Trump on covid 19: కరోనా టెస్టుల్లో అమెరికా, భారత్ మొదటి రెండు స్థానాల్లో..డోనాల్డ్ ట్రంప్!
Trump on covid 19 : ప్రాణాంతక కోవిడ్-19 నిర్దారణ పరీక్షల నిర్వహణలో 50 మిలియన్ టెస్ట్ లతో అమెరికా ముందుందని, ఆ తర్వాత12 మిలియన్ టెస్ట్ ల తో ఇండియా రెండవ స్థానంలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కోవిడ్-19 పరిస్థితులపై శ్వేతసౌధంలో ట్రంప్ మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎవరైతే త్వరగా కరోనా బారిన పడే అవకాశం ఉందో ఇప్పటికే ఓ అవగాహన వచ్చిందని మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నామని ప్రకటన చేశారు. ప్రతీ ఒక్క ప్రాణం విలువైనదేనని కరోనాతో మృత్యువాత పడిన వారికి నివాళిగా త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చి ప్రాణాంతక వైరస్‌ను ఓడిస్తామని ప్రతిజ్ఞ చేసారు.
కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా దురదృష్టవశాత్తూ కొన్ని చోట్ల పరిస్థితులు చేజారిపోయాయని అసహనం వ్యక్తంచేసారు. యువతలో చాలా మందికి కరోనా వచ్చినా లక్షణాలు బయపడటం లేదని, అసలు అనారోగ్యం బారిన పడిన విషయం కూడా వారికి తెలియడం లేదన్నారు. యువత బాధ్యతగా వ్యవహరించి తమతో పాటు ఎదుటి వారు వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని ట్రంప్ సూచించారు. కరోనాతో మరణించే చిన్నారుల సంఖ్య అత్యల్పంగా ఉండటం కాస్త ఊరట కలిగించే విషయమన్నారు ట్రంప్.