Animal to Human: జంతువుల నుంచి మానవులకి వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి.. కారణాలు ఇవే..!
Animal to Human: గత కొన్ని సంవత్సరాలుగా జంతువుల నుంచి మానవులకి వ్యాపించే రోగాలు పెరుగుతున్నాయి. బర్డ్ ఫ్లూ, కరోనా , నిపా వైరస్ , ఎబోలా వంటి అనేక వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నాయి.
Animal to Human: గత కొన్ని సంవత్సరాలుగా జంతువుల నుంచి మానవులకి వ్యాపించే రోగాలు పెరుగుతున్నాయి. బర్డ్ ఫ్లూ, కరోనా , నిపా వైరస్ , ఎబోలా వంటి అనేక వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నాయి. బర్డ్ ఫ్లూ, కరోనా వంటివి ఎంతటి విధ్వంసం సృష్టించాయో అందరికి తెలుసు. వైద్యశాస్త్రం ప్రకారం జంతువుల నుంచి మానువులకి సోకే వ్యాధులని జూనోసిస్ అంటారు. ఇలాంటి వ్యాధులకు ప్రధాన కారణాలు బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు. అయితే మానవులలో జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధులు ఎందుకు పెరుగుతున్నాయో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
60 శాతం వ్యాధులు జూనోటిక్
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మానవులలో 60 శాతం ఇన్ఫెక్షన్లు జూనోటికే. ఈ వ్యాధులు మానవ శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు సాల్మొనెలోసిస్ మానవ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఏవియన్, స్వైన్ ఫ్లూ, కోవిడ్ వంటివి మానవుల శ్వాసకోశ, నాడీ వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి.
విమాన ప్రయాణం
వాస్తవానికి జంతువుల నుంచి మానవులకి వ్యాపించే వ్యాధులు వేల సంవత్సరాలుగా ఉన్నాయి. అయితే గత 20 నుంచి 30 సంవత్సరాలలో ఇవి వేగంగా పెరిగాయి. శాస్త్రవేత్తలు దీనికి అనేక కారణాలను చెబుతున్నారు. ఉదాహరణకు అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరుగుదల కారణంగా అటువంటి వ్యాధుల ప్రమాదం పెరిగిందని చెప్పవచ్చు. విమాన ప్రయాణ సౌలభ్యం కారణంగా ఒక దేశంలో సంభవించే రోగాలు మరో దేశానికి చేరుతున్నాయి.
అడవుల్లో మానవ జోక్యం
గత కొన్ని దశాబ్దాలుగా అడవుల్లో మానవ జోక్యం పెరిగింది. పెరుగుతున్న జనాభా కారణంగా గృహాల పరిధిని పెంచడానికి అడవులని నరికివేస్తున్నారు. దీంతో వన్యప్రాణులు మనుషుల వద్దకి చేరుతున్నాయి. గతంలో అడవికే పరిమితమైన ప్రమాదం ఇప్పుడు మనుషులకు చేరుతోంది.
జంతువుల వ్యాపారం
ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం జోరందుకుంది. దీనివల్ల వ్యాధికారక జీవులు చేరుతున్నాయి. అలాగే జంతువుల వ్యాపారం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయి. వ్యాధి సోకిన జంతువులు ఒక దేశం నుంచి మరొక దేశానికి చేరుకోవడం వల్ల ప్రమాదం పెరుగుతుంది. కోవిడ్ విషయంలో ఇదే జరిగింది.
పక్షులలో ఇన్ఫెక్షన్
పక్షులలో ఇన్ఫెక్షన్ పెరగడం మనుషుల్లో వ్యాధులు రావడానికి కారణమవుతుంది. ఉదాహరణకు కేరళలో నిపా వైరస్ గబ్బిలాల ద్వారా వ్యాపించింది. వ్యాధి సోకిన గబ్బిలాలు తిన్న పండ్లని మానవులు తిన్నప్పుడు, ఇన్ఫెక్షన్ వారికి సోకుతుంది.
నాన్ వెజ్ ట్రెండ్
ప్రపంచంలో చాలా దేశాల్లో నాన్ వెజ్ డైట్ ట్రెండ్ బాగా పెరుగుతోంది. పూర్తిగా వండకుండా పచ్చి నాన్ వెజ్ తినడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ ఇన్ ఫెక్షన్ పెరుగుతోంది. దీనివల్ల కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి.