Russia-Ukraine War: ఖేర్సన్ నగరంలో తోకముడిచిన పుతిన్ సేనలు
Russia-Ukraine War: తగ్గేదే లే అంటూ యుద్ధకాంక్షతో చెలరేగిపోతున్న రష్యాకు దిమ్మ తిరిగేలా ఉక్రెయిన్ బదులిచ్చింది.
Russia-Ukraine War: తగ్గేదే లే అంటూ యుద్ధకాంక్షతో చెలరేగిపోతున్న రష్యాకు దిమ్మ తిరిగేలా ఉక్రెయిన్ బదులిచ్చింది. ఈపాటికే పలు నగరాలను ఆక్రమించుకున్న రష్యా సేనలకు ఉక్రెయిన్ సైన్యం దీటుగా బదులిస్తోంది. రష్యా ఆక్రమించుకున్న కీలక నగరాలను తిరిగి స్వాధీనపరుచుకుంటోంది. తాజాగా ఖేర్సన్ నగరాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనపరుచుకుంది. దీంతో ఖేర్సన్‌లో ఉక్రెయిన్ సైన్యం ఆనందాలకు అవధుల్లేకుండా పోయింది. ఉక్రెయిన్ సైన్యం దెబ్బకు తోక ముడిచిన రష్యా దళాలు ఖేర్సన్ నగరాన్ని వీడుతున్నాయి. రష్యా ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
నిప్రో నది పశ్చిమ తీరం నుంచి బలగాలను పూర్తిగా వెనక్కు తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే ఖేర్సన్‌లోకి ప్రవేశించిందని ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. ఈ పరిణామాన్ని కీలక విజయంగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో ఖేర్సన్ నగరం ఇక మాదే అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ప్రస్తుతానికి ఉక్రెయిన్ బలగాలు నగర శివార్లలో ఉన్నాయని, ప్రత్యేక విభాగాలు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయని తెలిపారు. రష్యా సేనలు పేలుడు పదార్థాలను వదిలిపెట్టాయన్న అనుమానంతో వాటిని తొలగించేందుకు బాంబ్ డిస్పోజబుల్ బృందం రంగంలోకి దిగింది. ఈ విజయంతో ఉక్రెయిన్ సైన్యం, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ జెండాలను ఎగురవేస్తూ విజయం మాదే అంటూ సంబురాలు జరుపుకుంటున్నారు.