దివాలా అంచునకు పాకిస్థాన్... అప్పు పుడితేనే రోజు గడిచేలా మారిన పాక్‌ పరిస్థితి

Pakistan: జీడీపీలో 71.3 శాతానికి పాక్‌ అప్పులు

Update: 2022-07-26 11:00 GMT

దివాలా అంచునకు పాకిస్థాన్... అప్పు పుడితేనే రోజు గడిచేలా మారిన పాక్‌ పరిస్థితి

Pakistan: పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమవుతోంది. శ్రీలంక దిశగా పయనిస్తోంది. ప్రజల తిరగబడే రోజు మరెంతో దూరం లేదని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశాల జాబితాను తాజాగా బ్లూమ్‌బర్గ్‌ విడుదల చేసింది. ఇందులో పాకిస్థాన్‌ నాలుగో స్థానంలో ఉంది. తొలి 10 స్థానాల్లో నిలిచిన ఆసియా దేశం పాకిస్థానే. విదేశీ మారక నిధులు పాకిస్థాన్‌ వద్ద ఇప్పుడు ఏమీ లేవని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. అంటే దాదాపు శ్రీలంక పరిస్థితే పాకిస్థాన్‌ది కూడా.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-ఐఎంఎఫ్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ ఆ నిధులు ఇప్పటికిప్పుడు వచ్చేలా లేవు. దీంతో పాకిస్థాన్‌ దివాళా అంచునకు చేరుకుంది.

పాకిస్థాన్‌ ఆర్థికంగా రోజు రోజుకు చితికిపోతున్నది. అప్పు పుడితేనే ఇల్లు గడుస్తుందన్నట్టుగా పొరుగుదేశం పరిస్థితి మారిపోయింది. ద్రవ్యోల్బణం 21.3 శాతానికి పెరిగింది. భారత్‌లో ద్రవ్యోల్బణం 7 శాతానికి చేరుకోవడంతోనే ధరలు మండుతున్నాయని తీవ్ర ఆందోళన చెందుతున్నాము.. అలాంటిది.. 21 శాతానికి చేరుకుందంటే.. పాకిస్థాన్‌లో ధరలు ఏమాత్రం ఉంటాయో ఊహించవచ్చు. అప్పులు జీడీపీలో 71.3 శాతానికి చేరాయి. ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు 5.3 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే.. దాదాపు పాకిస్తాన్‌ వద్ద విదేశీ మారక నిధులు పూర్తిగా తరిగిపోయాయి. ఇప్పుడు అప్పులు దొరక్కపోతే ఆ దేశంలో శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులు నెలకొనే ప్రమాదం పొంచి ఉంది. వారం క్రితం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-ఐఎంఎఫ్‌ 600 కోట్ల డాలర్లను ఇచ్చేందుకు సుముఖత తెలిపింది. ఐఎంఎఫ్‌ సూచించిన విధానాలను అమలు చేస్తేనే ఆ నిధులను ఇస్తుంది.

అయితే పాకిస్తాన్‌లో మాత్రం ప్రజా ప్రతినిధులు అధికారం దక్కించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఐఎంఎఫ్‌ విధానాలను అమలుచేసే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా పంజాబ్‌ ప్రావిన్స్‌లోని 20 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పీటీఐ పార్టీ 17 స్థానాలను గెలుచుకుంది. దీంతో పీటీఐ మిత్రపక్షం ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని పొందింది. అయితే 10 మంది పీటీఐ మిత్రపక్షాల సభ్యులను ఓట్లను డిప్యూటీ స్పీకర్‌ మజారీ రద్దు చేశారు. దీంతో పీఎంఎల్‌ఎన్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కుమారుడు హహ్జా షెహబాజ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ట్విస్ట్‌ ఏమిటంటే డిప్యూటీ స్పీకర్‌ ముహమ్మద్‌ మజారీ.. పీటీఐకి చెందిన నేత కావడమే. దీంతో అసెంబ్లీలో సొంత పార్టీకి చెందిన డిప్యూటీ స్పీకర్‌పై పీటీఐ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. అయితే ఆ పది మంది సభ్యుల ఓట్లను రద్దు చేయడానికి కారణం.. వారు పార్టీ సూచనలను ఉల్లంఘించడమే కారణమని మజారీ చెబుతున్నారు. పార్టీ సూచనలను ఉల్లంఘిస్తే వారి ఓట్లను రద్దు చేసే అధికారం పాకిస్థాన్‌ రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ స్పీకర్‌కు ఉంటుంది.

హమ్జా షెహబాజ్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి కావడాన్ని ఇమ్రాన్‌ఖాన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు ప్రజలు మద్దతు పలికినా షరీఫ్‌ కుటుంబం మాత్రం అడ్డుకుంటోందని రగిలిపోయారు. శ్రీలంకలోని ప్రజలు తిరగబడినట్టు.. పాకిస్థాన్‌లోనూ అతి త్వరలోనే జరుగుతుందని ఆరోపించారు. దీనిపై ఇమ్రాన్‌ పార్టీ పాక్‌ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణకు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సుప్రీం కేసును అప్పగించింది. హమ్జా షెహబాజ్‌ను తాత్కాలిక ముఖ్యమంత్రిగా కోర్టు ప్రకటించింది. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ న్యాయమూర్తులపై ఒత్తిడి పెంచుతున్నారంటూ పీఎంఎల్‌ఎన్‌ ఉపాధ్యాక్షురాలు మరియమ్ నవాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జడ్జీ పీఎంఎల్‌ఎన్‌ పార్టీ లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టులో అంత మంది జడ్జీలు ఉన్నా ఆ ముగ్గురే ఎందుకు విచారణ చేపట్టాలని ప్రశ్నించారు.

మరోవైపు ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని అక్కడి నేతలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పాకిస్థాన్‌ రూపాయి విలువ భారీగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే పాక్‌ రూపాయి 227కు చేరుకుంది. నిత్యావసరాలు, చమురు ధరలు, కరెంటు చార్జీలు విపరీతంగా పెరిగాయి. వంటనూనె మూడు లీటర్ల ప్యాకెట్‌ పాకిస్థాన్‌లో 18వందల నుంచి 2వేలు రూపాయలు పలుకుతోంది. కరెంటు చార్జీల పెంపునకు అఫ్ఘానిస్థాన్‌ బొగ్గు ధరలను పెంచడమే కారణమని పాక్‌ ప్రభుత్వం చెబుతోంది. నిన్నటివరకు 220 డాలర్లు పలికే టన్ను బొగ్గు.. ఇప్పుడు 280 డాలర్లకు చేరుకుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా భారీగా పెరిగాయి. సామాన్యులు కొనలేని స్థాయికి ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అక్కడి నేతలు మాత్రం అధికారమే లక్ష్యంగా పాకులాడుతున్నారు. దేశంలో నెలకొంటున్న పరిస్థితులను విస్మరిస్తున్నారు.ఇప్పటికే పాకిస్థాన్‌లో పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం శ్రీలంకలో మాదిరిగానే ప్రజలు వీధుల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Full View


Tags:    

Similar News