Valimai Review: అజిత్ 'వలీమై' సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే..
Valimai Review: అజిత్ 'వలీమై' సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే..
చిత్రం: వలిమై
నటీనటులు: అజిత్, కార్తికేయ, హ్యుమ ఖురేషి, బాని జే, యోగి బాబు తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: నిరావ్ షా
నిర్మాత: బోనీ కపూర్
దర్శకత్వం: హెచ్ వినోద్
బ్యానర్లు: జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్
విడుదల తేది: 24/02/2022
ఈ మధ్యనే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "పింక్" సినిమా తమిళ్ రీమేక్ అయిన "నెర్కొండ పార్వయి" లో నటించి సూపర్ హిట్ ని అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజాగా ఇప్పుడు ఆ సినిమాకి దర్శకత్వం వహించిన హెచ్ వినోద్ దర్శకత్వంలో "వాలిమై" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు కార్తికేయ విలన్ గా కనిపించనున్నారు. హ్యుమా ఖురేషి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఇవాళ అనగా ఫిబ్రవరి 24, 2022 న విడుదలైంది. తమిళంలో "వాలిమై" అనే టైటిల్తో విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..
కథ:
ఒక తెలివైన క్రిమినల్ (కార్తికేయ) బైక్ గ్యాంగ్ మాఫియాని నడుపుతుంటాడు. చెన్నైలో చైన్ స్నాచింగ్ మరియు కొన్ని డ్రగ్ సంబంధించిన క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తమిళ్ నాడు ప్రభుత్వం ఈ క్రైమ్ ని ఆపడానికి పోలీస్ ఆఫీసర్ అర్జున్ (అజిత్) ని ఎంపిక చేస్తుంది. మరి అర్జున్ ఈ క్రైమ్స్ ని ఆపగలడా? విలన్స్ కి దీటుగా అర్జున్ పోరాడగలిగాడా? చెన్నైలో జరుగుతున్న క్రైమ్స్ ని ఆపగలిగాడా? చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
నటీనటులు:
అజిత్ నటన ఈ సినిమాకి అతి పెద్ద ఎస్సెట్ గా చెప్పుకోవచ్చు. తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేసి సినిమాని తన భుజాలపై నడిపించాడు అజిత్. ఒక పోలీస్ ఆఫీసర్ ఈ పాత్రలో తనదైన స్టైల్ తో అందరిని ఆకట్టుకున్నాడు. నటన పరంగా కూడా మంచి మార్కులు వేయించుకున్నాడు. రియల్ లైఫ్లో కూడా అజిత్ బైక్ రేసర్ కాబట్టి బైక్ రేసింగ్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. "గ్యాంగ్ లీడర్" తర్వాత మళ్లీ ఒక విలన్ పాత్రలో కార్తికేయ చాలా బాగా నటించాడు. విలన్ గా కూడా తెరపై అద్భుతమైన నటన కనబరిచాడు కార్తికేయ. హ్యూమా ఖురేషి కి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర లభించింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కూడా చాలా బాగా నటించింది. యోగి బాబు కామెడీ బాగానే వర్కౌట్ అయింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక వర్గం:
సతురంగ వేట్టై, తీరం అధిగారం ఒండ్రు (తెలుగులో ఖాకీ) వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన హెచ్ వినోద్ ఈ సినిమాలో కూడా తన టేకింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఫస్ట్ హాఫ్ లో బోలెడు డ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కథని చాలా ఆసక్తికరంగా ముందుకు నడిపిన డైరెక్టర్ సెకండాఫ్ లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ లో హెచ్ వినోద్ రైటింగ్ చాలా డల్ గా అనిపించింది. ఎమోషనల్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రేక్షకుల మూడ్ పాడు చేసినట్లు అనిపిస్తుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా ఈ సినిమాకి మంచి విజువల్స్ ను అందించారు. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.
బలాలు:
నిర్మాణ విలువలు
యాక్షన్ సన్నివేశాలు
అజిత్ నటన
నేపథ్య సంగీతం
బలహీనతలు:
సెకండ్ హాఫ్ లో ని సెంటిమెంట్ సన్నివేశాలు
సెకండ్ హాఫ్ లో ని స్లో నరేషన్
రన్ టైం ఎక్కువగా ఉండటం
చివరి మాట:
సినిమా కథ చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. నగరంలో జరుగుతున్న క్రైమ్స్ ను డైరెక్టర్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసారు. బైక్ మాఫియా సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. ఇంటర్వెల్ సన్నివేశం కూడా సినిమాకి హైలెట్ గా చెప్పొచ్చు. ఫస్టాఫ్ చాలా ఫాస్ట్ గా ఆసక్తికరంగా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ లో కథ ఉన్నట్లుండి చాలా స్లో అయిపోతుంది. త్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను పక్కకు పెట్టి డైరెక్టర్ సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచారు. సెకండ్ హాఫ్ లో కూడా సెంటిమెంట్ డోస్ ని తగ్గించి ఆసక్తికరంగా మార్చి ఉంటే బాగుండేది. చివరిగా "వలిమై" ఒక యావరేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా చెప్పుకోవచ్చు. యాక్షన్ సన్నివేశాలు నచ్చే ప్రేక్షకులు సినిమాని బాగానే ఎంజాయ్ చేస్తారు.
బాటమ్ లైన్:
కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ "వాలిమై" సెంటిమెంట్ తో బోర్ కొట్టేస్తోంది.