టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు దెబ్బ మీద దెబ్బ.. షాక్ ఇచ్చిన చైనా ప్రభుత్వం
Elon Musk Vs China: స్టార్‌లింక్ శాటిలైట్లపై చైనా శాస్త్రవేత్తల అధ్యయనం
Elon Musk Vs China: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టార్‌లింక్ సేవలపై చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకవేళ తమ జాతీయ భద్రతకు హాని కలిగిస్తే.. స్టార్‌లింక్‌ను నాశనం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఆ మేరకు అధ్యయనంత కూడిన ప్రకటనను డ్రాగన్ కంటీ విడుదల చేసి.. ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ ఇచ్చింది. మరోవైపు ట్విట్టర్ షేర్ విలువను తగ్గించేందుకు మస్క్ మ్యానిపులేట్ చేశారంటూ శాన్‌ప్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో పిటిషన్ దఖాలయ్యింది. ఇటీవల ట్విట్టర్‌ను 4వేల 400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్.. డీల్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఎలాన్ మస్క్ తక్కువ ధరకు ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలనో.. లేదంటే డీల్‌ను రద్దు చేసుకునేందుకో యత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ట్విట్టర్‌ను 4వేల 400 కోట్ల డాలర్ల కొనుగోలు డీల్ కుదిరిన మరుసటి రోజే.. టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 12వేల 600 కోట్ల డాలర్లు ఒక్కరోజులోనే ఆవిరయ్యాయి. ట్విట్టర్‌లో పెట్టుబడులకు టెస్లా షేర్లను అమ్ముతారేమోనని మదుపర్ల ఆందోళనతో టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ట్విట్టర్ కొనుగోలుకు వెచ్చించిన ధనం కంటే.. అదనంగా మరో రెండు రెట్ల ధనం ఎలాన్ మస్క్ కోల్పోయారు. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే.. 9 లక్షల 66వేల కోట్ల రూపాయలను టెస్లా ఒక్క రోజులోనే నష్టపోయింది. ఇది మస్క్‌ను బాగా ఇబ్బందులకు గురి చేసింది. సంస్థ షేర్ల విలువ 12.2 శాతం తగ్గింది. టెస్లా షేర్ల పతనంతో మస్క్‌కు 21 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 21 బిలియన్ డాలర్ల నగదునే ఇచ్చేందుకు ట్విట్టర్ యాజమాన్యంతో మస్క్ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
ట్విట్టర్ డీల్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఇటీవల మస్క్ ప్రకటించారు. స్పామ్, ఫేక్ అకౌంట్లపై స్పష్టమైన వివరాలు ఇంకా అందలేదని కారణం తెలిపారు. అయితే టెస్లా నష్టాలతో.. ట్విట్టర్ కొనుగోలుపై మస్క్ పునరాలోచనల్లో పడినట్టు అమెరికా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తే.. తక్కువ ధరకు కొనుగోలు చేయాలని మస్క్ యోచిస్తున్నట్టు కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఏకంగా డీల్‌నే రద్దు చేసుకోవాలని మస్క్ భావిస్తున్నారంటూ మరికొందరు విశ్లేషకులు వాదిస్తున్నారు. అందుకు స్పామ్ అకౌంట్లను మస్క్ బూచీగా చూపుతున్నట్టు వివరిస్తున్నారు. ఇక ఆసియా దేశాల్లో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను పెంచాలనే ఉద్దేశంతో చైనాలో ఏర్పాటు చేసిన ప్లాంట్.. లాక్‌డౌన్ కారణంగా మూతపడింది. ఆ తరువాత లాక్‌డౌన్ ఎత్తివేసినా.. సప్లయ్ చైన్ దెబ్బతినడంతో ముడి సరుకు దిగుమతి ఆగిపోయింది. ఫలితంగా చైనాలోని గిగా ప్లాంట్‌ను మూతపడింది.
తాజాగా ఎలాన్ మస్క్‌కు చైనా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్లపై చైనా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. స్టార్‌లింక్ ఉపగ్రహాలతో తమ జాతీయ భద్రతకు హాని కలిగించేవిగా పరిణమిస్తే.. ముందూవెనుక ఆలోచించకుండా వాటిని కూల్చేస్తామని చైనా మిలటరీ ప్రకటించింది. వాటిపై నితంరం నిఘా, పర్యవేక్షణ అవసరమని అధికారికంగా వెల్లడించింది. ఈ అధ్యయనానికి బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాకింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ పరిశోధకుడు రెన్ యువాన్‌జెన్ నేతృత్వం వహించారు. ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. భూమికి అతి తక్కువ ఎత్తులోని కక్ష్యలో ఈ శాటిలైట్లను ప్రవేశపెట్టారు. ఇవి భూమిమీద బ్రాండ్ బాండ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి. అమెరికా డ్రోన్స్, ఫైటర్ జెట్స్ డేటా ట్రాన్స్‌మిషన్ వేగాన్ని స్టార్‌లింక్ ఉపగ్రహాలు వంద రెట్లు పెంచుతున్నట్టు చైనా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే అవసరమైతే స్టార్‌లింక్ ఉపగ్రహలను అన్నింటినీ కూల్చేందుకు సిద్ధమని చైనా అధికారికంగా ప్రకటించింది.
మరోవైపు శాన్‌ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో ఎలాన్ మస్క్‌పై పిటిషన్ దాఖలయ్యింది. ఇటీవల మైక్రోబ్లాగింగ్ దగ్గజం ట్విట్టర్ షేర్ విలువను తగ్గిపోయేలా చేస్తున్నారంటూ షేర్‌హోల్డర్లు ఈ పిటిన్ దాఖలు చేశారు. మస్క్ ఇటీవల ట్విట్టర్‌పై చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్లు.. సంస్థ డీల్‌పై సందేహాన్ని సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ట్విట్టర్ షేర్లు భారీగా పతనమవుతున్నాయంటున్నారు. మస్క్ వ్యాఖ్యలతో ట్విట్టర్ ఇటీవల 800 కోట్ల డాలర్లు నష్టపోయినట్టు ఆరోపిస్తున్నారు. అంతకుముందు 45 డాలర్లకు పైగా ఉన్న షేర్ విలువ ఇప్పుడు 39.52 డాలర్లకు పడిపోయినట్టు చెబుతున్నారు. మొదట్లో మస్క్ ఒక్కో షేర్‌కు 54.20 డాలర్లను చెల్లిస్తానని ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే మస్క్ అంగీకరించిన ధర, నిబంధనల ప్రకారమే టేకోవర్‌ను ఆలస్యం లేకుండా పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని ట్విట్టర్ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీనిపై ఎలాన్ మస్క్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.
ట్విట్టర్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఎలాన్ మస్క్‌కు కలిసి రావడం లేదు. వరుసగా తగుతులున్న దెబ్బలకు కుదేలవుతున్నాడు. ఇక ట్విట్టర్‌కు కూడా తాజాగా అమెరికా న్యాయశాఖ షాక్ ఇచ్చింది. ఖాతాదారుల భద్రత, గోప్యత నిబంధనల ఉల్లంఘనపై 11 వందల 63 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాలని ట్విట్టర్‌ను ఆదేశించింది.