Shyam Benegal Passes Away: శ్యామ్ బెనగల్ కన్నుమూత

బెనగల్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ తిరుమలగిరిలో ఆయన జన్మించారు.

Update: 2024-12-23 14:45 GMT

Shyam Benegal Passes Away: శ్యామ్ బెనగల్ సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. బెనగల్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ తిరుమలగిరిలో ఆయన జన్మించారు. శ్యామ్ బెనగల్‌కు భార్య నీరా బెనగల్, బిడ్డ పియా బెనెగల్ ఉన్నారు. 

డిసెంబర్ 14నే శ్యామ్ బెనగల్ తన 90వ పుట్టిన రోజు జరుపుకున్నారు. కానీ ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు. గత కొన్నేళ్లుగా తన తండ్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, ఇప్పుడు ఆ సమస్య మరింత ఎక్కువ అవడం వల్లే చనిపోయారని పియా బెనెగల్ మీడియాకు చెప్పారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శ్యామ్ బెనెగల్ సినీ పరిశ్రమలో దేశం గర్వించదగిన దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు. 

90 ఏళ్ల వయస్సులో కూడా సినిమానే ఊపిరి

శ్యామ్ బెనెగల్ 90 ఏళ్ల వయస్సులో కూడా సినిమాలే ఊపిరిగా బతికారు. 90వ బర్త్ డే సందర్భంగా జాతీయ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన శ్యామ్ బెనెగల్... ప్రస్తుతం తాను రెండు, మూడు ప్రాజెక్ట్స్‌పై పని చేస్తున్నానని అన్నారు. ఆ మూడు కూడా ఒకదానికొకటి భిన్నమైనవే... బిగ్ స్క్రీన్ కోసం చేస్తున్నవే అని తెలిపారు.

బర్త్ డే అంటే అందరికి వయస్సు పెరగడం లాంటిదేనని, ఆరోజు తాను పెద్దగా వేడుకలు చేసుకోనని వ్యాఖ్యానించారు. ఆఫీసులో సిబ్బందితో కలిసి కేక్ కట్ చేయడం మాత్రమే జరుగుతుందన్నారు. శ్యామ్ బెనెగల్ వారానికి మూడుసార్లు డయాలసిస్ కోసం ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చినప్పటికీ... చివరి రోజుల్లో కూడా సినిమాలే ప్రపంచంగా బతికారు. 

శ్యామ్ బెనెగల్ ఆఖరి చిత్రం

ముజీబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్ శ్యామ్ బెనెగల్ చివరి చిత్రం. అంతకంటే ముందుగా 2010 లో వెల్ డన్ అబ్బా అనే సినిమా డైరెక్ట్ చేశారు. హైదరాబాదీ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అధికారుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఓ ముస్లిం వ్యక్తి కథే ఈ వెల్ డన్ అబ్బా. సరదాగా సాగిపోయే సన్నివేశాలతో ఈ సినిమా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. శ్యామ్ బెనెగల్ చిత్రాలు కమెర్షియల్ హిట్స్ కాకపోయినా... ఎన్నో సినిమాలు కల్ట్ క్లాసికల్ అనిపించుకున్నవే.

అనేక సామాజిక అంశాలపై శ్యామ్ బెనెగల్ సినిమాలు, డాక్యుమెంటరీలు, టీవీ సీరియల్స్ తెరకెక్కించి వాటిని తనదైన కోణంలో ప్రపంచం ముంగిట ఆవిష్కరించారు. భూమిక, జునూన్, మండి, సూరజ్ కా సాత్వా ఘోర, మామ్మో, సర్దారీ బేగం వంటి చిత్రాలు హిందీ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ సినిమాలుగా నిలిచాయి.

Tags:    

Similar News