Kalyan Ram: బింబిసార మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Bimbisara Movie Review: బింబిసార మూవీ రివ్యూ .. సినిమా ఎలా ఉందంటే?

Update: 2022-08-05 08:33 GMT

Kalyan Ram: బింబిసార మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Bimbisara Movie Review: 

చిత్రం: బింబిసార

నటీనటులు: కళ్యాణ్ రామ్, క్యాథరిన్ తెరెసా, సంయుక్త మీనన్, వరినా హుస్సేన్, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మాజీ, సాయి కిరణ్ తదితరులు

సంగీతం: ఎం ఎం కీరవాణి

సినిమాటోగ్రఫీ: చోటా కే నాయుడు

నిర్మాత: హరి కృష్ణ కే

దర్శకత్వం: మల్లిడి వశిష్ట్

బ్యానర్: ఎన్ టీ ఆర్ ఆర్ట్స్

విడుదల తేది: 05/08/2022

ఈమధ్యనే "118", "ఎంత మంచి వాడవు రా" సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా ఇప్పుడు "బింబిసారా" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సోషియో ఫాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అత్యంత క్రూరమైన రాజైన బింబిసారుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనుంది. బింబిసారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అయితే అప్పట్లో మగధరాజ్యాన్ని పాలించిన బింబిసారుడు టైం ట్రావెల్ చేసి ప్రజెంట్ కి వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ పై ఈ సినిమా కథ రన్ అవుతుంది. కేథరిన్ తెరిసా మరియు సంయుక్త మీనన్లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైలర్ మరియు ప్రమోషన్లతో బాగానే ఆకట్టుకున్న ఈ చిత్రం తాజాగా ఇవాళ అనగా ఆగస్టు 5, 2022న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూసేద్దామా..

కథ:

త్రిగర్తల ను రాక్షసత్వం కలిగిన బింబిసారా (కళ్యాణ్ రామ్) అనే ఒక క్రూరమైన రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి దేవదత్త (కళ్యాణ్ రామ్) అనే ఒక ట్విన్ బ్రదర్ కూడా ఉన్నాడు. కానీ బింబిసారుడి లా కాకుండా దేవ దత్త చాలా మంచిగా, దయ కలిగిన వాడై ఉండేవాడు. ఒకసారి ఇద్దరూ అన్న తమ్ముళ్ళకి జరిగిన ఒక గొడవ తర్వాత బింబిసార అనుకోకుండా ప్రస్తుతానికి వచ్చేస్తాడు. అలా టైం ట్రావెల్ చేసిన ఒకప్పటి క్రూరమైన రాజు ప్రస్తుతం ఉన్న ప్రపంచానికి ఎలా అడ్జస్ట్ అయ్యాడు? అతని మనసు మారిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

కళ్యాణ్ రామ్ నటన ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. విభిన్న షేడ్స్ ఉన్న పాత్ర అయినప్పటికీ కళ్యాణ్ రామ్ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. ముఖ్యంగా ఫ్లాష్ ప్యాక్ లో రాజు పాత్రలో కళ్యాణ్ రామ్ చాలా బాగా నటించారు. కేథరిన్ తెరిసా తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి యువరాణి ఐరా పాత్రలో చాలా బాగా నటించింది. వైజయంతి పాత్రలో సంయుక్తా మీనన్ కూడా మంచి మార్కులు వేయించుకుంది. వెన్నెల కిషోర్ మరియు శ్రీనివాస్ రెడ్డిల కామెడీ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. బ్రహ్మాజీ తన నటనతో బాగానే ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ కూడా తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

తన మొట్టమొదటి సినిమా అయినప్పటికీ దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఒక కంటెంట్ ఉన్న కథను ఎంచుకున్నారు. ఇలాంటి విభిన్న కాన్సెప్ట్ ఉన్న సినిమాని ఈ మధ్యకాలంలో తెలుగులో చూసింది లేదు. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. స్టోరీ ఎగ్జిక్యూషన్ మరియు నెరేషన్ విషయంలో డైరెక్టర్ మల్లిడి వశిష్ట అంచనాలను అందుకున్నారని చెప్పుకోవాలి. స్క్రీన్ ప్లే కూడా సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు చాలా ఆసక్తికరంగానే నడిచింది. కీరవాణి అందించిన సంగీతం సినిమాకి బాగానే ప్లస్ అయింది. నేపథ్య సంగీతం బాగున్నప్పటికీ పాటలు అంతగా మెప్పించలేకపోయాయి. చోటా కె నాయుడు సినిమాకి చాలా మంచి విజువల్స్ అందించారు. ఎడిటింగ్ పరవాలేదు అనిపిస్తుంది. ఫాంటసీ సినిమా కాబట్టి విషయం మరియు గ్రాఫిక్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అని తెలుస్తోంది.

బలాలు:

కాన్సెప్ట్

స్క్రీన్ ప్లే

నటీనటులు

బలహీనతలు:

విలన్ పాత్ర స్ట్రాంగ్ గా లేకపోవడం

అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు

చివరి మాట:

సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం బింబిసారుడి పాత్ర మీదే నడుస్తూ ఉంటుంది. మొదటి సినిమా కాబట్టి ఎగ్జిక్యూషన్ పరంగా కొన్ని తప్పిదాలు కనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అవి తగ్గిపోతాయి. సినిమా ఇంటర్వెల్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా ప్రేక్షకులను కట్టిపడేసే విధంగానే ఉంది.అయితే సినిమా నచ్చాలంటే లాజిక్స్ ని మాత్రం పక్కన పెట్టాల్సిందే. చిన్న పాప పాత్రని కథలో బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఇక సరికొత్త కాన్సెప్ట్ తో ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది.

బాటమ్ లైన్:

క్రూరమైన రాజు "బింబిసార" పాత్రలో అలరించిన కళ్యాణ్ రామ్.

Tags:    

Similar News