Diabetes: చలికాలం షుగర్ లెవల్స్ ఎందుకు పెరుగుతాయి.? ఏం చేయాలంటే..
Diabetes: చలికాలం వచ్చిందంటే ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులకు చలికాలం తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుంది.
Diabetes: చలికాలం వచ్చిందంటే ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులకు చలికాలం తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుంది. చలికాలంలో షుగర్ లెవల్స్ పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయనిన నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైనవి వాతావరణంలో మార్పులతో పాటు వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా కారణమవుతాయి. అలాగే చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల కూడా రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చలికాలం షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండాలంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* సాధారణంగా చలికాలం చాలా మంది బద్ధకంతో వ్యాయామం చేయడం ఆపేస్తుంటారు. ఇది చాలా తప్పు. ఎంత చలి ఉన్నా కనీసం ఇంట్లో అయినా చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండాలి. శ్రమ తగ్గితే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. ఉదయం చలి ఎక్కువగా ఉంటే కనీసం సాయంత్రమైనా వాకింగ్ చేయాలని చెబుతున్నారు.
* ఇక చలికాలం తెలియకుండా ఎక్కువగా తినేస్తుంటాం. అందుకే తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. కొంచెం కొంచెం ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
* చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గడం సర్వ సాధారణమైన విషయం. ఈ సమయంలో వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను పెరిగిపోతాయి. అందుకే ఇమ్యూనిటీ పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం విటమిన్ సి ఎక్కువగా నారింజ వంటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* వింటర్‌లో షుగర్ లెవల్స్ పెరగడానికి విటమిన్ డీ లోపం కూడా ఒక కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే విటమిన్ డీ ఎక్కువగా లభించే ఆహారాన్ని భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పొద్దు తిరుగుడు సీడ్స్‌ను తీసుకోవాలి. అలాగే అవకాశం దొరికితే ఎండ పట్టున ఉండాలి.
* ఇక చలికాలం చాలా మంది నీటిని తక్కువగా తీసుకుంటారు. అయితే ఇది కూడా షుగర్ లెవల్స్ పెరగడానికి ఒక కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. చలిలో ఇన్సులిన్ పనితీరు తక్కువగా ఉంటుంది. ఫలితంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. నీరు తక్కువగా తాగితే శరీరంలో నీటి శాతం తక్కువై గ్లూకోజ్ బయటకు వెళ్లే అవకాశం ఉండదు. అందుకే చలికాలం కూడా సరిపడ నీటిని తీసుకోవాలని చెబుతున్నారు.
నోట్: ఈ సమాచారం ఆరోగ్యంపై ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.