Health Benefits of Coconut Water in winter season: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను పెంపొందించేందుకు, డీహైడ్రేషన్ సమస్యను దూరం చేయడానికి కొబ్బరి నీళ్లు బాగా సహాయపడతాయి. అయితే చలికాలం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. ఇంతకీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలంతో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలం నీటిని తక్కువగా తీసుకుంటుంటాం. ఈ కారణంగానే డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కొబ్బరి నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో డీహైడ్రేషన్ సమస్య దూరమవుతుంది. అలాగే చలికాలం చర్మ పగలడం సమస్యకు కూడా కొబ్బరి నీరు క్రీయాశీలకంగా పనిచేస్తుంది.
కొబ్బరి నీళ్లలో శరీరాన్ని హైడ్రేటింగ్ చేసే గుణాలు ఉంటాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి. చలికాలంలో వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా కొబ్బరి నీరు ఉపయోగడుతుంది. ముఖ్యంగా ఎసిడిటీతో వచ్చే పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి వటి సమస్యలన్నీ దూరమవుతాయి.
చలికాలంలో వచ్చే రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలను దరిచేరనివ్వకుండా చేయడంలో కొబ్బరి నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం కంటెంట్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కొబ్బరి నీటిలో ఉండే ఎంజైమ్‌లు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. దీంతో శరీరం తాజాగా ఉంటుంది. చలికాలంలో చర్మం పొడిబారడం సమస్య నుంచి బయటపడొచ్చు అని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.