అమెరికా ఆధిపత్యం ముగిసినట్టే.. టోనీ బ్లేయర్ సంచలన వ్యాఖ్యలు..
America: కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధంతో మారిన పరిస్థితులు
America: ఆ దేశం ఏం చెప్తే అదే వేదం. ఆ దేశం కన్నెర్రజేస్తే వేరే ఏదేశమైనా విలవిలలాడాల్సిందే. ఆ దేశాన్ని కాదంటే ఇక నూకలు చెల్లినట్టే ప్రపంచానికి ఇన్నాళ్లు పెద్దన్నలా వ్యవహరించింది అమెరికా అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. తన స్వప్రయోజనం కోసం ఎంతకైనా దిగజారే అగ్రదేశం వ్యవహారం ఇప్పుడు అందరికీ తెలిసొచ్చింది. ఆ దేశం పెద్దన్న పాత్రకు కూడా గండిపడుతోంది. అందుకు అమెరికా స్వయం తప్పిదాలు, అంతర్గత వ్యవహారాలు, కోవిడ్, ఉక్రెయిన్-రష్యా యుద్ధమే కారణం. ప్రపంచ దేశాలు ఇప్పుడు కూటములుగా ఏర్పడుతున్నాయి. అమెరికా మిత్రపక్షాలు ఒకవైపు చైనా, రష్యా మిత్రపక్షాలు మరొకవైపు తటస్థంగా ఉండే భారత్ వంటి దేశాలు ఇంకొకవైపు నిలబడుతున్నాయి.
అమెరికా, మిత్రపక్షాల ప్రపంచ ఆధిపత్యం ముగిసినట్టేనని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా పాశ్చాత్య దేశాల్లో స్తబ్దత నెలకొన్నదన్నారు. పాశ్యాత్య దేశాల్లో రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయని ఉత్పాదకత భారీగా పడిపోయిందని పక్షపాత ధోరణి ద్వంద్వ నీతి, దుష్ట రాజకీయాలతో ఇన్నాళ్లు విర్రవీగిన అగ్రదేశాలకు ఇక చెల్లుచీటి పడినట్టేనని వ్యాఖ్యానించారు. అమెరికా, మిత్రపక్షాల ప్రభావం తగ్గడంతో అంతర్జాతీయ వ్యవహారాల్లో కొత్త శక్తులు ఉద్భవిస్తాయని బ్లేయర్ అన్నారు. ఇప్పుడు రష్యా కంటే చైనాతోనే ఎక్కువ ముప్పు పొంచి ఉందన్నారు. ఇప్పటికే ప్రపంచ రెండో సూపర్ పవర్‌గా ఎదిగిందని ఇక్కడితో ఇది ఆగదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రెండు, మూడు కూటములు ఏర్పడే అవకాశముందని మాజీ లేబర్ పార్టీ నాయకుడు తెలిపారు.
ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో.. ప్రపంచ దేశాలు కూటములుగా విడిపోతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలో పలు దేశాలు జట్టుకడుతున్నాయి. మరోవైపు రష్యాకు అనుకూలంగా.. చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలు ఏకమవుతున్నాయి. ఇంధన, గ్యాస్ అవసరాలు కూడా కొన్ని దేశాలను రష్యా వైపు మొగ్గేలా చేస్తున్నాయి. మరోవైపు భారత్‌తో సహా 50కి పైగా దేశాలు తటస్థ వైఖరిని అవలంభిస్తున్నాయి. తటస్థ దేశాలను తమవైపు తిప్పుకునేందుకు అటు అమెరికా, ఇటు రష్యా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు అమెరికా వ్యవహరించిన తీరుతో పలు దేశాలు విసిగిపోయాయి. తాజా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ వంటి దేశాలు రష్యా వైపే ఇప్పుడు మొగ్గుచూపుతున్నాయి. తీవ్ర ఆంక్షలతో ఉక్రెయిన్ యుద్ధంతో విలవిలలాడుతున్న రష్యా ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించే అవకాశం లేదు. ఈ పరిణామాలు చైనాకు కలిసొస్తున్నాయి.
