RRR Movie Review Telugu: బొమ్మ బ్లాక్ బస్టర్.. ఎన్టీఆర్, రాంచరణ్ ఒకరిని మించి ఒకరు...

RRR Movie Review Telugu: రామ్, భీమ్ ఇద్దరు కలిసి బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎలా గడగడలాడించారు అనే ప్రశ్నలకు సమాధానమే RRR మూవీ కథ.

Update: 2022-03-25 01:30 GMT

RRR Movie Review Telugu: బొమ్మ బ్లాక్ బస్టర్.. ఎన్టీఆర్, రాంచరణ్ ఒకరిని మించి ఒకరు... 

RRR Movie Review Telugu: 

చిత్రం: ఆర్ ఆర్ ఆర్

నటీనటులు: రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్, శ్రియ శరణ్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడీ, సముతిరఖని, అజయ్ దేవగన్, తదితరులు

సంగీతం: ఎమ్ ఎమ్ కీరవాణి

సినిమాటోగ్రఫీ: కే కే సెంథిల్ కుమార్

నిర్మాత: డీ వీ వీ దానయ్య

దర్శకత్వం: ఎస్ ఎస్ రాజమౌళి

బ్యానర్: డీ వీ వీ ఎంటర్టైన్మెంట్స్

విడుదల తేది: 25/03/2022

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమా "ఆర్ ఆర్ ఆర్". బాహుబలి తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ఇది. రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీడియో పాటలు, టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకుల అంచనాలను మరొక స్థాయికి తీసుకెళ్లాయి. ఇక బోలెడు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఇవాళ అనగా మార్చి 25న విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను ఎంతవరకు రీచ్ అయ్యిందో చూసేద్దామా..

కథ:

సినిమా కథ మొత్తం స్వతంత్రానికి ముందు 1920 బ్యాక్ డ్రాప్ తో ఆదిలాబాద్ జిల్లా లో జరుగుతుంది. అక్కడ ఒక ఊరిలో మల్లి అనే ఒక అమ్మాయి గొంతు చాలా బాగుండడంతో బ్రిటిషర్లు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఆమెను తిరిగి తీసుకురావాలని గొండ్ల కాపరి భీం (ఎన్టీఆర్) నిర్ణయించుకుంటాడు. మరోవైపు భీమ్ ను పట్టుకోవడానికి రామ్ (రామ్ చరణ్) రంగంలోకి దిగుతాడు. మరి భీమ్ ను రామ్ పట్టుకోగలిగాడా? లేకపోతే భీమ్ కథ విన్నాక అతనికి సహాయపడాలని అనుకున్నాడా? చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

ఇద్దరు స్టార్ లను తెరపై చూపించటంలో కష్టం అనిపించలేదా అని అడిగిన ప్రతిసారీ రాజమౌళి సినిమా మొదలైన పది నిమిషాలకే హీరోలకంటే పాత్రలు కనిపిస్తాయని అన్నారు. సినిమా చూస్తున్నప్పుడు ఆ మాట నూటికి నూరుపాళ్ళు నిజం అని అనిపిస్తుంది. రామ్ మరియు భీం పాత్రలలో చెర్రీ, ఎన్టీఆర్ ఒదిగి పోయి తమ నట విశ్వరూపాన్ని చూపించారు. హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంది. అజయ్ దేవగన్ నటన ఈ సినిమాకి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఓలివియ తన పాత్రకు న్యాయం చేసింది.

సాంకేతిక వర్గం:

తన అద్భుతమైన విజన్ ను ఉన్నది ఉన్నట్టుగా ప్రేక్షకులకు చూపించడంలో రాజమౌళి ని కొట్టేవారు లేరు. "ఆర్ఆర్ఆర్" సినిమాలో కూడా రాజమౌళి తెలుగు ప్రేక్షకులను మరొకసారి తలెత్తుకునేలా చేశారు. స్టోరీ టెల్లింగ్ లో రాజమౌళి కి వంకలు ఎవరు పెట్టలేరు. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేదాకా కథను ఆసక్తికరంగా తీసుకెళ్లగల దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాతో కూడా దానిని మరొకసారి నిరూపించుకున్నారు రాజమౌళి. ఎం ఎం కీరవాణి సంగీతం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. నేపథ్య సంగీతం ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్ గా మారింది. కానీ పాటలు మాత్రం యావరేజ్ గా నిలిచాయి. సినిమాటోగ్రఫర్ సెంథిల్ ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ ను అందించారు. ముఖ్యంగా అడవి సన్నివేశాలు, నైట్ షాట్స్ ను చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా సినిమా కి మంచి మార్కులు పడ్డాయి.

బలాలు:

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్

ఇద్దరి ఇంట్రడక్షన్ సన్నివేశాలు

ఎలివేషన్లు

ఇంటర్వెల్

ఆఖరి 30 నిమిషాలు

బలహీనతలు:

సెకండ్ హాఫ్ లోని డ్రామా

కథని కొంచెం డ్రాగ్ చేయడం

రామ్ సీత క్యారెక్టర్

చివరి మాట:

ఇద్దరు హీరోలకు ఈ సినిమాలో ఓకే ప్రాధాన్యత ఉంది. సినిమా మొత్తం వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ని చాలా అద్భుతంగా చూపించారు. వీరిద్దరి ఇంట్రడక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనులవిందు చేసేలా ఉంటాయి. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే లైట్ హార్టెడ్ కామెడీ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. రాజమౌళి నెరేషన్ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంది. సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రామా ఎక్కువగా ఉన్నప్పటికీ నటీనటులు, నేపథ్య సంగీతం, మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించవు. ఇక రాజమౌళి తన కథకి అద్భుతమైన ఎండింగ్ కూడా ఇచ్చారు. ఆఖరి 30 నిమిషాలు రోమాలు నిక్క పొడుచుకునేలా ఉంటుంది. చివరిగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది.

బాటమ్ లైన్:

"ఆర్ ఆర్ ఆర్" సినిమా అంచనాలకు మించి ప్రేక్షకులను అలరిస్తుంది.

Tags:    

Similar News