Russia, Ukraine War: రష్యాపై బ్రిటన్ మిస్సైల్స్ పేల్చిన ఉక్రెయిన్.. ఖండాంతర క్షిపణితో కొట్టిన రష్యా
Russia, Ukraine Missiles War: రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ దూకుడు పెంచింది. మొన్నటికి మొన్న అమెరికా అందించిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్ రష్యాపై ప్రయోగించింది. దాంతో ఉక్రెయిన్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏకంగా అణు యుద్ధానికైనా సిద్ధమేనన్న సంకేతాలు ఇచ్చారు. అందులో భాగంగానే కొత్త న్యూక్లియర్ పాలసీపై సంతకం చేశారు. అయినప్పటికీ ఉక్రెయిన్ ఏ మాత్రం జంకడం లేదు. పైగా తాజాగా బ్రిటన్ అందించిన స్టార్మ్ షాడో మిస్సైల్స్‌ను కూడా ప్రయోగించిందని తెలుస్తోంది. రష్యాలోని మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ మిస్సైల్స్‌ను పేల్చింది.
ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా సాయం చేస్తోంది. ఇప్పటికే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రష్యా సైనికులకు మద్దతుగా ఉక్రెయిన్‌కు వేల సంఖ్యలో తమ దేశ సైనికులను పంపించారు. అయితే ఆ సంఖ్య వేలలో కాదు.. లక్ష వరకు ఉండే అవకాశం ఉందని ఉక్రెయిన్ మిత్రదేశాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. సరిగ్గా ఇదే అంశం బ్రిటన్ కు కోపం తెప్పించింది. రష్యాకు ఉత్తర కొరియా సాయాన్ని బ్రిటన్ తీవ్రంగా వ్యతిరేకింది. అందుకే ఉక్రెయిన్‌కు తమ దేశం అందించిన క్రూయిజ్ మిస్సైల్స్‌ను రష్యాపై ప్రయోగించేందుకు బ్రిటన్ అనుమతిచ్చింది.
అమెరికా మిస్సైల్స్ వాడుకొమ్మని ఉక్రెయిన్ కు జో బైడెన్ చెప్పినప్పుడు కూడా బ్రిటన్ స్పందించలేదు. దాంతో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా పాత్రను బ్రిటన్ ఎలా చూస్తుందనే విషయంలో క్లారిటీ కనిపించలేదు. కానీ తాజాగా బ్రిటన్ వేసిన అడుగు చూశాకా ఆ దేశం వైఖరి ఎలా ఉండబోతుందనే విషయంలో చాలా స్పష్టత వచ్చినట్లయింది.
మిత్ర దేశాలకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్‌స్కీ కూడా ఎప్పటి నుండో తమ మిత్ర దేశాలను ఒక సాయం కోరుతూ వస్తున్నారు. మిత్ర దేశాలు గతంలో ఇచ్చిన మిస్సైల్స్‌ను రష్యాపై ప్రయోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఎట్టకేలకు అమెరికా, బ్రిటన్ దేశాలు జెలెన్ స్కీ రిక్వెస్టుకు ఓకే చెప్పాయి. దీంతో రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లినట్లయింది.
రష్యా న్యూక్లియర్ పాలసీకి భయపడని బ్రిటన్
ఉక్రెయిన్‌కు సాయంగా కలిసొచ్చే దేశాలను భయపెట్టడం కోసమే రష్యా కొత్త న్యూక్లియర్ పాలసీని తీసుకొచ్చింది. తాము న్యూక్లియర్ పాలసీకి పదును పెడితే ఉక్రెయిన్‌కు మిత్ర దేశాల నుండి సాయం దొరకదని రష్యా భావించింది. కానీ బ్రిటన్ మాత్రం అదేమీ లెక్కచేయకుండా ఉక్రెయిన్ వైపే నిలవడం గమనార్హం.