Thati Munjalu: ఎండ వేడికి ఐస్ యాపిల్స్ తో చెక్.. ఒంటికి చల్లదనమే కాదు, మరెన్నో లాభాలు..!
Ice Apple Benefits: వేసవిలో లభ్యం అయ్యే మామిడి సీజనల్ ఫ్రూట్. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
Ice Apple Benefits: వేసవిలో లభ్యం అయ్యే మామిడి సీజనల్ ఫ్రూట్. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మామిడితో పాటు మరొకటి కూడా ఈ వేసవిలో లభ్యం అవుతుంది. అవే తాటి ముంజలు. మండే ఎండల్లో తాజా ముంజెలను తింటే మన శరీరానికి చల్లదనమే కాదు పలు అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. మృదువుగా ముట్టుకుంటే జారిపోయేంత సున్నితంగా ఉండే ఈ ముంజలను అలా నోట్లో వేసుకుంటే చల్లగా కడుపులోకి జారుకుంటాయి. అందుకే వీటిని ఐస్ యాపిల్స్ అని కూడా అంటారు. ఈ ముంజల్లో విటమిన్ ఏ, బీ, సీ, ఐరన్, కాల్షియంతో పాటు బీకాంప్లెక్స్, నియాసిన్, రిబో ఫ్లేవిన్, దయామిన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం తదితర పోషకాలు కూడా ఉంటాయి.
ముంజలను తింటే కాలేయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ముంజల్లోని పొటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలను తొలిగిస్తాయి. అయితే లేత తాటిముంజలు తింటుంటే వాటిపై ఉండే తొక్కను తొలగించకుండా తినేయండి. అందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి.
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ముంజలు ఎంతో ఉపయోగపడతాయి. జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారికి ఇవి మేలు చేస్తాయి. ఇవి బరువును అదుపులో ఉంచుతాయి. పిల్లలకు వృద్ధులకు కూడా అత్యంత మేలు చేస్తాయి. వేసవిలో వచ్చే చర్మ సమస్యలను నివారిస్తుంది. దద్దుర్లు, గాయాలు, చెమట కాయలు ఏర్పడినట్లయితే తాటి ముంజల గుజ్జుని శరీరానికి పట్టించి చూడండి. కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. తాటిముంజలు శరీరాన్ని డీహైడ్రేషన్ బారినపడకుండా చూస్తాయి. ఎండల్లో దాహార్తిని తీర్చడమే కాదు వడదెబ్బ తగిలినవాళ్లకు ముంజలను జ్యూస్ గా చేసి పట్టిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటిముంజలో ఉంటుందని, ఇవి బీపీని అదుపు చేయడమే కాకుండా కొవ్వును అదుపులో ఉంచుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎముకలను బలంగా ఉంచేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ముంజలు చాలా మంచివట. తాటి ముంజల్లో స్వచ్ఛమైన రుచికరమైన నీరు ఉంటుంది. ఆ నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే క్యాన్సర్ కణాల నిరోధకానికి ముంజలు ఉపయోగపడతాయి. రొమ్ము క్యాన్సర్ కు కారణమయ్యే పెట్రో కెమికల్స్, ఎసిడిటీ సమస్యలను తాటి ముంజలు దూరం చేస్తాయి.