El Dorado Mystery: అంతులేని బంగారంతో నిండిన ఈ నగరం ఎక్కడుంది?

What is the Mystery of El Dorado Gold City and where it is located: ఎల్-డోరాడో (El Dorado).. కేజీఎఫ్ సినిమాలో హీరో బంగారు (Gold) గనుల రారాజుగా వెలిగే హీరో... ఎల్-డోరాడో అని బిగ్గరగా అంటాడు ఓ సీన్లో. అది మరో అతిపెద్ద గోల్డ్ మైన్ అని హీరో రాకీ భాయ్ హుషారుగా చెబుతాడు. ఇంతకీ ఏమిటీ ఎల్-డోరాడో?

Update: 2024-11-13 07:47 GMT

El Dorado Gold City Mystery

What is El Dorado Gold City Mystery and where it is located: పండుగ రోజు రాజుగారు... ఒంటికి అచ్చమైన బంగారు పూత పూసుకుని... పవిత్రమైన చెరువులో స్నానం చేస్తారు. ఆ వేడుకల్లో ప్రజలందరూ రాజుగారి మీద ప్రేమతో తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను ఆ చెరువులో పడేస్తారు. ఆ చెరువులో ఎంత బంగారం ఉందో ఎవరికీ తెలియదు. అసలు అక్కడి ప్రజల వద్ద అంత బంగారం ఎక్కడిది? అంటే ఆ ప్రాంతం అంతా బంగారు నిక్షేపాలతో నిండిపోయిందా?

బంగారం... మానవజాతిని వేల ఏళ్ళుగా, తరతరాలుగా తన వెంట తిప్పుకుంటోంది. బంగారం కోసం యుద్ధాలు జరిగాయి. బంగారంతో ప్రేమలు వర్థిల్లాయి.

బంగారం.. బంగారం... మనిషి జీవితంతో ఉద్వేగంగా పెనవేసుకు పోయిన ఒక లోహం. దీనికి ఎందుకంత మెరుపు? ఎందుకంత ఆకర్షణ? ఎంతో కొంత బంగారం ఒంటి మీద ఉంటే గుండె లోపల ఎందుకంత గర్వం? మనిషి ప్రాణం మీద నెమలి పింఛంలా వెలిగిపోయే సొగసు బంగారానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లోహానికి ఉన్న మార్మిక సౌందర్యం ఏంటి? ఈ సౌందర్యం మాయలో మనిషి అనాదిగా ఎందుకు అన్వేషణలో మునిగిపోయాడు?

సృష్టిలో, జీవితంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. ఆ ప్రశ్నల్లోనే సమాధానాలుంటాయి. బంగారానికి సంబంధించి ప్రశ్నలకు సమాధానాలు కూడా బంగారంలోనే ఉంటాయి. అందుకే, మనిషి బంగారం కోసం ఇప్పటికీ తపిస్తూనే ఉన్నాడు. కొండంత బంగారం ఎక్కడైనా ఉంటే కొల్లగొట్టాలని ఆరాటపడుతూనే ఉన్నాడు.

రవ్వంత బంగారం చేతి వేలు మీద ఉంటే కళ్ళల్లో రాచరిక వైభవం వెలిగిపోతుంది. ఆ వైభవాన్ని అనంతంగా సొంతం చేసుకోవాలని ఆరాటపడిన మనిషి భూమి అణువణువునూ శోధిస్తూనే ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఎక్కడో ఏ మూలో అచ్చంగా బంగారు కొండలున్న ప్రదేశం ఉందని నమ్ముతున్నాడు. ఎటు చూసినా బంగారంతో మెరిసిపోయే ఆ ప్రాంతాన్ని కనుగొనాలని శతాబ్దాలుగా అన్వేషిస్తున్నాడు. ఈ భూమి మీదున్న ఆ స్వర్ణ ప్రపంచం పేరు ఎల్-డోరాడో.

ఆ బంగారు ప్రదేశం జాడ కనిపెట్టాలని ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారు. ఆ అన్వేషణలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా, ఇప్పటికీ ఆ ఎల్-డోరాడో జాడ తెలియలేదు. ఎక్కడ... ఎక్కడ.. ఎక్కడ... ఎక్కడ ఉందీ ఎల్ డోరాడో?

ఎల్-డోరాడో ఎక్కడ?

కేజీఎఫ్ సినిమాలో హీరో బంగారు గనుల రారాజుగా వెలిగే హీరో... ఎల్-డోరాడో అని బిగ్గరగా అంటాడు ఓ సీన్లో. అది మరో అతిపెద్ద గోల్డ్ మైన్ అని హీరో రాకీ భాయ్ హుషారుగా చెబుతాడు. ఇంతకీ ఏమిటీ ఎల్-డోరాడో?

ఎల్-డోరాడో.. కథ 16వ శతాబ్దంలో మొదలైంది. కొంతమంది యూరోపియన్లు ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసి.. బంగారంతో నిండిన ఒక ప్రాంతం ఈ భూమ్మీదే ఒక చోట ఉందని భావించారు. అది పుక్కిటి పురాణం కాదు.. అచ్చమైన వాస్తవమని నమ్మారు. అన్వేషిస్తే తప్పకుండా దొరుకుతుందని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ, దాని అడ్రస్ మారుతూ వచ్చింది. ఐరోపాలో ఎక్కడో ఓ చోట అది ఉందని కొందరంటే... కాదు కాదు దక్షిణ అమెరికాలో ఉందని మరికొందరు భావించారు.

అంతా వెతికి వెతికి... చివరకు అది సౌత్ అమెరికాలోనే ఎక్కడో ఓ చోట ఉందని అన్వేషకులు తీర్మానించారని ఆరిజోనా రాష్ట్రంలోని జానపద గాథల నిపుణుడు జిమ్ గ్రిఫిత్ అన్నారు. కానీ, అంతులేని సంపదతో నిండిన ఆ ప్రదేశం ఎక్కడన్నది మాత్రం ఇంకా తేలలేదు.

స్పెయిన్‌కు చెందిన సాహస యాత్రికులు 16వ శతాబ్దంలో దక్షిణ అమెరికాకు చేరుకున్నప్పుడు మొదటిసారిగా అక్కడి మూల వాసుల ద్వారా బంగారంతో నిండిన ప్రదేశం గురించి విన్నారు. కరీబియన్, పెరూ, జర్మనీ దేశాల నుంచి వెళ్ళిన ఆ యాత్రికుల్లో ఒక వ్యక్తి తాను ఎల్-డోరాడోను చూశానని చెప్పారు. అది ఒమాగువా అనే నగరంలో ఉందని చెప్పినట్లు కూడా చరిత్రలో రాశారు.

దక్షిణ అమెరికా ఉత్తర భాగంలో ఓ మారుమూల తీర ప్రాంతంలోని ఆండెస్ కొండల్లో నివసించే ఆదివాసీ బంగారు పూత కలిగిన రాజుగారి కథ గురించి తరతరాలుగా చెప్పుకునే వారట. అయితే, ఆ ప్రాంతానికి చేరుకున్న స్పానిష్ యాత్రికులకు ఆ రహస్యమేదో తేల్చాలనుకున్నారు. ఆ ప్రాంతాన్ని తమ రాజ్యంగా ప్రకటించారు. గోల్డ్ క్వెస్ట్‌ను కొనసాగించారు.

బంగారం చెరువు

ఆండెస్ మౌంటెయిన్స్ అంటే ఇప్పటి కొలంబియా. ఆ ఆండెస్ కొండజాతికి కొత్తగా రాజైన వ్యక్తి గ్వాటావిటా సరస్సులో స్నానం చేయాలన్నది ఆచారం. ఒళ్ళంతా బంగారు పూత పూసుకుని ఆ వ్యక్తి రత్నాలు, వజ్రాలు ధరించి సరస్సులో స్నానానికి వెళ్ళేవారు. బంగారాన్ని కడిగేసుకుని, నగలన్నింటినీ నీళ్ళలో వదిలేసి బయటకు వచ్చేవారు. ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతూ తమ వద్ద ఉన్న బంగారాన్ని ఆ చెరువులోకి చల్లేవారు. జల గర్భంలో ఉన్న దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం వారు ఆ సంప్రదాయాన్ని పాటించేవారట.

అందుకే, స్పానిష్ యాత్రికులు ఆ రాజు గారికి ఎల్-డోరాడో అని పేరు పెట్టారు. ఆ తరువాత కొన్నాళ్ళకు ఎల్-డోరాడో రాజరికం ముగిసింది. ఆ ప్రాంతాన్ని మరో తెగ వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలోనే అక్కడి స్థానికుల వద్ద బంగారం భారీయెత్తున ఉన్నట్లు స్పానియార్డ్స్ గుర్తించారు. ఆ అదివాసీల వద్ద అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న వారిని వెంటాడింది. ఆ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రకటించుకున్నారు. ఏదో ఓ మారుమూల ప్రదేశంలో బంగారు నిధులు తప్పకుండా ఉంటాయని ఏళ్ళకేళ్ళు వెతికారు. అక్కడి తీర ప్రాంతమంతా గాలించారు. ఎంత వెతికినా వారికి ఎల్-డోరాడో దొరకలేదు. కానీ, ఒక ఆధారం దొరికింది. అదే... గ్వాటావిటా సరస్సు. ఆండెస్ కొండ ప్రాంత ప్రజల రాజు అధికారాన్ని చేపట్టే ముందు స్నానమాచరించే చెరువు అది. ఆ చెరువు లోపలే అసలు సిసలు ఖజానా ఉందని అనుమానించారు.