3వేల 488 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న భారత్‌తో తరచూ డ్రగన్ కంట్రీ కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత్ పొరుగుదేశాలను దాడులకు ఎగదోస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా డ్రాగన్‌కు కళ్లెం వేసేందుకు పావులు కదుపుతోంది. రష్యాతో భారత్ స్నేహాన్ని కొనసాగిస్తున్నా చైనా ఘర్షణల నేపథ్యంలో ఆ కూటమిలో ఢిల్లీ చేరే అవకాశం లేదు. అలా అని అమెరికావైపు కూడా మొగ్గు చూపే అవకాశం కూడా లేదు. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. విస్తారమైన మానవ వనరులు, ఉద్పాదక శక్తి, భారీగా ఆహార ధాన్యాలు, అత్యాధునిక ఆయుధాలున్న భారత్ సరసన నిలచేందుకు కూడా పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈజిప్టు, ఫిలిప్పైన్స్, వియత్నాం వంటి దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయి. అయితే చైనా నుంచి ముప్పు మాత్రం పొంచి ఉందని టోనీ బ్లేయర్ తెలిపారు. వ్యవస్థలు, ప్రజల జీవన విధానంపై చైనా తీవ్ర ప్రభావం చూపుతుందని మాజీ బ్రిటన్ ప్రధాని స్ఫష్టం చేశారు.
నిజానికి కొన్ని దశాబ్దాలుగా బ్రిటన్ పాటించిన ఫార్ములానే ఇప్పుడు చైనా అమలు చేస్తోంది. వ్యాపారం పేరుతో ఆయా దేశాల్లో పాగా వేస్తున్న చైనా ఆ తరువాత భారీగా అప్పులు ఇస్తోంది. సాధారణంగా ఏ దేశానికైనా మరో దేశం అప్పులు ఇస్తే ఆ నిధులను దేనికి ఉపయోగించారో నివేదిక ఇవ్వాలని కోరుతుంది. అయతే చైనా మాత్రం అలా కోరదు. అప్పు ఇచ్చిన తరువాత ఏమైనా చేసుకో వడ్డీతో సహా మొత్తం చెల్లించు అంటుంది. ఇలా చేయడంతో శ్రీలంక సర్వనాశనం అయ్యింది. చైనా ఇచ్చిన రుణాలపై పర్యవేక్షణ లేకపోవడంతో రాజపక్స సోదరులు నిధులను భారీగా విదేశాలకు తరలించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోని 165 దేశాలకు చైనా మొత్తం 38వేల 500 కోట్ల డాలర్ల రుణాలను ఇచ్చింది. ఈ 165 దేశాల్లో తక్కువ ఆదాయం కలిగిన దేశాలు 42 ఉన్నాయి. ఈ దేశాల జాబితాలో ఆయా దేశాలైనా శ్రీలంక, మాల్దీవ్స్, పాకిస్థాన్, మయన్మార్, టుర్క్మేనిస్థాన్, కజకిస్థాన్ దేశాలు ఉన్నాయి. ఈ 42 దేశాలు తమ తలసరి ఆదాయం కంటే అదనంగా 10 శాతం చైనాకు చెల్లించాల్సి ఉంది.
చైనా రుణ పాలసీ కూడా దారుణంగా ఉంటుంది. పాకిస్థాన్ అప్పులనే తీసుకుంటే చైనా 4 శాతం వడ్డీ రేటుకు రుణాలను ఇచ్చింది. అవే అప్పులకు పశ్చిమ దేశాలు వసూలు చేసే వడ్డీ రేటు కేవలం 1.1 శాతమే. ఈ రకంగా పోల్చుకుంటే చైనా అధిక వడ్డీలకు అప్పులను ఇస్తోంది. అప్పులు నిబంధనలను దాచిపెడుతుంది. అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పట్టించుకోకపోవడతో చైనా ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది.