కాశ్మీర్‌పై విషం కక్కిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్
*కశ్మీర్ అంశాన్ని యూఎన్ అసెంబ్లీలో లేవనెత్తిన ఎర్డోగన్
Recep Tayyip Erdogan: టర్కీ ఎక్కడో ఐరోపా ఖండంలో ఉన్న దేశం. దీనికి భారత్‌తో ఎలాంటి సరిహద్దులు లేవు. ఎలాంటి వివాదాలు, విభేదాలు అస్సలు లేవు.. ఎవరూ అడగకపోయినా.. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కశ్మీర్ అంశంపై విషం కక్కుతున్నాడు. సిరియాలో ఉగ్రవాదుల అరాచకాలను ఎండగట్టే ఎర్డోగన్ కంటికి.. పాకిస్థాన్ ఉగ్రవాదం మాత్రం కనిపించదు. కాశ్మీర్ శాంతి కోసం ఆయన ప్రార్థిస్తారట. కేవలం ముస్లిం దేశమనే కారణంగానే.. పాకిస్థాన్‌కు ఎర్డోగన్ వంతపాడుతున్నాడు. ఎప్పటిలాగే భారత్‌పై మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టుకున్నాడు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో కశ్మీర్ అంశాన్ని లెవనెత్తారు. దీనిపై భారత్ ఘాటుగానే స్పందించింది. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలంటూ హితవు పలికింది. తీరు మార్చుకోకపోతే.. తాము కూడా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలు-యూఎన్‌జీఏ న్యూయార్క్‌లో జరుగుతున్నాయి. ఈ వేదికను వచ్చే ఎన్నికల్లో గెలుపునకు కొన్ని దేశాల అధినేతలు ఉపయోగించుకుంటున్నారు. మరి కొందరు మాత్రం.. మధ్య ఆసియా వివాదాలపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ క్రమంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కూడా నోరు పారేసుకున్నాడు. జనరల్ అసెంబ్లీలో నోరు పారేసుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. అసలు సమస్యేమిటంటే.. ఎవరూ అడగని.. లేవనెత్తని అంశాలు.. కేవలం ఎర్డోగన్‌కే కనిపిస్తాయి. వాటి గురించి ప్రస్తావించి.. తరచూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఈసారి జనరల్ అసెంబ్లీలోనూ నోటిని అదుపులో పెట్టుకోలేకపోయారు. తాజాగా కాశ్మీర్ అంశాన్ని ఎర్డోగన్ లేవనెత్తారు. భారత్, పాకిస్థాన్‌లకు 75 ఏళ్ల క్రితమే స్వాతంత్రం లభించిందన్నారు. ఇప్పటికీ రెండు దేశాల మధ్య శాంతి, ఐకమత్యం లేదన్నారు. అంతటితో ఆగకుండా.. శక్మీర్‌లో శాశ్వత శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నామన్నారు. అసలు ఎర్డోగన్‌కు, కశ్మీర్‌కు ఏం సంబంధం? ఎందుకు ఎర్డోగన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు?
నిజానికి ఐరోపా ఖండంలో ఉండే ముస్లిం దేశం టర్కీ.. ఆ దేశానికి అధ్యక్షుడు ఎర్డోగన్. భారత్‌తో ఎర్డోగన్‌కు ఎలాంటి వివాదాలు, విభేదాలు లేవు. భారత్‌లాగే టర్కీ కూడా ఉగ్రవాదంతో బాధపడుతోంది. సరిహద్దు దేశం సిరియా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వలస వస్తున్నారు. వారికి సౌకర్యాలు కల్పించడం టర్కీకి తలకు మించిన భారంగా మారింది. ప్రస్తుతం 3 కోట్ల 70 లక్షల మంది శరణార్థులు టర్కీలో తలదాచుకుంటున్నారు. మరోవైపు సిరియాకు చెందిన కుర్దుస్ ఫైటర్లు టర్కీ సరిహద్దుల్లోకి చొచ్చుకుపోతున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సిరియా పేరుతో కుర్దుస్ ఫైటర్లు.. దక్షిణ టర్కీలో దాడులు నిర్వహిస్తున్నారు. వారిని సిరియాలో పోరాట యోధులుగా పిలుస్తున్నారు. కానీ.. టర్కీ వారిని ఉగ్రవాదులుగా చెబుతోంది. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నట్టుగానే.. సిరియా నేతలు కూడా టెర్రరిజాన్ని టర్కీ వైపుగా ఉసిగొల్పుతున్నారు. సిరియా ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పుడు ఎర్డోగన్ ఎండగడుతూనే ఉంటారు. సిరియా ఉగ్రవాదంతో బాధపడుతున్న ఎర్డోగన్ కళ్లకు.. పాకిస్థాన్ టెర్రరిస్టులు మాత్రం కనిపించడం లేదు. కశ్మీర్ విషయంలో టర్కీ అధ్యక్షుడు విషం కక్కుతున్నాడు.
