Vladimir Putin: అంతా నా ఇష్టం... 15 ఏళ్లు జైలు..
Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతూనే ఉన్నాయ్.
Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతూనే ఉన్నాయ్. ఉక్రెయిన్ పై యుద్ధం తర్వాత రష్యాపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. రష్యా, ఉక్రెయిన్‌పై దాడులు చేయడంపై సొంత దేశంలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాడుల్లో ఉక్రెయిన్ ప్రజలు బలి కావడాన్ని రష్యన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్ బలగాల చేతిలో రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టులేకపోతున్నారు. ఈ సమయంలో రష్యా మీడియాలో వస్తున్న వార్తలతో అక్కడి ప్రజల్లో ఆందోళన ఎక్కువవుతోంది.
రష్యన్ సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయారంటూ ఉక్రెయిన్ చేస్తున్న ప్రకటనలతో ప్రజల్లో అలజడి నెలకొంది. యుద్ధభూమిలో అసలేం జరుగుతుందోనన్న టెన్షన్ ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యన్ ఆర్మీ గురించి ఫేక్ వార్తలు ప్రసారం చేస్తే 15 ఏళ్లు జైలు శిక్ష విధించే చట్టానికి పుతిన్ నిన్న సంతకం చేశారు. రష్యా ప్రయోజనాలకు విరుద్ధంగా నడిచే మీడియాలు దేశంలో పనిచేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో రష్యాకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలను పూర్తి సెన్సార్ చేస్తున్నారు. ప్రభుత్వం తొలగించాలని చెప్పిన వీడియోలను తీసివేయనందున పలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను రష్యా నిషేధించింది.