Elon Musk Spacex: ఎలన్ మస్క్ స్పేస్‌ఎక్స్ కంపెనీకి అమెరికా షాక్
Elon Musk Spacex: ఎలన్ మస్క్ స్పేస్‌ఎక్స్ సంస్థకు యూఎస్ వార్నింగ్ * విజయవంతంగా స్టార్‌షిప్ హై-ఆల్టిట్యూట్ టెస్ట్
Elon Musk Spacex: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్పేస్ టూర్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయానం చేయగా.. ఈరోజు జెఫ్ బెజోస్ స్పేస్ టూర్‌కు రంగం సిద్ధమైంది.! ఇలాంటి తరుణంలో అంగారకుడు, చంద్రుడిపైకి మానవులను తీసుకెళ్లాలని తహతహలాడుతున్న ఎలాన్ మస్క్‌కు యూఎస్ సర్కార్ షాకిచ్చింది. ఎన్నో పరాజయాల తర్వాత ఎలన్ మస్క్ స్టార్ షిప్ హై ఆల్టిట్యూట్ టెస్టును విజయవంతంగా స్పేస్‌ఎక్స్ పరీక్షించింది. దీంతో తాజాగా స్టార్‌షిప్‌ను తొలిసారిగా భూ నిర్ణీత కక్ష్యలోకి పంపాలని స్పేస్ ఎక్స్ ప్రణాళిక చేస్తోంది. అయితే, ఈ ప్రయోగానికి ఫెడరల్ ఏవియేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆమోదం రాలేదు. అనుమతి లేకున్న ప్రయోగాన్ని కొనసాగిస్తుండడంతో ఎలన్ మస్క్ స్పేస్‌ఎక్స్ సంస్థను ఎఫ్‌ఎఎ హెచ్చరించింది.
ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ రాకెట్ ఇంటిగ్రేషన్ టవర్‌పై ఏజెన్సీ పర్యావరణ సమీక్ష చేస్తున్నట్లు ఎఫ్‌ఎఎ చెబుతోంది. అయితే, కంపెనీ రిస్క్ తీసుకుని టవర్ నిర్మాణం చేపడుతుందని ఎఫ్‌ఏఏ ప్రతినిధులు ఆరోపించారు. ఒకవేళ పర్యావరణ సమీక్షలో స్పేస్‌ఎక్స్ ఫెయిల్ ఐతే స్టార్‌షిప్ రాకెట్ అసెంబ్లీ లాంఛింగ్ టవర్‌ను కూల్చివేయడానికి ఎఫ్‌ఏఏ ఆదేశాలను ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రయోగ సమయంలో పర్యారణానికి హాని చేకూరితే కఠిన చర్యలను తీసుకోవడానికి ఎఫ్‌ఏఏ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ ప్రయోగానికి పర్యావరణ అనుమతులు తొందరలోనే వస్తాయని స్పేస్‌ఎక్స్ సంస్థ అధ్యక్షురాలు గ్విన్నే షాట్‌వెల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్టార్‌షిప్ ప్రయోగం విజయవంతమైతే ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.