Mossad: ఈ ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ శత్రువుల్ని ఎలా ఏరి పారేస్తుంది?

మొసాద్.. ఈ పేరు వింటేనే చాలా మంది గుండెల్లో రైళ్ళు పరుగెడుతుంటాయి. మూడో కంటికి తెలియని కిల్లర్ అటాక్స్... శత్రువు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వల వేసి పట్టుకునే సత్తా..

Update: 2024-10-11 14:18 GMT

What Is Mossad and how it carries its secret operations: మొసాద్.. ఈ పేరు వింటేనే చాలా మంది గుండెల్లో రైళ్ళు పరుగెడుతుంటాయి. మూడో కంటికి తెలియని కిల్లర్ అటాక్స్... శత్రువు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వల వేసి పట్టుకునే సత్తా.. హైటెక్ గ్యాడ్జెట్‌తో సీక్రెట్ ఇన్ఫర్మేషన్‌ను క్యాప్చర్ చేసే మెకానిజం.. ఇవన్నీ మొసాద్ సొంతం. మొసాద్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుంటే హాలీవుడ్ థ్రిల్లర్స్ ఎందుకూ పనికిరావు అనిపిస్తుంది. అదీ మొసాద్ ఆపరేషన్ స్టయిల్. సూపర్ హిట్ స్పై థ్రిల్లర్స్ ఎన్నో మొసాద్ ఆపరేషన్స్‌ను బేస్ చేసుకుని తయారయ్యారు. అదీ మొసాద్ ఎఫెక్ట్.

మొసాద్ అంటే ఏంటి?

హా-మొసాద్- లేమోదీన్ – ఉలే – తఫ్ కిదిమ్ మెయూహాదిమ్... (ha-Mossad le-Modiin ule-Tafkidim Meyuhadim)... ఇదీ హీబ్రూ భాషలో మొసాద్ పూర్తి పేరు. దీన్నే ఇంగ్లీషులో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్. ఇది ఇజ్రాయెల్ దేశానికి చెందిన మూడు ఇంటలిజెన్స్ సంస్థల్లో ఒకటి. మిగతా రెండు సంస్థల్లో ఒకటి అమన్. రెండోది షిన్ బెట్.

అమన్ అనేది ఇజ్రాయెల్ మిలటరీ ఇంటలిజెన్స్ ఏజెన్సీ. షిన్ బెట్ అన్నది దేశ అంతర్గత భద్రతా వ్యవస్థ. ఇక, విదేశాల్లో రహస్య కార్యకలాపాలు సాగించే గూఢచర్య సంస్థ. విదేశాలకు చెందిన రహస్య సమాచారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సేకరించడం, దాన్ని అనలైజ్ చేయడం, ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహించడం మొసాద్ పని.

విదేశీ గడ్డ మీద ఉన్న ఇజ్రాయెల్ శత్రువులను మూడో కంటికి తెలియకుండా మట్టు పెట్టడంలో మొసాద్ తరువాతే ఎవరైనా అని అగ్ర దేశాలే ఒప్పుకుంటాయి. ఒక్క మాటలో మొసాద్... ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇంటలిజెన్స్ ఏజెన్సీ. ఇది 1949లో ఏర్పాటైంది. అప్పటి నుంచీ ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో తిరుగులేని రహస్య ఆయుధంగా పని చేస్తోంది. ఇజ్రాయెల్‌కు నష్టం కలిగించే పని, కష్టం కలిగించే పని ఎవరు ఎక్కడ చేస్తున్నారో కనిపెట్టడం, ఖతం చేయడం దీని పని.

హమాస్ పొలిటికల్ చీఫ్ హానియే.. కథ ఎలా ముగిసింది?

మొన్న జూలై నెలలో 31వ తేదీన హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హానియే.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఓ గెస్ట్ హౌస్‌లో ఫుల్ సెక్యూరిటీ మధ్య ఉండగా... బాంబు పేలి చనిపోయారు. హానియే ఎప్పుడు టెహ్రాన్‌కు వచ్చినా ఆ గెస్ట్ హౌస్ లో ఉంటారు. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్... అంటే ఇరాన్ సైన్యం కాపలా కాస్తుంటుంది. అందులోకి ఇజ్రాయెల్ ఏజెంట్స్ ఎలా వెళ్ళారు... ఎలా బాంబు పెట్టారు.. టార్గెట్ మిస్సవకుండా దాన్ని ఎలా పేల్చారు? ఇది ఇప్పటికీ ఎప్పటికీ మిస్టరీ...

ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెంట్లు శత్రుదేశ భద్రతా వ్యవస్థ లోపలికి మూడోకంటికి తెలియకుండా చొరబడడం ప్రపంచాన్నే షాక్‌కు గురి చేసింది. హానియే ఆ గెస్ట్ హౌజుకు రావడానికి రెండు నెలల ముందే అక్కడ సీక్రెట్ ఆపరేషన్ మొదలైందని, అప్పుడే అయిదుగురు గుర్తు తెలియని మిడిల్ ఈస్ట్ ఆఫీసర్లు అక్కడ బాంబు పెట్టారని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

పేలిన పేజర్లు... వాకీ టాకీలు

సెప్టెంబర్ 17న లెబనాన్, సిరియా దేశాల్లో పేజర్లు పేలి సృష్టించిన విధ్వంసం గురించి మీరు వినే ఉంటారు. ఆ మరునాడు హిజ్బుల్లా మిలిటెంట్ల చేతుల్లోని వాకీ టాకీలు పేలిపోయాయి. ఈ దాడుల్లో 37 మంది చనిపోయారు. 2,931 మంది గాయపడ్డారని లెబనాన్ అధికారులు చెప్పారు.

ఈ దాడులు ఉన్నట్లుండి జరిగినవి కావు. దీని వెనుక కొన్నేళ్ళ నుంచి అమలు అవుతున్న ప్రణాళిక ఉందని తమకు సమాచారం అందిందని ఏబీసీ న్యూస్ రిపోర్ట్ చేసింది. లెబనాన్ పోరాట చరిత్రలోనే అలాంటి దాడులను చూసింది లేదని హెజ్బుల్లా లీడర్ హసన్ నస్రల్లా... అన్నారు. ఆ తరువాత పది రోజులకు అంటే... సెప్టెంబర్ 27న బేరూత్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఆయన కూడా చనిపోయాడు.

ఈ ఫారిన్ ఆపరేషన్స్‌లో మొసాద్ పేరే వినిపించింది. అధికారికంగా చెప్పినా చెప్పకపోయినా మొసాద్ ఇంటలిజెన్స్ హస్తం లేనిదే ఇలాంటి టార్గెట్ కిల్లింగ్స్ ఇజ్రాయెల్‌కు సాధ్యం కాదన్న సంగతి ప్రపంచానికి తెలుసు. పేజర్ పేలుళ్ళ వెనుక ఉన్నది ఇజ్రాయెలేనని కూడా తమ సోర్సులు చెప్పాయని ఏబీసీ న్యూస్ వెల్లడించింది.

ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్ మాత్రం... ఆ పేలుళ్ళకు తమ దేశానికి ఎలాంటి కనెక్షన్ లేదని స్కై న్యూస్‌కు చెప్పారు. విదేశీ గడ్డ మీద చేసే కోవర్ట్ ఆపరేషన్స్ గురించి ఇజ్రాయెల్ ఎప్పుడో గానీ మాట్లాడదు. అవి తమ పనే అని ఒప్పుకోదు... అలాగని కాదనీ చెప్పదు.

ఇజ్రాయెల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ప్రతినిధులు... విదేశాల్లోని శత్రువులను అంతం చేసినప్పుడు వాటిని హత్యలు అని చెప్పదు. వారి భాషలో అది శత్రు నిర్మూలన.

‘యూదుల హంతకుడు’ అడాల్ప్ ఐక్‌మాన్ కిడ్నాప్...

చరిత్రలో కాస్త వెనక్కి వెళదాం. అప్పటికి మొసాద్ ‌ను స్థాపించి పదేళ్ళు దాటింది. అప్పుడే మొదటిసారిగా మొసాద్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీలో యూదుల మారణహోమం జరిగింది. లక్షలాది మంది యూదులను హిట్లర్ సేనలు సామూహికంగా హతమార్చాయి. ఈ మారణహోమాన్ని హోలోకాస్ట్ అని అంటారు. ఈ హోలోకాస్ట్‌ను నడిపించిన నాజీల్లో ఒకరైన అడాల్ఫ్ ఐక్‌మాన్‌ను పన్నెండేళ్ళ తరువాత ఆర్జెంటీనాలో సజీవంగా పట్టుకుంది మొసాద్. అదే మొసాద్ ఫస్ట్ మిషన్.

