అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య.. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా, ఆమె భర్త తమ భారత పర్యటన ముగించి ఫిబ్రవరి 25 న తమ దేశ అమెరికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా చేరుకున్నప్పటి నుండి, ఇవాంకా మరియు మెలానియా భారతదేశం గురించి తమ అనుభవాలను సోషల్ మీడియాలో నిరంతరం పంచుకుంటున్నారు. భారత్ పర్యటన సందర్బంగా మెలానియా ఢిల్లీలోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. అక్కడ హ్యాపినెస్ క్లాస్ రూములను తిలకించారు. ఈ సంధర్బంగా ఆమెకు చిన్నారి విద్యార్థినులు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెకు నుదుటున కుంకుమ పెట్టి, మేడలో దండ వేసి పాఠశాలలోకి ఆహ్వానించారు.
ఈ సంప్రదాయ స్వాగతాన్ని చూసి మెలానియా ఉద్వేగానికి లోనయ్యారు. అమెరికా వెళ్లిన తరువాత ఈ పాటశాలలో దిగిన ఫోటోలను ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. సర్వోదయ స్కూల్‌లో హ్యాపీనెస్ క్లాస్ సెషన్‌కు హాజరవడం మరిచిపోలేని అనుభూతిగా అభివర్ణించారు. తనకు స్కూల్‌లో సాదర స్వాగతం పలికిన అద్భుత చిన్నారులు , ఫ్యాకల్టీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. స్కూల్‌లో చిన్నారుల మధ్య తాను గడిపిన క్షణాలతో కూడిన వీడియోను సోషఃల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. అంతేకాదు తాజ్ మహల్ అందాలకు కూడా ఆమె ఫిదా అయ్యారు. ఈ విషయాన్నీ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
' ప్రపంచంలోని వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను దగ్గరగా వీక్షించడం ఉత్కంఠతను కలిగించింది ' అని క్యాప్షన్ ఇచ్చారు. ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ అద్భుతంగా ఉందని కొనియాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో కలసి తాజ్ ను వీక్షించిన ఓ వీడియో ని షేర్ చేశారు. కాగా తొలిసారి భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్ తో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే భారత్ పర్యటన తనకు మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందని ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే.