Karthika Masam: కార్తీకమాసంలో ఉపవాసం ఎలా చేయాలి..పవిత్ర స్నానాలకు ప్రత్యేకత ఇదే
Karthika Masam: కార్తీక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నెలలో చేసే వ్రతాల వల్ల పుణ్య సముపార్జన సులభతరం అవుతుందని కార్తీకమాసం కథ వివరిస్తోంది.
Karthika Masam Puja Vidhi: కార్తీక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నెలలో చేసే వ్రతాల వల్ల పుణ్య సముపార్జన సులభతరం అవుతుందని కార్తీకమాసం కథ వివరిస్తోంది. శరద్రుతువు ఉత్తరార్థంలో వచ్చే కార్తీకమాసంలో రోజూ ఓ పర్వదినమే అని చెప్పవచ్చు. ఈ కార్తీకమాసంలో సమానమైన మాసం లేదన అత్రి మహర్షి అగస్త్యూడికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. నెలరోజులపాటు కార్తీక పురాణాన్ని రోజుకోక అధ్యాయనం వంతున చదవటం, వినటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతుంటారు.
ఈ పురాణ క్రమాన్ని పరిశీలించినట్లయితే తొలిగా విశిష్ట మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస వైభవాన్ని వివరించిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. నైమిశారణ్యంలో సత్రయాగ దీక్షలో ఉన్న శౌనకాది మునులకు వశిష్టుడు జనకుడికి చెప్పిన విశేషాలనే సూతుడు మరింత వివరంగా చెప్పడాన్ని బట్టి కూడా ఈ కార్తీక మాసం గొప్పతనం విశిదమవుతుంది.
పవిత్ర స్నానాలకు ఉన్న ప్రత్యేకత ఇదే:
కార్తీక మాసంలో నదీస్నానం, ఉపవాసం, పురాణపఠన శ్రవణాలు, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, దైవపూజ, వన సమారాధన లాంటివన్నీ జరపాలి. విష్ణువు ఆషాడ శుక్ల దశమినాడు పాలకడలిలో శేషతల్పం మీద యోగనిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుక్ల ద్వాదశినాడు నిద్ర నుంచి లేస్తాడంటారు. అందుకే ఈ నెలకు భక్తులు మరింత ప్రాముఖ్యతనిస్తుంటారు. ఈ కారణంగానే పవిత్ర స్నానాలకు ఈ మాసంలో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.
కార్తీకంలో శివాలయంలోనైనా, వైష్ణవాలయంలోనైనా సంధ్యా సమయంలో దీపం పెట్టి స్వామిని పూజిస్తే మేలు జరుగుతుందని అంటుంటారు. కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం, మోక్ష ప్రాప్తి లభిస్తుంది చెబుతుంటారు. ఈ మాసంలో వచ్చే సోమవారానికి మరింత విశిష్టత ఉంటుంది. ఆ రోజున చేసే స్నాన, దాన, జపాదులు అధిక ఫలితాన్ని ఇస్తాయి. ఆలయాల్లో చేసే దీపమాలకి సమర్పణం కూడా సర్వపాప హరణమని చెబుతుంటారు.
ఉపవాసం విధానమిది:
కార్తీక మాసం నెలరోజులు చేయాల్సిన విధులను, వ్రతాలను కార్తీకపురాణం చెబుతోంది. రోజూ అర్చన, అగ్నిపూజ నిర్వహించాల్సి ఉంటుంది. సాయంత్రంపూట విధిగా ఆలయంలో దీపం పెట్టి దేవుడికి నైవేద్యాలను సమర్పించాలి. ఇలా కార్తీకమాసం మొదటిరోజు నుంచి చివరిరోజు వరకు చేయాలి. కార్తీకపురాణంలో రెండో అధ్యాయంలో వశిష్టుడు కార్తీక సోమవారం వ్రతాన్ని గురించి చెప్పాడు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలాదానం అనే 6 రకాలుగా సోమవారం వ్రతం ఉంటుంది.
కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసం చేసి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించటం ఉపవాసంగా చెబుతారు. అలా చేయుట సాధ్యం కాని వాళ్లు ఉదయం పూట యథావిధిగా స్నాన, దాన, జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం శివ తీర్థాన్నో లేదా ప్రసాదమో స్వీకరిస్తారు. ఇలా చేయడాన్ని ఏకభుక్తం అంటారం.
పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయడాన్ని నక్తం అంటారు. తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు. దీన్ని అయాచితం అంటారు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం అనే నాలుగింటిలో ఏది చేయలేని వారు కార్తీక సోమవారం సమంత్రక స్నానం జపాదులు చేయవచ్చు. మంత్రాలు, జపాలు కూడా తెలియని వాళ్లు నువ్వులు దానం చేసినా సరిపోతుంది. దీన్నే తిలా దానం అంటారు. ఈ 6 విధానాల్లో కనీసం ఏదో ఒకటి ఆచరించడం శ్రేయస్కరమని శివపురాణం చెబుతోంది.