టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు వరుస దెబ్బలు
*ట్విటర్ కొనుగోలుతో టెస్లాకు భారీ లాస్
Elon Musk: ప్రపంచ కుబేరుడు, ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏ ముహూర్తా ట్విట్టర్‌ను కొనుగోలు చేశారో కానీ వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వెంటనే టెస్లా షేర్లు భారీగా పడిపోయాయి. ఏకంగా 126 బిలియన్ డాలర్లు నష్టపోయాడు. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే 9 లక్షల 66వేల కోట్ల రూపాయలు ఒక్క రోజులోనే ఆవిరయ్యాయి. ఎన్నో ఆశలతో చైనాలో ప్రారంభించిన టెస్లా కార్ల కర్మాగారం గిగా ఫ్యాక్టరీ తాజాగా మరోసారి మూత పడింది. అంతేకాదు భారతీయ చట్టాలను ట్విటర్ ఉల్లంఘిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. తప్పనిసరి ఇక్కడి చట్టాలను పాటించాల్సిందేని తేల్చి చెప్పింది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు వేసి 44 బిలియన్ డాలర్లకు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడైన మస్క్ సంపద విలువ 779 బిలియన్ల పైమాటే. టెస్లాలో ఆయనకు 17 శాతం వాటాలు ఉన్నాయి. అయితే ట్విటర్‌ను కొన్న మరుసటి రోజే భారీగా టెస్లా కంపెనీ షేర్లు పడిపోయాయి. దీంతో టెస్లా ఏకంగా 126 బిలియన్ డాలర్ల సంపదన కోల్పోయింది. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే 9 లక్షల 66వేల కోట్ల రూపాయలను టెస్లా ఒక్క రోజులోనే నష్టపోయింది. టెస్లా షేర్లలో 12.2 శాతం తగ్గింది. టెస్లా షేర్ల పతనంతో మస్క్‌కు 21 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 21 బిలియన్ డాలర్ల నగదునే ఇచ్చేందుకు ట్విట్టర్ యాజమాన్యంతో మస్క్ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. టెస్లా షేర్లను మస్క్ అమ్ముతారేమోనని మదుపర్లలో నెలకొన్న భయమే షేర్లు పడిపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు ఇదే టెస్లాకు మరో కష్టం వచ్చింది. భారత్‌తో పాటు ఆసియా దేశాల్లో ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని మస్క్ భావించారు. అందుకు ఈలాన్ మస్క్ వ్యూహాత్మక భాగస్వామిగా చైనాను ఎంచుకున్నారు. చైనాలోని ఆర్థిక రాజధాని షాంఘైలో బిలియన్ డాలర్లు వెచ్చింది టెస్లా గిగా ఫ్యాక్టరీని నిర్మించారు. అయితే చైనాలో తయారైన వస్తువుల దిగుమతిపై భారీ పన్ను విధిస్తోంది భారత్. దీంతో ప్రపంచంలో రెండో పెద్ద మార్కెటైన భారత్ విషయంలో ఈలాన్ మస్క్ పలు మార్లు సంప్రదింపులు జరిపినా పన్ను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. తమ దేశంలోనే ప్లాంట్‌ను కార్లను తయారుచేస్తేనే అనుమతులు ఇస్తామని కేంద్రం తెల్చి చెప్పింది. దీంతో భారత్‌కు టెస్లా కార్లు ఇప్పట్లో వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఇది టెస్లాకు ఓ దెబ్బ అయితే తాజాగా చైనా కరోనాతో వరుస దెబ్బలు తగులుతున్నాయి.
టెస్లాకు ఓ వైపు మార్కెటింగ్ సమస్యలు చుట్టుముట్టగా షాంఘైలో కరోనా కేసులు పెరిగిపోవడం కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. మార్చి చివరి నుంచి షాంఘైలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్‌ను అదుపు చేసేందుకు జిన్‌పింగ్ ప్రభుత్వం లాక్‌డౌన్ అమలుచేస్తోంది. దీంతో టెస్లా కార్ల కర్మాగారం మూతపడక తప్పని పరిస్థితి నెలకొంది. 22 రోజుల పాటు మూతపడిన పరిశ్రమలో.. గతనెల 19న తిరిగి ఉత్పత్తి ప్రారంభమైంది. కరోనా దెబ్బతో కఠిన లాక్‌డౌన్ అమలు చేయడంతో చైనాలో సప్లై వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. కార్ల తయారీలో ఉపయోగించే అనేక ముడి వస్తువుల లభ్యత తగ్గిపోయింది. ఫలితంగా ఫ్యాక్టరీని ప్రారంభించిన ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో గత్యంతరం లేక మళ్లీ నిన్న ప్లాంట్‌కు టెస్లా తాళం వేసింది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం టెస్లా విడుదల చేయలేదు.
మరోవైపు ట్విటర్ వర్సెస్ కేంద్ర వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా పలు ఖాతాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను బేఖాతరుచేయడంతో కేంద్రం ఆగ్రహానికి గురయ్యింది. భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆ తరువాత భారతీయ చట్టాలను గౌరవిస్తామని ట్విటర్ తెలపడంతో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. అయితే మూడేళ్ల క్రితం లాయర్ సంజయ్ హెగ్డే ఖాతాను స్పెండ్ చేస్తూ.. ట్విటర్ తీసుకున్న నిర్ణయంపై తాజాగా హైకోర్టులో కేంద్రం స్పందించింది. ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్ వచ్చిన తరువాత.. ఈ కేసు బయటకు రావడం గమనార్హం. అయితే ఇప్పుడు హెగ్డే ఖాతాను సస్సెండ్ చేయడం భారత రాజ్యాంగం, వాక్ స్వాతంత్రం హక్కులను ఉల్లంఘించడమేనని కేంద్రం కోర్టుకు తెలిపింది. భారత చట్టాలను తప్పకుండా గౌరవించాల్సిందేనని మరోసారి కేంద్ర స్పస్టం చేసింది. మస్క్ చేతికి ట్విటర్ వచ్చిన సందర్భంలోనే భారత్‌లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. తాజా పరిస్థితులు చూస్తుంటే మస్క్ పిట్టకు మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు.
అయితే ఎలాన్ మస్క్ కూడా వాక్ స్వాతంత్రం ఉండాలనే పట్టుబట్టారు. ట్విటర్ ప్రైవేటు కంపెనీ అయితేనే అది సాధ్యమని స్పష్టం చేశారు. అందుకే తాను కొనుగోలు చేయాలనుకుంటున్నాని మస్క్ గతంలోనే చెప్పారు. ఫేక్ కంటెంట్, ఖాతాలను తొలగిస్తామని ట్విటర్‌ను మరింత పాదర్శకంగా చేస్తామని మస్క్ ప్రకటించారు. తాజాగా అదే విషయమై హైకోర్టుకు కేంద్రం ట్విటర్ నిబంధనలు ఉల్లంఘిస్తోందని స్పష్టం చేయడం గమనార్హం.