1545 సంవత్సరంలో వాళ్ళు ఆ చెరువును ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. సగం వరకూ నీళ్ళు ఖాళీ చేశాక వారికి చెరువు వెంబడి బంగారం ముక్కలు అనేకం కనిపించాయి. అక్కడే అంత బంగారం ఉంటే చెరువు అట్టడుగున ఇంకెంత పెద్ద నిధి ఉంటుందోనని ఆశపడ్డారు. కానీ, వారు అంతకన్నా లోతుకు వెళ్ళలేకపోయారు. ఆ లోపల నిజంగానే అంతులేని బంగారం ఉందా? అదే మిస్టరీ!

పసిడి కోసం తండ్రీ కొడుకుల అన్వేషణ

బ్రిటిష్ రాజవంశ సలహాదారు సర్ వాల్టర్ ర్యాలీ ఈ ఎల్-డోరాడో రహస్యాన్ని ఛేదించేందుకు రెండు సార్లు గయానాకు వెళ్ళాడు. రెండోసారి 1617లో వెళ్ళినప్పుడు తన కుమారుడు వాట్ ర్యాలీని వెంట తీసుకుని వెళ్ళాడు. ఓరినోకో నది వరకు వెళ్ళిన తరువాత ముసలివాడైన వాల్టర్ ముందుకు వెళ్ళలేకపోయాడు. ఆయన కుమారుడు వాట్.. ట్రినిడాడ్ బేస్ క్యాంప్ దాటి ముందుకు వెళ్ళాడు. అక్కడ దారుణం జరిగింది. స్పెయిన్ సమూహాలతో జరిగిన యుద్ధంలో ఆయన చనిపోయాడు.

ఎరిక్ క్లింగెల్ హోఫర్ ఓ ఆర్కియాలజిస్టు. జార్జియాలోని మెర్సర్ యూనివర్సిటీలో పని చేసేవారు. ఆయన ట్రినిడాడ్‌లో వాల్టర్ ర్యాలీ బేస్ క్యాంప్ ఎక్కడో కనిపెట్టాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఆయనకు మరో ఊహించని విషయం తెలిసింది. వాల్టర్ ర్యాలీ కొడుకుతో పాటు యుద్ధం చేసిన ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. అతడు వాల్టర్ వద్దకు వచ్చి ఆయన కుమారుడు చనిపోయాడని చెప్పాడు. కానీ, వాల్టర్ నమ్మలేదు. నువ్వే నా కుమారుడు చనిపోయేలా వదిలేసి వచ్చి ఉంటావని ఆగ్రహించాడు. దాంతో, ఆ వ్యక్తి నౌకలోని క్యాబిన్‌లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు అని ఎరిక్ క్లింగెల్ హోఫర్ చెప్పారు.

ఆ తరువాత వాల్టర్ ర్యాలీ ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చాడట. ఆయన మీద అప్పటి కింగ్ జేమ్స్‌కు పట్టలేనంత కోపం వచ్చిందట. రాజ ధిక్కారానికి పాల్పడ్డాడని, స్పానిష్ ప్రజలతో గొడవలు వద్దంటే వినలేదని ఆ రాజుగారు వాల్టర్‌ తల తీసేయమని ఆర్డర్ వేశారట.

Full View

ఇలా ఎల్-డోరాడో ఎందరి ప్రాణాలు తీసిందోనని చాలా మంది చెప్పుకుంటారు. అది చరిత్రో... కట్టుకథో ఎవరికీ తెలియదు. కానీ, బంగారంతో నిండిన ప్రాంతం ఈ భూమ్మీద ఉందనే ఆలోచనే మనిషిని ఊరిస్తోంది. ప్రాణాలకు తెగించేలా చేస్తోంది.

ఆ అందమైన పసిడి పేరును... లాటిన్ అమెరికాలోని కొన్ని నగరాలకు పెట్టుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా కౌంటీకి కూడా ఆ పేరు పెట్టారు. ఎక్కడైతే డబ్బు బాగా దొరుకుతుందో ఆ నగరాన్ని ఎల్-డోరాడో అని వర్ణించడం కూడా ఓ ట్రెడిషన్ గా మారింది.

ఏది ఏమైనా... అసలు సిసలు ఎల్-డోరాడో కోసం శతాబ్దాలు గడిచినా అన్వేషణ ఆగలేదు. వెన్నెల్లో తడిసిన కొండల మీద ఆశ మిలమిల మెరుస్తూనే ఉంటుంది. ఆ కొండల నీడల్లో భయం చల్లగా వణికిస్తుంది. కానీ, ప్రయాణం ఆగదు. అదీ బంగారం మహిమ. 

Tags:    

Similar News