Sunita Williams: స్పేస్ నుంచే సునీతా విలియమ్స్ ఓటు.. ఇదెలా సాధ్యం..!
Sunita Williams: సునీతా విలియమ్స్, బుచ్విల్మోర్ అంతరిక్షం నుండి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేయనున్నారు.
Sunita Williams: బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమమ్స్, బుచ్ విల్‌మోర్ తాజాగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలో త్వరలోనే జరగబోయే ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు.
బ్యాలెట్ కోసం మా అభ్యర్థనను కిందకు పంపించామని.. అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం మా కీలక కర్తవ్యమని, మా విధిని నెరవేర్చుకునేందుకు నాసా సహకరిస్తుందని విల్‌మోర్ వెల్లడించారు. అనంతరం సునీత మాట్లాడుతూ.. ఓటు మా బాధ్యత. అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు.
కాగా.. అంతరిక్షంలో పనిచేసే వ్యోమగాములు ఓటు హక్కు వినియోగించడం ఇదే తొలిసారి కాదు. 1977 నుంచి నాసా తమ వ్యోమగాములకు ఈ అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను వినియోగిస్తోంది. ఈ ప్రక్రియంతా కాస్త క్లిష్టమే అయినప్పటికీ నాసా దాన్ని కొనసాగిస్తోంది. తొలుత ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలతో అంతరిక్ష కేంద్రానికి పంపిస్తారు.
అక్కడ వ్యోమగాములు వాటిలో వివరాలను రాసి మళ్లీ భూమి మీదకు పంపిస్తారు. పారదర్శకత కోసం ఎన్‌క్రిప్షన్ పద్ధతిలో బ్యాలెట్లను హ్యూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్ సెంటర్‌కు పంపిస్తారు. అక్కడి నుంచి వాటిని ఆయా రాష్ట్రాల్లోని కౌంటీ క్లర్క్‌లకు పంపించి ప్రాసెస్ చేయిస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో సునీత, విల్‌మోర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అంతరిక్షంలో ఎక్కువకాలం గడపడం కష్టమే అయినప్పటికీ.. ఇది తనకు హ్యాపీ ప్లేస్ అని సునీత తెలిపారు.