Lack of Sleeping: 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా.. ఏమవుతుందో తెలుసా?
Lack of Sleeping: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరైన నిద్రలేకపోతే ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నిద్రలేమి వల్ల మానసిక సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే తాజాగా పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రాత్రి సరిపడ నిద్రలేకపోతే హృదయ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని తేలింది. దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే అధిక రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది క్రమంగా గుండెపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి ఈ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
మంచి నిద్ర గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుందని అంటున్నారు. రాత్రి ఆలస్యంగా పడుకునే మహిళల్లో గుండె సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు ముప్పు 7 శాతం పెరుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే 5 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల నిద్ర 11 శాతం గుండె జబ్బుల ముప్పు పెరిగిందని ఈ అధ్యయనంలో తేలింది.
రోజులో కనీసం 7.30 నుంచి 8 గంటల నిద్ర ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా నిద్రలో తరచుగా మెలుకువ వస్తుండడం అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సుమారు పది లక్షల మందికిపైగా ప్రజల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ వివరాలు వెల్లడించారు. నిద్ర ఎంత తగ్గుతుంటే కాలక్రమేణ అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. నిద్రలేమితో పాటు మధుమేహం, ధూమపానం అలవాటు ఉన్న వారిలో ఈ ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.