పుతిన్ పై రష్యాలో తిరుగుబాటుకు యత్నాలు..
Kyrylo Budanov: ఉక్రెయిన్ మేజర్ జనరల్ కిరిలో బుదనోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kyrylo Budanov: ఉక్రెయిన్ మేజర్ జనరల్ కిరిలో బుదనోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కీలక మలుపు తీసుకుని ఏడాది చివరిలో ముగిసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ ఈ యుద్ధంలో రష్యా ఓడిపోతే పుతిన్ పదవి పోవడం ఖాయమని ఆ దేశం కుప్పకూలుతోందని కిరిలో జోస్యం చెప్పారు. ఇప్పటికే పుతిన్‌ను గద్దె దింపే ప్రయత్నాలు ప్రారంభమైనట్టు చెప్పారు. రష్యాలో కొందరు పుతిన్‌పై తిరుగుబాటుకు యత్నిస్తున్నట్టు కిరిలో చెప్పుకొచ్చారు. తిరుగుబాటుదారులను ఆపడం మాస్కో అధినేతకు అసాధ్యమని స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరిలో బుదనోవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పుతిన్ మానసిక పరిస్థితి కూడా బాగాలేదని అనారోగ్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వెల్లడించారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో రష్యా అధ్యక్షుడిపై తాము తప్పుడు ప్రచారం చేయడం లేదని కిరిలో బుదనోవ్ అన్నారు. పుతిన్ సమాచారం తెలుసుకోవడం తమ విధుల్లో భాగమన్నారు. ఇక యుద్ధంలో రష్యా తీవ్రంగా నష్టపోతుందని బుదనోవ్ తెలిపారు. పుతిన్ సేనను చూసి ఐరోపా భయపడుతున్న మాటవాస్తవేమనన్నారు. కానీ రష్యా అనుకున్నంత బలమైన దేశం కాదన్నారు. మాస్కో సేనలను ఆయుధాలు కలిగిన జనసమూహంగా అభివర్ణించారు. ఖార్కివ్‌లో పుతిన్ సేనలను తరిమి కొట్టిన విషయాన్ని కిరిలో గుర్తు చేశారు. ఇప్పటికే రష్యా భారీగా సైన్యాన్ని ఆయుధాలను కోల్పోయిందన్నారు.
ఇదిలా ఉంటే పుతిన్ ఆరోగ్యం దెబ్బతిన్న విషయం ఇప్పటికే పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ప్రధానంగా పాశ్చాత్య మీడియాలోనే ఇలాంటి కథనాలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా పుతిన్‌కు క్యాన్సర్ సోకిందంటూ అమెరికాకు చెందిన న్యూయార్క్ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది. పుతిన్ ఉదర సంబంధ క్యాన్సర్‌తో పాటు పార్కిన్‌సన్, ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్టు తెలిపింది. పుతిన్ తప్పనిసరిగా క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు చెప్పినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. మీడియాలో పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలను ఇప్పటివరకు రష్యా మాత్రం ఖండించలేదు.
ఉక్రెయిన్-రష్యా యుద్దం ఫిబ్రవరి 24న మొదలయ్యింది. 80 రోజులుగా ఇరు బలగాల పోరాటం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్‌లోని పలు నగరాలను రష్యా బలగాలు ధ్వంసం చేశాయి. మరియూపోల్ నగరం పూర్తిగా ధ్వంసమైంది. మరియూపోల్‌తో పాటు ఖేర్సన్ ప్రాంతాలపై పుతిన్ సేనలు పట్టు సాధించాయి. ఈ యుద్దంలో ఇరు దేశాలకు భారీ నష్టం వాటిల్లింది. ఒక్క మరియూపోల్‌లోనే 10వేల మందికి పైగా ప్రజలు మృతి చెందినట్టు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. తాజాగా రష్యా యుద్ధ నేరాలపై ఉక్రెయిన్ విచారణ చేపట్టింది. రష్యాకు చెందిన 21 ఏళ్ల వాదిమ్ శిశిమరిన్ అనే సైనికుడిని కీవ్ కోర్టులో ఉక్రెయిన్ బలగాలు ప్రవేశపెట్టాయి. శిశిమరిన్ యుద్ధ నేరాలను ఒప్పుకున్నట్టు ఉక్రెయిన్ తెలిపింది.