26 మందికి కరోనా.. 13వేల మంది క్వారంటైన్..
Beijing: కరోనా.. మొదటి రెండు దశల్లో వణికించింది. నెగిటివ్ అని తేలితే లైట్ తీసుకుంటున్నారు.
Beijing: కరోనా.. మొదటి రెండు దశల్లో వణికించింది. నెగిటివ్ అని తేలితే లైట్ తీసుకుంటున్నారు. ఏముంది సెల్ఫ్ ఐసోలేషన్, కొన్ని మందులు తీసుకుంటే సరిపోతుందనుకుంటారు ఇది మన దేశంలో అయితే ఓకే.. కానీ.. చైనాలో అలా లైట్ తీసుకోవడానికి వీలుండదు. కరోనా టెస్టు అంటేనే బీజింగ్‌లో ప్రజలు వణికిపోతున్నారు.. దేవుడా.. దేవుడా.. నెగిటివ్ రాకుండా చూడు.. అంటూ వెయ్యిసార్లు మనస్సులోనే కనిపించని దేవుళ్లందరినీ మొక్కుకుంటున్నారు. లక్షణాలు బయటపడితే ఈడ్చుకెళ్లి మరీ క్వారంటైన్ శిబిరాల్లో పెడుతున్నారు. ఇప్పుడు కరోనా కంటే క్వారంటైన్లే చైనీయులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
2020లో కరోనా పేరు వింటే.. ఆమడ దూరం పరిగెత్తేవాళ్లు కుటుంబ సభ్యులు కూడా ముట్టుకోలేని పరిస్థితి.. వైరస్ సోకిందని తెలిస్తే.. ఆ కాలనీలోని ఇళ్ల తలుపులన్నీ మూతపడేవి. ఎవరైనా కోవిడ్‌తో మృతి చెందితే ఆ కాలనీలో భయాందోళన నెలకొన్నది.. కానీ.. వైరస్ ఉధృతి తగ్గడంతో మార్పు వచ్చింది. పైగా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇప్పుడు మన దేశంలో కరోనా సోకిందంటే ఎవరూ భయపడడం లేదు. అది కూడా సాధారణ జ్వరంలాగే ఇప్పుడు ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. దేశంలో అక్కడక్కడా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏమాత్రం లక్షణాలు ఉన్నా కరోనా టెస్ట్ చేయించుకోవడానికి ప్రజలు వెనుకాడడం లేదు. పాజిటివ్‌గా తేలినా ఏముందిలే అనుకుంటారు. సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టి మందులు తీసుకుని సెల్ప్ క్వారంటైన్‌కు వెళ్లిపోతున్నారు. కానీ చైనాలో అలా కాదు క్వారంటైన్ అంటేనే ఓ నరకంగా అక్కడ ప్రజలు భావిస్తున్నారు. అందుకే కరోనా కంటే ముందు క్వారంటైన్లకే భయపడుతున్నారు. వైరస్ టెస్ట్ చేయించుకునేందుకు మొండికేస్తున్నారు. కానీ అక్కడి అధికారులు బలవంతంగా కరోనా పరీక్షలను చేస్తున్నారు.
కరోనా వైరస్‌ను కట్టడికి చేయడానికి చైనా శతవిధాల ప్రయత్నిస్తోంది. జీరో కోవిడ్ విధానంతో కఠిన నిర్ణయాలను అమలుచేస్తోంది. నిన్న మొన్నటివరకు షాంఘైను వైరస్ అతలాలకుతలం చేసింది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా తలుపులను సీజ్ చేశారు. కఠిన లాక్‌డౌన్‌ను అమలుచేశారు. ఆహారం అందక అక్కడి ప్రజలు ఆహాకారాలు చేశారు. అయినప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం జీరో కోవిడ్ కోసమే ప్రయత్నాలు చేసింది. అత్యంత దారుణంగా వ్యవహరించింది. షాంఘైవాసులు కఠోర క్షణాలను గడిపారు. మానసికంగా ఎంతో కుంగిపోయారు. ఇప్పుడిప్పుడే అక్కడ వైరస్ ఉధృతి తగ్గడంతో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేస్తున్నారు. అయితే తాజాగా బీజింగ్‌ను మహమ్మారి వణికిస్తోంది. షాంఘై సీన్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా జీరో కోవిడ్ పేరుతో అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా 26 మందికి కరోనా వచ్చిందని ఏకంగా 13వేల మందిని రాత్రికి రాత్రే క్వారంటైన్‌కు తరలించింది. వాళ్లందరినీ హోటళ్లకు తరలిస్తామని మొదట చెప్పినప్పటికీ క్వారంటైన్ శిబిరాలకు తరలించినట్టు తెలుస్తోంది.
బీజింగ్‌లోని నాంగ్జిన్యూన్ ప్రాంతంలో 26 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో బీజింగ్ అధికారులు హల్‌చల్ చేశారు. ఉన్నట్టుండి అక్కడి ప్రజలను వాహనాల్లో తరలించారు. రాను పో అన్నవారిని అధికారులు ఈడ్చుకెళ్లారు. అయితే తాజాగా క్వారంటైన్‌కు తరలించిన 13వేల మందికి నెగటివ్ రిపోర్టే ఉన్నది. బాబోయ్ నాకు కరోనా రాలేదు అన్నా అధికారులు మాత్రం క్వారంటైన్‌కు తరలించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు వారిలో చాలా మంది ఏప్రిల్ నుంచే లాక్‌డౌన్‌లో ఉన్నారట. పలుమార్లు కరోనా పరీక్షలు నిర్వహించినా నెగటివ్‌గానే వచ్చిందట అయినా అధికారులు మాత్రం వదల్లేదు. వారిలో అత్యధికంగా చిన్నారులు, వృద్ధులు ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం అత్యవసరాలు మాత్రమే చేతబట్టుకుని ప్రభుత్వం తరలించడానికి ఏర్పాటు చేసిన వాహనాల్లోకి వెళ్లిపోయారు. తాజాగా నాంగ్జిన్యూన్ ప్రాంతాన్ని అధికారులు బ్లాక్ చేశారు. ఇప్పుడు తరలించిన 13వేల మందిని వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నట్టు సమాచారం.
క్వారంటైన్ చైనీయులను వణికిస్తోంది. క్వారంటైన‌్లలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి సరైన తిండిలేక అల్లాడుతున్నారు. క్వారంటైన్ వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వైరస్ సోకడం కంటే క్వారంటైన్‌లోనే చనిపోయేలా ఉన్నామని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా టెస్టులకు కూడా వెనుకాడుతున్నారు. ఒకవేళ అధికారులు బలవంతంగా కరోనా టెస్లు చేస్తే.. దేవుడా.. దేవుడా.. పాజిటివ్ రాకుండా.. కాపాడు.. అంటూ మనస్సులోనే కనిపించని దేవుళ్లందరికీ మొక్కుకుంటున్నారు. టెస్టులో పాజిటివ్ అని తేలితే అదొక శాపంగా చైనీయులు భావిస్తున్నారు. జీరో కోవిడ్ పేరుతో కఠినంగా వ్యవహరిస్తున్న చైనా వేలాది క్వారంటైన్ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నా అక్కడ వసతులను కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది. ఫలితంగా క్వారంటైన్ పేరు చెబితేనే చైనీయులు భయపడుతున్నారు.
చైనా జీరో కోవిడ్ విధానంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మానవ హక్కులను చైనా ఉల్లంఘిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ జీరో కోవిడ్ విధానమే అనుసరణీయమంటూ జిన్‌పింగ్ ప్రభుత్వం చెబుతోంది.