లక్షలాది యూదుల ఊచకోతకు కారణమైన ఐక్‌మాన్... రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తరువాత అర్జెంటీనాకు పారిపోయాడు. కొత్త పేరుతో, కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. యూదుల దేశమైన ఇజ్రాయెల్ లక్ష్యం ఒక్కటే... మహా మారణహోమానికి కారకుడైన వాడిని పట్టుకుని విచారించాలి, శిక్షించాలి.

అతడి ఆచూకీ కోసం ప్రపంచం అంతా గాలించిన మొసాద్ ఏజెంట్లు ఆయన అర్జెంటీనాలో ఉన్నట్లు గుర్తించారు. వారి దగ్గరున్న ఆధారం ఐక్‌మాన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒక్కటే. అందులో ఆయన సైడ్ పోజులో కనిపిస్తున్నాడు. ఆ ఫోటో తీసుకుని అర్జెంటీనాకు వేటకు బయలుదేరారు మొసాద్ ఏజెంట్లు. అర్జెంటీనా అందమైన రాజధాని ‘బాయెనస్ ఏరెస్” (Buenos Aires)లో మారు పేరుతో తిరుగుతున్న ఒక వ్యక్తిని అనుమానించారు. తమ దగ్గర ఉన్న ఫోటో లాగే, అతడి కొత్త ఫోటోను సైడ్ నుంచి క్లిక్ చేశారు. పదేళ్ళలో ఆ వ్యక్తి చాలా మారిపోయాడు. జుత్తు నెరిసిపోయింది. ముఖం మీద ముడతలు వచ్చాయి. కానీ, అతడి చెవి వంపులను క్లోజప్‌లో పెట్టి పోల్చి చూసి... అతడే ఐక్‌మాన్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు మొసాద్ ఏజెంట్స్.

రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అతడ్ని లాక్కుని వెహికిల్లో వేసుకుని రహస్య ప్రదేశానికి వెళ్ళిపోయారు. అతడికి మత్తు మందిచ్చి, ఇజ్రాయెల్‌కు వెళ్ళే విమానంలో సిబ్బందిగా ఫేక్ ఐడెంటిటీ సృష్టించి అర్జెంటినా నుంచి తరలించారు. ఇదంతా 1960లో జరిగింది. ఆ తరువాత ఒకరోజు ఐక్‌మాన్‌ను ఇజ్రాయెల్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడిని విచారించింది. నేరస్థుడిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. అది మొసాద్ సాధించిన తొలి ఘన విజయం. ఆ విజయం ప్రపంచానికి ఇచ్చిన మెసేజ్ ఏంటి: వార్ క్రిమినల్ ఎవరైనా సరే, మొసాద్‌ను తప్పించుకుని పోలేరు.

హైజాకర్లను పిట్టల్లా కాల్చేశారు...

మొసాద్ ఆపరేషన్స్ లో బాగా పాపులర్ ఎపిసోడ్ “ది ఎంటెబే రెయిడ్”. ఇజ్రాయెల్ విమానాన్ని పాలస్తీనా మిలిటెంట్లు హైజాక్ చేసి యుగాండా దేశంలో దింపినప్పుడు, తన ప్రయాణికులను కాపాడుకోవడానికి మొసాద్ చేసిన ఆపరేషన్ పేరే.. ది ఎంటెబె రెయిడ్. ఇజ్రాయెల్ జైళ్ళలో ఉన్న 40 మంది పాలస్తీనా మిలిటెంట్లను విడుదల చేయాలి.. లేదంటే ఫ్లైట్ లో ప్రయాణికులెవరూ మిగలరని హైజాకర్లు డిమాండ్ చేశారు. కానీ, మొసాద్ ఏం చేసింది?

1976 జూన్ 27... ఎయిర్ ఫ్రాన్స్ విమానం 248 మంది ప్రయాణికులతో ఇజ్రాయెల్‌లోని బెన్-గురియన్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలు దేరింది. అందులో 248 మంది ప్రయాణికులున్నారు. వారిలో చాలా మంది ఇజ్రాయెల్ పౌరులు, యూదులు. పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా – ఎక్స్‌టర్నల్ ఆపరేషన్స్‌కు చెందిన ఇద్దరు, జర్మన్ రెవల్యూషనరీ సెల్స్‌కు చెందిన మరో ఇద్దరు మిలిటెంట్లు ఆ విమానాన్ని హైజాక్ చేశారు. ఇజ్రాయెల్‌లో ఖైదీలుగా ఉన్న 40 మంది పాలస్తీనా మిలిటెంట్లను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ప్రయాణికులను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

