్పటికీ.. అందుకు వచ్చిన ఫలితం మాత్రం ఇందిరా IVF ఊహించనిది. సినిమాకు సరైన స్పందన రాలేదు. బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమవడమే కాకుండా, మొదటి ఐదు రోజుల్లో కేవలం 54 లక్షల రూపాయలకే పరిమితమైంది. దీంతో.. కంపెనీ మీద అనేక ప్రశ్నలు తలెత్తాయి. పెట్టుబడిదారులు, మార్కెట్ నియంత్రణ సంస్థలు.. అందరూ ఆర్థిక పారదర్శకత గురించి సందేహాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఒక ఆరోపణ తీవ్రంగా వినిపించింది. కంపెనీ నిధులతోనే సినిమా తీశారన్నది. ఇదే విషయాన్ని ఆధారంగా తీసుకొని సెబీ కంపెనీ IPO పై బ్రేక్ వేసింది. కంపెనీ నిధులు ఇలా వినియోగించడం వాటాదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్న అభిప్రాయం ఈ నిర్ణయానికి దారితీసింది.
ఇదంతా జరుగుతున్న సమయంలో సోషల్ మీడియా కూడా ఊరుకోలేదు. కొన్ని వర్గాలు దీనిని పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దారితప్పించే చర్యగా చూస్తే, మరికొంతమంది తమ జీవిత కథను అందంగా చెప్పాలనే ప్రయత్నంగా చూశారు. కానీ చివరికి ఇది ఇందిరా IVF కి పెద్ద ఇమేజ్ సమస్యగా మారింది. గతంలో సెబీ కొన్ని కంపెనీలపై ప్రకటనలు, ప్రమోషన్‌ల విషయంలో చర్యలు తీసుకున్నా, ఒక సినిమా వల్ల IPO ఆగిపోవడం మాత్రం ఇదే మొదటిసారి. ఒక చిన్న సినిమా వల్ల ఎంతటి ప్రభావం ఉంటుందో ఈ ఘటన స్పష్టంగా చూపించింది. అది మంచి అయినా కావొచ్చు, లేదా చెడు అయినా కావొచ్చు.. ఒక నిర్ణయం ఎంత పెద్ద మార్పులకు దారితీయగలదో ఇది ఉదాహరణ.