చైనీయుల పాలిట యమపాశంగా జీరో కోవిడ్.. లాక్‌డౌన్లలోనే చనిపోతున్న ప్రజలు

China: చైనీయులను చంపేస్తున్న జీరో కోవిడ్‌

Update: 2022-11-26 15:00 GMT

China: జీరో కోవిడ్‌లో భాగంగా ఇళ్లకు తాళాలు.. మంటల్లో సజీవ దహనమైన 10 మంది 

China: జీరో కోవిడ్‌ పాలసీ చైనీయుల పాలిట యమపాశంగా మారింది. డ్రాగన్‌ కంట్రీలో వైరస్‌ కంటే.. జీరో కోవిడ్‌ పాలసీ పేరు వింటేనే భయంతో వణికిపోతున్నారు. జిన్‌జియాంగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. దీనికి కూడా జీరో కోవిడే కారణమని తాజాగా తెలిసింది. జిన్‌జియాంగ్‌లో ఇటీవల కరోనా కేసులు భారీగా పెరిగాయి. దీంతో ఆ ప్రాంతంలో చైనా అధికారులు లాక్‌డౌన్‌ విధించారు. అందులో భాగంగా.. జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ రాజధాని ఉరుమ్‌ఖ్వీలో ప్రజలు బయటకు రాకుండా బయటి వైపు నుంచి ఇళ్లకు తాళాలు వేశారు. ఈ క్రమంలో ఉరుమ్‌ఖ్వీ నగరంలో తియాన్‌షాన్‌ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లో రెండ్రోజుల క్రితం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు యత్నించారు. చూస్తుండగానే మంటలు చెలరేగి భవనమంతటా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా.. బిల్డింగ్‌ చుట్టూ కార్లు పార్క్‌ చేసి ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బందికి రెస్క్యూ ఆపరేషన్‌కు ఆ కార్లు ఆటంకంగా మారాయి. ఆ కార్లు లేకపోయినా.. ప్రాణాలు దక్కేవని స్థానికులు వాపోయారు.

ఝేంగ్‌జువా నగరంలోనూ భారీగా కేసులు పెరుగుతుండడంతో అక్కడ కఠిన ఆంక్షలను విధించారు. వైరస్‌ సోకిన వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు బలవంతంగా తరలిస్తున్నారు. వారి పరిస్థితులు విషమించినా.. వైద్యం అందించడం లేదు. ఝేంగ్‌జువా ప్రాంతంలో వైద్యం అందక ఇద్దరు చిన్నారులు వారం రోజుల క్రితం మృతి చెందారు. ఝేంగ్‌జువా నగరానికి దూరంగా ఉన్న ఓ హోటల్‌లోని క్వారంటైన్‌ కేంద్రంలో నాలుగు నెలల పసికందుకు వాంతులు, విరేచనాలు కావడంతో అత్యవసర వైద్యానికి ప్రయత్నించారు. కానీ... కోవిడ్‌ ఆంక్షల కారణంగా.. బయటకు వెళ్లేందుకు అంగీకరించలేదు. సుమారు 11 గంటల పాటు ప్రాధేయపడిన తరువాత.. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతించారు. కానీ... అప్పటికే చిన్నారి ఆరోగ్యం విషమించి.. చివరికి ప్రాణాలను కోల్పోయింది. అంతకుముందు లాంఝువా నగరంలోనూ క్వారంటైన్‌లో ఉన్న మూడేళ్ల బాలుడు అస్వస్థతకు గురయ్యింది. ఆసుపత్రికి వెళ్లేందుకు తండ్రి ప్రయత్నించినప్పటికీ అధికారులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించి బాలుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనలతో చైనీయుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అధికారుల తీరును నిరసిస్తూ.. ఆందోళనలకు దిగారు. బారీకేడ్లు దాటుకుని వచ్చి.. నిరసన తెలిపారు. ఈ ఘటనలతో దీంతో 3ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిపై ఆంక్షలు సడలించినట్లు అధికారులు ప్రకటించారు. వారికి కొవిడ్‌-19 నెగటివ్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదని చెప్పారు.

మరోవైపు జీరో కోవిడ్‌పై చైనీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిత్యావసరాల సరఫరా తీవ్ర ఆలస్యమవుతోందని విమర్శిస్తున్నారు. నిత్యం లాక్‌డౌన్లను విధించడంతో.. తమ వద్ద దాచుకున్న డబ్బంతా అయిపోతోందని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. అత్యవసరాలు కానీ.. ఇతర సేవలన్నింటనీ నిలిపేశారు. ఫ్యాక్టరీలు పని చేస్తున్నా.. కార్మికులను బయటకు వదలడం లేదు. లోపలే ఉండి పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అందుకు తగినట్టుగా వసతులు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. చైనాలో అతిపెద్ద ఐఫోన్‌ ఫ్యాక్టరీలో కార్మికుల ఆందోళనలు.. నిరసనలు వెల్లువెత్తాయి. స్థానిక సెక్యూరిటీ, పోలీసులతో కార్మికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్‌లో తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు గాల్లో కాల్పుల జరపాల్సి వచ్చింది. కోవిడ్‌ సోకిన బాధితులతోనే కలిసి పడుకోమంటున్నారని కార్మికులు ఆరోపించారు. అయితే ఫాక్స్‌కాన్‌ ఆరోపణలను ఖండిస్తోంది. గత నెల నుంచి ఈ ఫ్యాక్టరీ నుంచి పలువురు కంచెలు దాటి వెళ్లిపోయారు.

జీరో కోవిడ్‌పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీరో కోవిడ్‌ పేరిట చైనా మానవ హక్కులను హరించి వేస్తోందని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. వాటిని బీజింగ్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జిన్‌పింగ్‌ ప్రభుత్వం మాత్రం ఈ విధానాన్నే సమర్థిస్తున్నది. అదే సరైన విధానమని చెప్పుకుంటోంది. కొన్ని నెలలుగా ఫ్యాక్టరీలన్ని మూతపడ్డాయి. ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ పతనావస్థ దిశగా వెళ్తోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అయినా డ్రాగన్‌ కంట్రీ మాత్రం పట్టు వీడడం లేదు. చైనాలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 35వేలకు పైగా కేసులు నమోదైనట్టు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. కొత్త కేసుల పెరుగుతుండడంతో... కోవిడ్‌ ఆంక్షలను చైనా మరింత కఠినతరం చేస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఏ నగరం చూసినా... నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

Tags:    

Similar News