నేడు రష్యాలో విక్టరీ డే ఉత్సవాలు.. పుతిన్ ప్రసంగంపై ఉత్కంఠ...
Russia - Victory Day 2022: రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా వేడుకలు
Russia - Victory Day 2022: ఉక్రెయిన్ పై చేపట్టిన ప్రత్యేక సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు పుతిన్ పూర్తిస్థాయి యుద్ధంగా మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన ఇవాళ కీలక ప్రకటన చేస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. నేడు రష్యాలో విక్టరీ డే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పుతిన్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఉక్రెయిన్ పై పూర్తిస్థాయిలో యుద్ధం ప్రకటిస్తారా? అనే చర్చ నడుస్తోంది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజ్ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ఏటా మే 9న విక్టరీ డే పేరుతో భారీగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ దఫా కూడా అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రష్యా వ్యాప్తంగా అనేక నగరాల్లో సోవియట్ జెండాలు, మిలిటరీ రిబ్బన్లు దర్శనమిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గతంలతో పోలిస్తే ఈసారి పరిస్థితులు కొంత గంభీరంగా కనిపిస్తున్నాయి. దాదాపు 11 వారాలుగా ఆ దేశంలో కొనసాగుతున్న ప్రత్యేక మిలిటరీ చర్యను ఇకపై పూర్తిస్థాయి యుద్ధంగా ప్రకటన చేసే అవకాశముందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పుతిన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మారియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటనతో పాటుగా పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అణ్వాయుధాలను ప్రయోగిస్తారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. విజయోత్సవ దిన వేడుకల్ని ఉక్రెయిన్ నగరాల్లో కూడా నిర్వహించడానికి రష్యా సన్నాహాలు చేస్తున్నట్టు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మారియుపోల్ సహా శిథిలావస్థకు చేరుకున్న పలు నగరాలను రష్యా సైన్యం పరిశుభ్రం చేస్తూ ఉండడమే దీనికి తార్కాణమని పేర్కొంటోంది.
ఇవాళ జరిగే విక్టరీ డేలో పుతిన్ ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రసంగించి వారందరితో ఆయుధాలు పట్టించే ప్రమాదం ఉందని పశ్చిమాది దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ దండయాత్రపై రష్యన్లలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చి వారిలో దేశభక్తి రేగేలా పుతిన్ ప్రసంగించడానికి సిద్ధమయ్యారని అభిప్రాయపడుతున్నారు.