అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో మంచు తుఫాన్ బీభత్సం
* మైనస్ 5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు * రోడ్లపై దట్టంగా పేరుకుపోయిన మంచు
అమెరికా దక్షిణాది రాష్ట్రాలను మంచు తుఫాన్ వణికిస్తోంది. టెక్సాస్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ ఐదు డిగ్రీలకు పడిపోయాయి. పడిపోయిన ఉష్ణోగ్రతలతో పాటు మంచు వర్షం కురుస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారులు, ఇళ్లను మంచు కమ్మేసింది. రోడ్లపై మంచు దట్టంగా పేరుకుపోయి వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇక మంచు తుఫాన్ ధాటికి రాకపోకలన్నీ స్తంభించాయి. విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మరోవైపు మంచు తుఫాన్ ఎఫెక్ట్‌కి టెక్సాస్‌లో విద్యుత్ కొరత ఏర్పడింది. విద్యుత్ వినియోగం ఎక్కువవడంతో పవర్ ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. భారీగా కరెంట్ కోతలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో కరెంట్ కోతలు ఇంకా ఎక్కువయ్యే పరిస్తితులు కనిపిస్తున్నాయి. విద్యుత్ కోతలకు సిద్ధంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.