చంద్రుడికి పొంచి ఉన్న రాకెట్ క్రాష్ ల్యాండ్ ప్రమాదం.. మార్చ్ 4న చంద్రుడిపై ఏం జరగబోతోంది?
SpaceX Rocket: సైంటిస్టుల కీలక రాకెట్ ప్రయోగం అదుపుతప్పింది.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అయినా కుప్పకూలుతుందని ప్రకటన వచ్చేసింది.
SpaceX Falcon 9 Rocket: సైంటిస్టుల కీలక రాకెట్ ప్రయోగం అదుపుతప్పింది.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అయినా కుప్పకూలుతుందని ప్రకటన వచ్చేసింది. ఇంకేముంది ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అన్న భయమే అందరిలోనూ రీసెంట్‌గా రిలీజ్ అయిన స్కైల్యాబ్ మూవీ అచ్చంగా ఇలాంటి కథతోనే ఆకట్టుకుంది.! అయితే, ఇదే కథ ఇప్పుడు నిజం కాబోతోంది. అయితే, ఈసారి ప్రమాదం భూమికి మాత్రం కాదు చంద్రుడికి.! అన్నీ అనుకున్నట్టే జరిగితే మార్చ్ 4నే చందమామను ఓ భారీ రాకెట్ ఢీకొట్టబోందని సైంటిస్టులు చెబుతున్నారు.
స్పేస్‌ఎక్స్ కంపెనీ ద్వారా ఫాల్కన్ 9 బూస్టర్ రాకెట్‌ను 2015 ఫిబ్రవరిలో అంతరిక్షంలోకి పంపించారు. అంతరిక్షంలోని లోతైన పరిస్థితుల్ని పరిశీలించడానికి ఈ రాకెట్‌ను ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు సైంటిస్టులు. ఈ ప్రయోగంలో ఫస్ట్ ఫేజ్ సూపర్ సక్సెస్ అనప్పటికీ.. రెండో దశలో ప్లాప్ అయ్యింది. అయితే ఫాల్కన్ 9 బూస్టర్ అప్పటి నుంచి అస్తవ్యస్తమైన కక్ష్యను అనుసరించింది. దీంతో అదుపు తప్పి జాడ లేకుండా పోవడంతో స్పేస్ జంక్‌గా దాదాపు ఒక నిర్ధారణకు వచ్చేశారు సైంటిస్టులు.
దాదాపు ఏడేళ్లు కక్షలో చక్కర్లు కొట్టిన ఫాల్కన్ 9 బూస్టర్ రాకెట్.. తాజాగా చంద్రుడి వైపు కక్ష్యను మార్చుకుని దూసుకెళ్తోంది. సుమారు 4వేల కేజీల బరువున్న పాల్కన్ 9 బూస్టర్ రాకెట్.. ప్రస్తుతం గంటకు 9వేల కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు పయనిస్తోంది. నాసా అంచనాల ప్రకారం మార్చ్ 4వ తేదీన ఈ క్రాష్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి మిలియన్ మైళ్ల ట్రెక్‌లో అంతరిక్ష వాతావరణ ఉపగ్రహాన్ని పంపడం ద్వారా తన మొదటి డీప్-స్పేస్ మిషన్‌ను ప్రారంభించినప్పటికీ.. ఫాల్కన్ 9 బూస్టర్ కొంత అస్తవ్యస్తమైన కక్ష్యలో తిరుగాడింది. దీంతో ఈ రాకెట్ సంగతిని శాస్త్రవేత్తలు పట్టించుకోవడమే మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రుడివైపు దూసుకెళ్లడం టెన్షన్ పుట్టిస్తోంది.
ఇదిలా ఉంటే నాసా లునార్ ఆర్బిటర్‌తో పాటు భారత్ చంద్రయాన్-2 స్పేస్‌క్రాఫ్ట్‌లు ఈ క్రాష్ ల్యాండ్‌ను అతి సమీపంగా గమనించనున్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. అయితే, ఈ క్రాష్ ల్యాండ్‌ను సైతం.. చంద్రుడి ఉపరితలం మీది పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం పరిశీలిస్తామని చెబుతున్నారు. 2009లో సైతం నాసా కావాలనే ఒక రాకెట్‌ను చంద్రుడి మీదకు క్రాష్ లాంఛ్ చేసింది.
అయితే.. ఫాల్కన్ విషయంలో అనుకోకుండా చంద్రుడి ఉపరితలంపైకి ఢీ కొడుతుండడం హాట్‌టాపిక్ అవుతోంది. ఫాల్కన్ 9 బూస్టర్ రాకెట్ చంద్రుడ్ని ఢీ కొట్టడం ద్వారా జరిగే ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని స్పేస్ రీసెర్చర్లు భావిస్తున్నారు. మొత్తంగా మార్చ్ 4న చంద్రుడిపై ఏం జరగబోతోందనే అంశంపై ప్రపంచ స్పేస్ ఏజన్సీలన్నీ ఆసక్తిగా పరిశీలించబోతున్నాయి.