ఏపీ ఎన్నికల బరిలో దిగుతున్న బీజేపీ 123 మందితో జాబితాను ప్రకటించింది. లోకేష్, చంద్రబాబుపై పోటీకి ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, పులివెందులలో జగన్‌పై మాత్రం పోటీకి అభ్యర్థిని ప్రకటించలేదు. మరి బాబుపై పోటీకి సై అంటున్న బీజేపీ జగన్‌పై పోటీకి అభ్యర్థిని నిలబెట్టకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 123 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజుకు మళ్లీ టికెట్ కేటాయించారు. మంగళగిరి నుంచి జగ్గారపు రామ్మోహన్ రావు బరిలో దిగనున్నారు. కుప్పం నుంచి తులసీనాథ్ చంద్రబాబుపై పోటీ చేయనున్నారు. అయితే, బీజేపీ ప్రకటించిన జాబితాలో పులివెందుల అభ్యర్థి పేరు లేదు. అభ్యర్థులు జాబితా ప్రకటనకు ఒక్కరోజు ముందు పార్టీలో చేరిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములుకు బద్వేల్ టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం.
ఇక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, గత ఎన్నికల్లో గెలుపొందిన మాణిక్యాల రావు పేర్లు ఆ జాబితాలో ఎక్కడా లేవు. రాజమండ్రి సిటీ నుంచి బొమ్ముల దత్తు పోటీ చేయనున్నారు.
రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలకు గాను ఆ పార్టీ 123 మంది అభ్యర్థులతోనే జాబితా ప్రకటించింది. అమిత్ షా నాయకత్వంలో సమావేశమైన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ అభ్యర్థులను ఫైనలైజ్ చేసింది. అయితే, కుప్పం, మంగళగిరిలో పార్టీ అభ్యర్థులను పోటీకి దింపిన అమిత్‌షా పులివెందులలో అభ్యర్థిని ప్రకటించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇప్పటికే వైసీపీ పూర్తి జాబితాను ప్రకటించగా టీడీపీ రెండు విడతల్లో 141 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. అలాగే, జనసేన, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు కూడా అభ్యర్థులను ఖరారు చేశాయి. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.