డ్రాగన్ కంట్రీలో తీవ్రమవుతున్న కరువు.. ఎండిపోయిన చైనా జీవనది యాంగ్జీ
China: జూన్ నుంచి కరువు రక్కసి కోరలు చాస్తుండడంతో డ్రాగన్ విలవిలలాడుతోంది.
China: జూన్ నుంచి కరువు రక్కసి కోరలు చాస్తుండడంతో డ్రాగన్ విలవిలలాడుతోంది. కనీవినీ ఎరుగుని తీవ్రమైన కరువును ఎదుర్కొంటోంది. చైనాలోకెల్ల అతి పెద్ద నది జీవనదిగా భావించే యాంగ్జీలో పూర్తిగా ఎండిపోయింది. నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో మూడు బౌద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విగ్రహాలు బయటపడడాన్ని చైనీయులు శకునంగా భావిస్తున్నారు. డ్యామ్‌లు, రిజర్వాయర్లలో నీరు అడుగంటింది. దీంతో హైడ్రో పవర్ ప్లాంట్లు, ఫ్యాక్టరీలు తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పలు ఫ్యాక్టరీలు విద్యుత్ కొరతతో మూతపడ్డాయి. మరోవైపు కరువు కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. తీవ్రమైన ఎండలకు లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని చైనా రైతులు కోరుతున్నారు.
ప్రపంచంలోనే మూడో అతి పెద్ద నది యాంగ్జీ డ్రాగన్ కంట్రీ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైనది ఈ నది. 40 కోట్ల మందికి పైగా చైనా ప్రజలకు తాగునీటిని అందిస్తోంది. ఈ వేసవిలో యాంగ్జీ నీటి ప్రవాహం భారీగా పడిపోయింది. యాంగ్జీ నదికి డజన్లకొద్దీ ఉన్న ఉప నదులు ఎండిపోవడంతో రికార్డు స్థాయిలో కరువుకు కారణమైంది. యాంగ్జీ ఎండిపోవడంతో బౌద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. వాటి రూపం ఆధారంగా అవి 600 ఏళ్ల నాటివని స్పష్టమవుతోంది. విగ్రహాలు బయటపడడాన్ని చైనాలో కొందరు శకునంగా భావిస్తున్నారు. అందమైన దేశం, శాంతియుత ప్రపంచం కోసమే పూర్వీకులు బౌద్ధ విగ్రహాలను నిర్మించి ఉంటారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. యాంగ్జీకి ఉపనదుల్లో జియా లింగ్ నది ఒకటి. ఇప్పుడిది ఎండిపోయి రాళ్లు, ఇసుకతో కనిపిస్తోంది. స్వచ్ఛమైన నీటికి ఆలవాలం పోంగ్ యాంగ్ సరస్సు. ఇది పూర్తిగా ఎండిపోయింది నిర్జన ప్రదేశంగా మారిపోయింది.
గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఎండల వేడిమిని కారణంగా చెరువుల్లో నీరు అడుగంటి చేపలు మృత్యువాత పడుతున్నాయి. భారీ ఉష్ణోగ్రతల కారణంగా చాంగ్‌క్వింగ్ మున్సిపాలిటీ పరిధిలోని పంటలు ఎండిపోతున్నాయి. తాగునీరు లభించక ప్రజలు విలవిలలాడుతున్నారు. చాంగ్‌క్వింగ్ ప్రావిన్స్‌లో 66 నదులు ఎండిపోయాయి. ఐదేళ్ల తరువాత యాంగ్జీ నది ప్రవాహం 50 శాతం దిగువకు పడిపోయింది. ఈ నది పరీవాహక ప్రాంతం లో 22 లక్షల ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. దేశవ్యాప్తంగా 30 కోట్ల డాలర్ల మేర పంట నష్టం వాటిల్లినట్టు నివేదికలు చెబుతున్నాయి. 24 లక్షల 60 వేల మంది కరువు బారిన పడ్డారు. 7 లక్షల 80 వేల మంది ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. చైనా వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 44 డిగ్రీలుగా నమోదువుతోంది. ఇప్పటికై చైనా ప్రభుత్వం కరువు హెచ్చరికలను జారీ చేసింది. కరువు, విద్యుత్ సంక్షోభం సెప్టెంబరు చివరికి వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
చైనా వ్యాప్తంగా నదులు ఎండిపోతుండడంతో డ్యామ్స్, రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి స్థాయిలు పడిపోతున్నాయి. దీంతో జలవిద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. విద్యుత్ కొరత కారణంగా ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. పలు పరిశ్రమలు పవర్ హాలిడేను ప్రకటిస్తున్నాయి. టొయాటా, ఫాక్స్‌కాన్, టెస్లా వంటి సంస్థలు తాత్కాలికంగా తమ కార్యకలాపాలను నిలిపేశాయి. అయితే ఆయా పరిశ్రములు ఎప్పుడు తిరిగి తెరుచుకుంటాయన్న విషయంపై స్పష్టత లేకుండాపోయింది. ఈ కరువును అడ్డుకోవడం ఎలా? అనేది అక్కడి ప్రజలను వేధిస్తున్న ప్రశ్న. వర్షాలు కురియాలని దేవుడిని ప్రార్థించడం మినహా ఏం చేస్తామని కొందరు ప్రజలు చెబుతున్నారు. దేవుడిని అతిగా నమ్మే చైనా.. ఇప్పుడు వర్షాల కోసం సైన్స్‌పై ఆధారపడుతోంది. కరువును అంతం చేసేందుకు క్లౌడ్ సీడింగ్‌పై దృష్టి పెట్టింది. వర్షాన్ని కురిపించేందుకు రసాయనాలను ఉపయోగించాలని యోచిస్తోంది. ప్రకృతితో చెలగాటమాడడం ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. కృత్రికమ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే మండుతున్న ఎండల కారణంగా చైనాలోని యాంగ్జీతోపాటు ఐరోపాలోని రైన్, లోయిర్ నది, అమెరికాలోని కొలరాడో నది పూర్తిగా ఎండిపోయాయి. ఐరోపాలో 500 ఏళ్ల తరువాత తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఐరోపా దేశాల్లో నదులను రవాణా మార్గాలుగా వినియోగిస్తారు. అక్కడి నదుల్లో ప్రవాహం రికార్డు స్థాయిలో తగ్గిపోవడంతో రవాణా పూర్తిగా పడిపోయింది. మరోవైపు పలు దేశాలు తాగు నీటి ఎద్దడితో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండల కారణంగా ఉక్కపోతతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో వేలాది హెక్టార్లలో అడవులు కాలి బూడిదవుతున్నాయి. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు కారుచిచ్చును ఆర్పేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. ఐరోపాలోనూ సెప్టెంబరు చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే కోవిడ్‌తో విలవిలలాడుతున్న చైనా కరువుతో అష్టకష్టాలు పడుతోంది. మండుతున్న ఎండల నుంచి పంటలను ఎలా కాపాడుకోవాలోనని బీజింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సెప్టెంబరు ఆఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తుండడంతో డ్రాగన్ కంట్రీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. చైనాలో కరువును క్లౌడ్ సీడింగ్ ఎంత వరకు నివారిస్తుందో వేచి చూడాల్సిందే.