Boeing Starliner: సునీతా విలియమ్స్ లేకుండానే భూమికి తిరిగొచ్చిన స్టార్‌లైనర్
అర్ధంతరంగా ముగిసిన బోయింగ్ అంతరిక్ష మానవసహిత ప్రయోగం. భూమిని చేరిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక.న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్‌లో సురక్షితంగా కిందకు దిగిన క్యాప్సుల్.మరికొన్ని నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్
Boeing Starliner: బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవసహిత ప్రయోగం అర్ధంతరంగా ముగిసింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన ఈ సంస్థ వ్యోమనౌకకు అంతరిక్షంలో పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి ఖాళీ క్యాప్సుల్ కిందకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమిని చేరింది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్‌లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి విల్‌మోర్ ఈ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు.
జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్.. వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్ సురక్షితమే అని చెప్పింది. కానీ, నాసా అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్‌లైనర్ ఖాళీగా తిరుగు పయనమైంది. అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన ఆరు గంటల తర్వాత న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్‌లో ఈ క్యాప్సుల్ సురక్షితంగా కిందకు దిగింది. వ్యోమగాముల కోసం స్పేస్‌ఎక్స్ వ్యోమనౌకను సిద్ధం చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు సునీతా, విల్‌మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.