ట్రంప్ మూడ్ మారిందా… అమెరికాలో డిగ్రీ చేస్తే గ్రీన్ కార్డ్ ఇస్తానని హామీ

ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గ్రీన్ కార్డులు, వీసాలు, శరణార్థుల పునరావాసం, ఇతర చట్టపరమైన వలసలపై ఆంక్షలు విధించారు.

Update: 2024-06-22 14:28 GMT

 Donald Trump: రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్..ఉపాధ్యక్ష పదవికి ఒహాయే సెనేటర్ జేడీ వాన్స్

 అమెరికా కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు భారత్, చైనా వంటి దేశాలకు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు ఆటోమేటిక్ గ్రీన్ కార్డులు ఇస్తామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఈ సమయంలో ట్రంప్ ఇచ్చిన హమీ చర్చకు దారి తీసింది. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వీసాల జారీతో పాటు నైపుణ్యం ఉన్న ఉద్యోగుల నియామకం విషయంలో కూడా ఆంక్షలు విధించారు.

తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే విదేశీ విద్యార్ధులు అమెరికాలో రెండేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేస్తే గ్రీన్ కార్డు పొందేలా చర్యలు తీసుకుంటామని ట్రంప్ చెప్పారు. గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ విషయమై కొంత ప్రయత్నించినట్టుగా ఆయన గుర్తు చేసుకున్నారు.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ తాజా వార్షిక నివేదిక ప్రకారం 2022-23 విద్యా సంవత్సరంలో 210 కి పైగా దేశాల నుండి ఒక మిలియన్ పైగా అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకున్నారు. 2022- 23లో 2,89,526 మంది చైనా విద్యార్థులు అమెరికాలో చదువుకున్నారు. విదేశీ విద్యార్ధుల్లో ఆ సంవత్సరం చైనా అగ్రస్థానంలో నిలిచింది.. అయితే గత ఏడాది చైనా విద్యార్థులు 0.2 శాతం స్వల్పంగా తగ్గారు.

ఏడు దేశాల నుండి వలసలపై బ్యాన్ విధించిన ట్రంప్

ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గ్రీన్ కార్డులు, వీసాలు, శరణార్థుల పునరావాసం, ఇతర చట్టపరమైన వలసలపై ఆంక్షలు విధించారు. దీంతో దేశంలోకి ప్రవేశించే చట్టబద్ధమైన శాశ్వత నివాసితుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముస్లింలు అధికంగా ఉండే ఏడు దేశాల నుంచి రాకపోకలను నిషేధించే ఉత్తర్వుపై సంతకం చేశారు.ఆ తరువాత చట్టపరమైన వలసలను సగానికి తగ్గించే ప్రతిపాదనను స్వీకరించారు.

అప్పట్లో హెచ్ 1 బీ వీసాపై ట్రంప్ ఆంక్షలు

నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకునేందుకు టెక్ కంపెనీలు ఇష్టపడే హెచ్ -1బీ వీసాల జారీని అమెరికా సంపదను దోచుకొనే కార్యక్రమంగా ఆయన విమర్శలు చేశారు. హెచ్ -1బి వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులను నియమించుకొనేందుకు యుఎస్ కంపెనీలను అనుమతిస్తుంది. సాఫ్ట్ వేర్ కంపెనీలు ప్రతి ఏటా చైనా, భారత్ నుండి వందల సంఖ్యలో ఉద్యోగులను హెచ్ 1 బీ వీసా కింద నియమించుకుంటాయి.

కరోనా సమయంలో, తన పదవీకాలం చివరి ఏడాది చట్టబద్ధమైన వలసలపై ఆంక్షలను ట్రంప్ విస్తరించారు. అమెరికాకు అన్ని రకాల వీసాలపై వచ్చేవారిని నిలిపివేయాలని ఆదేశించారు. విదేశీ విద్యార్ధులు కనీసం కొన్ని తరగతులకు వ్యక్తిగతం హజరుకాకపోతే బహిష్కరించాలని ప్రతిపాదించారు. 2020 ఎన్నికలకు నెల రోజుల ముందు ట్రంప్ మళ్లీ హెచ్-1బీ వీసాల జారీ పరిమితం చేశారు.

 

Tags:    

Similar News