Russia's Cancer Vaccine: రష్యా కనిపెట్టిన క్యాన్సర్ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది? ఇది ఎందుకంత ప్రత్యేకం?

Update: 2024-12-19 01:30 GMT

Things to know more about Russia developed Cancer Vaccine and why it is different from regular cancer medicine: క్యాన్సర్.. ఈ పేరు వింటే ఇప్పటికీ గుండెలో గుబులు కలుగుతుంది. రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినా ఇప్పటికీ ఇది పూర్తిగా నయమవుతుందన్న భరోసా లేదు. తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని ఇటీవలి వైద్య చికిత్సలు నిరూపిస్తున్నాయి. అయినప్పటికీ, క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. లాన్సెట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 2022లో 14 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అదే ఏడాది ఈ వ్యాధితో 9 లక్షల మందికి పైగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏటా దాదాపు 90 లక్షల మంది క్యాన్సర్‌తో చనిపోతున్నారు.

దశాబ్దాలుగా సాగుతున్న పరిశోధనలు కొంత మెరుగైన చికిత్సలను సూచిస్తున్నాయి. కానీ, ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఈ వ్యాధికి మందు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. అయితే, దీనికి పరిష్కారాన్ని మేం సాధించామని రష్యా ప్రకటించింది. క్యాన్సర్ వ్యాక్సీన్‌ను విజయవంతంగా అభివృద్ధి చేశామని 2025లోనే మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆ దేశం ప్రకటించడం ఇప్పుడొక సెన్సేషన్‌గా మారింది.

క్యాన్సర్ వ్యాక్సీన తయారు చేయడమే కాదు, దానిని ఉచితంగా ఇస్తామని కూడా రష్యా ప్రకటించింది. ఇప్పుడీ వార్త ప్రపంచమంతా వైరల్ అవుతోంది. ఇంతకీ రష్యా చెబుతున్న ఈ క్యాన్సర్ వ్యాక్సీన్ స్టోరీ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఎప్పుడు అందుబాటులోకొస్తుంది?

Full View

క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆశలు

క్యాన్సర్ వ్యాక్సీన్ తయారు చేశామని.. ఆ వ్యాక్సిన్‌తో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చని రష్యా చేసిన ప్రకటన ప్రపంచానికి కొత్త ఆశను చిగురించేలా చేసింది. క్యాన్సర్ చికిత్స‌లో ఈ వ్యాక్సీన్ కీలకం కావడంతో పాటు కొన్నిరకాల క్యాన్సర్స్ రాకుండా ఈ టీకా నివారిస్తుందని.. అక్కడి నేషనల్ రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్ బర్గ్ తెలిపారు. క్యాన్సర్ కణాలను నివారించడమే కాకుండా అవి ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకోవడంలోనూ తమ వ్యాక్సీన్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని అన్నారు.

క్యాన్సర్ రకాలు...

క్యాన్సర్ కణాలు శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలను నాశనం చేస్తూ వేగంగా విస్తరిస్తాయి. ఒక చోట మొదలై క్రమంగా విస్తరిస్తూ లంప్ గా మారతాయి. ఆ తరువాత శరీరమంతటా విస్తరిస్తాయి. ఈ ప్రాణాంతక కణజాలం పెరుగుదలని ఆపేందుకు రకరకాల చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని డాక్టర్లు చెబుతుంటారు. ఈ వ్యాధిలో చాలా రకాలున్నాయి. లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ల్యూకేమియా ఇలా రకరకాల క్యాన్సర్లు మానవజాతిని వేధిస్తున్నాయి.

క్యాన్సర్ చికిత్సలు - ఇబ్బంది పెట్టే సైడ్ ఎఫెక్ట్స్

ప్రస్తుతం క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. సర్జరీ, కీమోథెరపీ,రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ... ఇలా రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవి క్యాన్సర్‌ను నయం చేయడంలో కొంతమేరకు ఉపయోగపడేవే కానీ అన్ని సందర్భాల్లో జబ్బును శాశ్వతంగా నయం చేస్తాయనే గ్యారెంటీ లేదు. దీనికి తోడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తీవ్రంగా ఉంటున్నాయి. ఉదాహరణకు, కీమో థెరపీ తీసుకునే సందర్భంలో జుత్తు ఊడిపోవడం, నీరసంగా మారడం, చర్మం రంగు పాలిపోవడం వంటి దుష్ర్పభావాలు ఎదురవుతాయి.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రపంచ దేశాలు క్యాన్సర్ కు చెక్ పెట్టే వ్యాక్సీన్ కోసం పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. క్యాన్సర్ కు చికిత్స అందించే దిశగా కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ కణాలతో పోరాడే వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే లక్ష్యంగా ఇంకొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రష్యా ఆ ప్రయోగాల్లో తాము సక్సెస్ అయ్యామంటోంది.

క్యాన్సర్ వ్యాక్సీన్ రెండు రకాలు

క్యాన్సర్ వ్యాక్సీన్ రెండు రకాలుగా చెబుతారు. అందులో ఒకటి ప్రివెంటేటివ్ క్యాన్సర్ వ్యాక్సీన్. ఇది క్యాన్సర్ కణాలు శరీరంలో అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. ఇక రెండో రకం వ్యాక్సీన్స్ థెరపాటిక్ క్యాన్సర్ వ్యాక్సీన్. ఇది క్యాన్సర్ సోకిన వారికి మళ్ళీ జబ్బు తిరగబెట్టకుండా కాపాడుతుంది. ఈ రెండో రకం వ్యాక్సీన్ నే తయారు చేశామని రష్యా చెబుతోంది.

రష్యా క్యాన్సర్ వ్యాక్సీన్ ఎలా పనిచేస్తుంది?

ఈ వ్యాక్సీన్.. క్యాన్సర్ రోగిలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆరోగ్యవంతమైన కణాలు.. వ్యాధి కారక కణాలతో సమర్థంగా పోరాడేలా చేస్తుంది. ఇంకా, ఈ వ్యాక్సీన్ క్యాన్సర్ వ్యాధిని నయం చేయడమే కాకుండా, వ్యాధి మళ్ళీ రాకుండా ఇమ్యూనిటీ సిస్టమ్‌ను బూస్ట్ చేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఇది నివారిస్తుందని కూడా రష్యన్ సైంటిస్టులు చెబుతున్నారు.

ఏయే క్యాన్సర్లకు పనిచేస్తుందంటే..

బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్... ఇలా రకరకాల క్యాన్సర్ జబ్బులకు ఈ వ్యాక్సీన్ బాగా పని చేస్తుందని రష్యా చెబుతోంది. ఇంకా ఏయే రకమైన క్యాన్సర్ వ్యాధులకు ఈ వ్యాక్సీన్ పనిచేస్తుందనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది.

ఉచితంగా ఎందుకంటే...

ఈ వ్యాక్సీన్ ను ఉచితంగా అందించనున్నట్లు రష్యా చెప్పింది. క్యాన్సర్ తో బాధపడుతూ వ్యాక్సీన్ అవసరం ఉన్న వారికి, అలాగే చికిత్సను ఖరీదైన వ్యవహారంగా భావించే పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతోనే వ్యాక్సీన్ ఉచితంగా అందించేందుకు నిర్ణయించుకున్నామని రష్యా ప్రభుత్వం అంటోంది.

క్లినికల్ ట్రయల్స్, తయారీ లాంటి అన్ని సవాళ్లు అధిగమించి రష్యా వ్యాక్సీన్ అందరికీ అందుబాటులోకి వస్తే.... ఇది నిజంగానే యావత్ ప్రపంచానికి గేమ్ చేంజర్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

Tags:    

Similar News