Allu Arjun meets Chiranjeevi: తనే కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్
Allu Arjun meets Chiranjeevi: అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. నిన్న ఉదయం చంచల్ గూడ జైలు నుండి రిలీజ్ అయిన తరువాత అల్లు అర్జున్ చిరంజీవివి కలవడం ఇదే మొదటిసారి. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారన్న విషయం తెలుసుకున్న చిరంజీవి తన సినిమా క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన భార్య సురేఖతో కలిసి అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ కు ఏమీ కాదని అరవింద్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. నాగబాబు కూడా వారిని కలిసి పరామర్శించారు.
అల్లు అర్జున్ కు బెయిల్ ఇప్పించడం కోసం లాయర్లను సంప్రదించడం వంటి అన్ని పనుల్లో చిరంజీవి అల్లు అరవింద్ కుటుంబానికి అండగా నిలిచినట్లు వార్తలొచ్చాయి. మొత్తానికి నిన్న ఉదయమే అల్లు అర్జున్ బెయిల్‌పై విడుదలై చంచల్‌గూడ జైలు నుండి ఇంటికి చేరుకున్నారు. అందుకే తన కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచిన మామ చిరంజీవిని కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకే అల్లు అర్జున్ అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ వస్తున్నారన్న రాకతో చిరంజీవి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో అభిమానులు, మీడియా వాళ్లు అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ స్వయంగా తనే బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు నడుపుకుంటూ వచ్చిన విజువల్స్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన వెంట భార్య స్నేహ రెడ్డి, పిల్లలు ఉన్నారు.