టెల్ అవీవ్ నుంచి పారిస్ చేరుకోవాల్సిన ఆ విమానాన్ని యుగాండాలోని ఎంటెబె విమానాశ్రయంలో దింపారు. అప్పుడు ఇదీ అమీన్ ఉగాండా అధ్యక్షుడుగా ఉన్నారు. ఇదీ అమీన్ సపోర్టుతో మరో ఇద్దరు మిలిటెంట్లు హైజాకర్లతో కలిశారు. హైజాకర్లు విమానంలో ఇజ్రాయెలీ యూదులందరినీ విమానాశ్రయంలోని ఓ పాత భవనంలోకి తరలించారు. హైజాక్ డ్రామా నాలుగైదు రోజులు సాగింది. ఇజ్రాయెల్ దేశానికి చెందని 148 ప్రయాణికులను హైజాకర్లు రెండు రోజుల తరువాత వదిలేశారు. మిగతా ప్రయాణికులను, విమాన సిబ్బందిని తమ డిమాండ్లకు తలొగ్గకపోతే చంపేస్తామని బెదిరించారు. అప్పుడు రంగంలోకి దిగింది మొసాద్. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌కు ప్రయాణికులను కాపాడే రెస్క్యూ ఆపరేషన్ ప్లాన్ రెడీ చేసి ఇచ్చింది. అది 90 నిమిషాల ఆపరేషన్. రాత్రి వేళ జరిగింది.

ఇజ్రాయెల్ ట్రాన్స్ పోర్ట్ విమానాల్లో 100 మంది కమాండోలు 2,500 కిలోమీటర్లు ప్రయాణించి యుగాండా ఎంటెబె ఎయిర్‌పోర్టులోకి దిగారు. రన్ వే పక్కనే ఉన్న టర్మినల్ బిల్డింగులో బందీలు ఉన్నారు. లోపలికి అన్ని వైపుల నుంచి దూసుకుపోయిన ఇజ్రాయెలీ కమాండోలు.. “స్టే డౌన్.. స్టే డౌన్... మేం ఇజ్రాయెల్ సైనికులం వచ్చేశాం” అని మెగా ఫోన్‌లో హీబ్రూలో, ఇంగ్లీష్ భాషలో కేకలు వేశారు. మెరుపులా హైజాకర్లున్న హాలులోకి దూసుకుపోయారు. క్షణాల్లో హైజాకర్లను పిట్టలను కాల్చినట్లు కాల్చేశారు. ఇజ్రాయెలీ ప్రయాణికులను సేఫ్‌గా తమ విమానం ఎక్కించారు. వస్తూ వస్తూ అక్కడున్న యుగాండా యుద్ధ విమానాన్ని పేల్చేశారు... తమను ఎవరూ ట్రాక్ చేయకుండా.

అంతా కలిపి గంటన్నర ఆపరేషన్. ఇజ్రాయెల్ ప్యాసెంజర్స్ 102 మంది సేఫ్.

అలా ఇజ్రాయెల్ తమ దేశ పౌరుల ప్రాణాల కోసం ఎంతకైనా తెగిస్తామని ప్రపంచానికి చాటి చెప్పింది.

శత్రుదేశమైన ఇరాన్‌కు న్యూక్లియర్ వెపన్స్ లేకుండా చేయడానికి ఇజ్రాయెల్ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. ఈ ప్రయత్నంలో మెయిన్ రోల్.. మొసాద్‌దే.

ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ హత్య

ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌తో సంబంధం ఉన్న ముఖ్యమైన శాస్త్రవేత్తలు 2010 నుంచి వరసగా హత్యకు గురవుతూ వచ్చారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా హత్యకు గురయ్యారు. ఇది ఇజ్రాయెల్ కుట్రేనని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్ ఎప్పట్లానే ఆ హత్యలు చేసినట్లు ఒప్పుకోలేదు, అలాగని తోసిపుచ్చలేదు. అంటే, అది మొసాద్ పనే అని ఇంటర్నేషనల్ మీడియా ఘోషించింది.

