ఉక్రెయిన్‌లో ఆకలి కేకలు.. రష్యా దాడులతో నగరాలు పూర్తిగా ధ్వంసం

నగరాల నుంచి మాస్కో బలగాలు వెళ్లిపోయినా.. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌ దిగ్భంధనం

Update: 2022-04-06 11:06 GMT

ఉక్రెయిన్‌లో ఆకలి కేకలు.. రష్యా దాడులతో నగరాలు పూర్తిగా ధ్వంసం

Ukraine-Russia War: నెల రోజుల పైగా సాగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్‌ పూర్తిగా ధ్వంసమైంది. ఆ దేశంలోని ముఖ్య నగరాలన్నింటిలోనూ రష్యా సైన్యం విధ్వంసం సృష్టించింది. ఏ నగరాన్ని చూసినా.. భవనాల శిథిలాలు, ధ్వంసమైన యుద్ధ వాహనాలు, మృతదేహాలే కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌ ప్రజల నుంచి ధనాన్ని, ఆహార నిల్వలను మాస్కో బలగాలు లాగేసుకున్నాయి. ఎక్కడికక్కడ ప్రజలు పిట్టల్లా కాల్చి చంపింది. ఆయా నగరాల్లోని ప్రజలకు సాయం అందించడానికి కూడా వీలు లేకుండా దారులన్నింటినీ పుతిన్‌ సేనలు మూసేశాయి. నల్లసముద్రానికి ఆనుకుని ఉన్న పట్టణాలన్నీ రష్యా గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారంతో పాటు మందులు వంటి నిత్యావసరాలు అందకుండా పోయాయి. ఉక్రెయిన్‌లోని కీలక నగరాల నుంచి మాస్కో బలగాలు వెనక్కి వెళ్లినా.. ఆ దేశాన్ని మాత్రం తమ కబంధ హస్తాలతో అష్టదిగ్భంధం చేసింది. దీంతో ఉక్రెయిన్‌ ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపడుతున్నట్టు రష్యా ప్రకటించింది. అప్పటికే ఉక్రెయిన్‌ సరిహద్దులో రెండు లక్షల మందికి పైగా సైన్యాన్ని రష్యా మోహరించింది. పుతిన్‌ సైనిక చర్చ ప్రకటన వెలువడగానే రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని కీలక పట్టణాలే లక్ష్యంగా దూసుకెళ్లాయి. రాజధాని కీవ్‌ ప్రాంతంలోని చెర్నిహైవ్‌, సుమీ, రోమ్నీ, ఖార్కివ్‌ తోపాటు దక్షిణాన ఉన్న మారియూపోల్‌, మెలిటోపోల్‌ ఖేర్సన్‌, ఒడెస్సా, మైకొలయువ్‌, ఉత్తరాన రోచర్నోబిల్‌, కోరోస్టెన్‌, కమిన్‌-కషిర్‌స్కీ నగరాలతో పాటు గ్రామాల్లోనూ రష్యా సైన్యం భీకరంగా విరుచుకుపడింది. బాంబుల వర్షం కురిపించింది. దీంతో భవనాలు కుప్పకూలాయి. వేలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. అయితే ఆయా నగరాలను ఆక్రమించుకోకుండా దారులను మాత్రమే మూసేసింది. దీంతో ఒకవైపు రష్యా బాంబుల దాడులు.. మరోవైపు తరిగిపోతున్న ఆహార నిల్వలతో ప్రజలు పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. ‎ఎందరో ప్రజలు నగరాలను విడిచి వెళ్లేందుకు ప్రయత్నించి.. మృత్యువాత పడ్డారు. ఎక్కడికక్కడ రోడ్లపై లగేజీ బ్యాగులతో, కూరగాయల సంచులతో మృత్యువాత పడిన పౌరుల దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

మానవతా దృక్ఫతంతో ఉక్రెయిన్‌లోని పలు నగరాల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు రష్యా ప్రకటించింది. అయితే అప్పటికే నగరాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రజల వద్ద ఉన్న ఆహార నిల్వలు పూర్తిగా అడుగంటాయి. తాగునీరు, మందులు లభించడం లేదు. దీంతో ప్రజలు ఆకలి కేకలతో విలవిలలాడుతున్నారు. ఆకలితో పలువురు బంకర్లలోనే చనిపోయి ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకుని ఎంత మంది చనిపోయారనేది ఇప్పటికీ స్పష్టత లేదు. ఇక ఆహారం అందకపోవడంతో పుతిన్‌ సేనలు కూడా ఆయా నగరాలను నుంచి తప్పుకున్నాయి. సైన్యం అక్కడి నుంచి తప్పుకోవడంతో ఉక్రెయిన్‌ ఆర్మీ, అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే ప్రజలకు అత్యవసర సేవలను మాత్రమే అందిస్తున్నారు. ఆహారం మాత్రం ఉక్రెయిన్ ఆర్మీ అందించడంలేదు. దీంతో ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు.

ఉక్రెయిన్‌కు సాయం అందే దారులన్నీ మూసుకుపోయాయి. మూడు వైపుల నుంచి రష్యా ఉక్రెయిన్‌కు దిగుమతలు రాకుండా అడ్డుకోవడంలో విజయవంతమైంది. దీంతో ఇప్పుడు జీవచ్ఛవంలా మారింది. ఇప్పటివరకు సుమారు 15 లక్షలకు పైగా ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు. అయితే దేశంలో ఉన్నవారికి ఆహారం అందించలేని దీన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు రష్యా దాడులు చేయకపోయినా ఆకలితోనే ఉక్రెయిన్‌ ప్రజలు చనిపోయే ప్రమాదం పొంచింది ఉంది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు నిస్సహాయంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ సమాజం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే పశ్చిమ దేశాల నుంచి సాయం అందినా ఆయా నగరాలకు అందించేందుకు కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. 

Tags:    

Similar News