మోహ్‌సిన్ ఫక్రీజాదే... చాలా పేరున్న ఇరానీ న్యూక్లియర్ సైంటిస్ట్. ఆయనను ఫాదర్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ అని అంటారు. అలాంటి వ్యక్తి 2020 నవంబర్‌లో హత్యకు గురయ్యారు. ఎక్కడి నుంచో ఒక బుల్లెట్ వచ్చి ఆయన శరీరంలోకి దూసుకుపోయింది. అప్పుడు ఆయన భార్య కూడా పక్కనే ఉన్నారు. ఆమె క్షేమంగా ఉన్నారు. చుట్టుపక్కల ఎవరికీ కూడా ఎలాంటి హాని జరగలేదు. నిమిషంలో ఫాదర్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ చనిపోయారు.

ఆ బులెట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది కంప్యూటరైజ్‌డ్ మెషీన్ గన్‌ నుంచి దూసుకొచ్చిందని ఆ తరువాత నిర్ధారించారు. అది బెల్జియంలో తయారైన FN MAG మెషీన్ గన్. దానికి అధునాతన రోబో సిస్టమ్ అటాచ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పని చేసే ఆ రోబో ఫక్రీజాదేను పర్ఫెక్ట్‌గా ఐడెంటిఫై చేసి, గురి పెట్టి బులెట్ రిలీజ్ చేసింది. ఆ మెషీన్ గన్ విత్ రోబో సిస్టమ్ అంతా కలిపి కనీసం ఒక టన్ను బరువు ఉంటుందని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. దాన్ని చిన్న చిన్న భాగాలుగా మొసాద్ ఇరాన్‌లోకి స్మగుల్ చేసింది. ఆ తరువాత దాన్ని అసెంబుల్ చేసింది. ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసింది. పరాయి దేశంలో మూడో కంటికి తెలియకుండా అలా పని పూర్తి చేసుకుని వచ్చింది మొసాద్.

ఇజ్రాయెల్ అథ్లెట్స్ హత్యలపై దారుణమైన రివెంజ్

మ్యూనిక్ ఒలింపిక్స్ -1972 అంటే రక్తపాతం గుర్తుకు వస్తుంది. జర్మనీలో ఆ ఒలింపిక్ క్రీడా వేడుక జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి వెళ్ళిన 11 మంది అథ్లెట్లు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ప్రతీకారం తీర్చుకోవడానికి మొసాద్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ‘ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్’ అంటే ఆపరేషన్ దైవాగ్రహం... స్టార్ట్ చేసింది.

తమ దేశానికి చెందిన అథ్లెట్లను చంపినవారిని, ఆ కుట్రను ప్లాన్ చేసిన వారిని వెంటాడి వేటాడి చంపింది. యూరప్‌లో, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరున్నారో ఐడెంటిఫై చేసింది. క్లోజ్ ఎన్‌కౌంటర్లలో, కారు బాంబు దాడుల్లో వారిని మట్టు పెట్టింది. ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో మొసాద్ అలా ప్రపంచానికి చూపించించింది.

మొసాద్ వెలుగులో పని చేయదు. చీకటి నీడల్లో పని చేస్తుంది. ఇజ్రాయెల్ దేశానికి ఎవరు హాని చేసినా అది కరడు గట్టిన గుండెతో ప్రతీకారం తీర్చుకుంటుంది. ధైర్యంగా ఉండాలి. తెలివిగా ఉండాలి. శత్రువు పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండాలి. ఇదే మొ సాద్ ఫిలాసఫీ.

ఇన్ని అటాక్స్ చేసినా, ఇన్ని హత్యలకు పాల్పడినా ఎక్కడా ప్రూఫ్ ఉండదు. ఎలా ప్లాన్ చేశారన్నదానికి ఆధారం ఉండదు. అది చేసే ప్రతి ఆపరేషన్ ఒక మిస్టరీ.

మొసాద్ ఏజెంట్లు వాడే గాడ్జెట్స్ కూడా ఎవరి ఊహకూ అందవు. ఒక మామూలు గొడుగుకు విషం పూసి చంపేస్తారు. లిప్ స్టిక్ సైజులో తుపాకీలు పట్టుకుని తిరుగుతుంటారు. టేబుల్ ల్యాంప్, బ్రెడ్ టోస్టర్లో ఆడియో బగ్స్ పెట్టి రహస్యాలు వింటుంటారు. మరీ ముఖ్యంగా ముఖానికి నేచురల్‌గా కనిపించే మాస్కులు అతికించుకుని తిరుగుతారు. వారి అసలు రూపం ఏమిటో కూడా ఓ మిస్టరీ.

Tags:    

Similar News