కశ్మీర్ అంశం అనేది కేవలం భారత్, పాకిస్థాన్‌కు సంబంధించిన వివాదం.. ఇందులో టర్కీకి ఎలాంటి ప్రాధాన్యం లేదు. అయినా.. కశ్మీర్ అంశాన్ని ఎర్డోగన్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. 2019లో బహిరంగంగానే భారత్‌పై విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ప్రజలు తీవ్ర నిర్బంధంలో బతుకుతున్నారని విమర్శించారు. 2020లోనూ కశ్మీర్ తీవ్ర వివాదాస్పద సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశం అత్యంత క్లిష్టమైనదన్నారు. 2021లోనూ ఐక్యరాజ్య సమితి తీర్మానంలోనూ ఎర్డోగన్ ప్రస్తావించారు. కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సమావేశాల్లోనూ నిర్బంధమో, రాష్ట్ర హోదా గురించో ఈసారి మాట్లాడలేదు. కశ్మీర్‌లో శాశ్వత శాంతి కోసం ప్రార్థిస్తున్నామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇది ద్వైపాక్షిక సమస్య కాదని.. ముస్లిం ప్రపంచం స్పందించాలని కూడా ఎర్డోగన్ పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై భారత్ ఘాటుగానే స్పందించింది. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం ఎర్డోగన్ నేర్రచుకోవాలంటూ భారత్ హితవు పలికింది. కశ్మీర్ అంశంపై పదే పదే నోరుపారేసుకుంటే.. ఊరుకునేది లేదని హెచ్చరించింది. తాము కూడా టర్కీ వివాదాస్పద అంశాలను లేవనెత్తగలమని.. కానీ.. అలా చేయమని స్పష్టం చేసింది.
ఇటీవల ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ-ఎస్‌సీవో సదస్సుకు భారత ప్రధాని మోడీ తోపాటు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు కూడా సమావేశమయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రధాని మోడీ షెడ్యూల్‌లోటర్కీ అధ్యక్షుడితో ఎలాంటి సమావేశం లేదు. దీనిపై టర్కీ ప్రభుత్వం కూడా పేర్కొనలేదు. కానీ.. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంతో ఢిల్లీ, అంకారా మధ్య సంబంధాలను పునర్నిర్మించేందుకు దోహదపడుతుందని అంతా భావించారు. ఆ సమయంలో కశ్మీర్ అంశాన్ని మాట మాత్రం కూడా చర్చించలేదు. కానీ.. వారం తరువాత.. యూఎన్ అసెంబ్లీ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాడు. 2019 నుంచి అంతర్జాతీయ పరిణామాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహించాలని ఎర్డోగన్ భావిస్తున్నాడు. అందులో భాగంగా కశ్మీర్ అంశాన్ని ఎంచుకున్నాడు. దీని ఆధారంగా ముస్లిం దేశాలను ఏకం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అంతేకాదు.. అందుకు టర్కీ ఆర్థిక వ్యవస్థ కూడా సహకరించడం లేదు.
అయితే ఎర్డోగన్ పాకిస్థాన్‌కు వంతపాడడం వెనుక మరో కారణం కూడా ఉంది. పాకిస్థాన్‌లాగే.. టర్కీ కూడా ముస్లిం దేశం. మరి కొన్ని నెల్లలో టర్కీలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా టర్కీ కూడా ఇబ్బందులు పడుతోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ధరలను నియంత్రించడంలో ఎర్డోగన్ ప్రభుత్వం విఫలమయ్యింది. ఈ నేపథ్యంలో ఎర్డోగన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రజల్లో మతత్వాన్ని రెచ్చగొట్టేందుకు ఎర్డోగన్ సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా.. ఇటీవల ఇజ్రాయెల్‌తో సన్నిహితంగా మెలుగుతుండడంపైనా ముస్లిం దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కూడా కశ్మీర్ అంశాన్ని ఎర్డోగన్ వాడుకున్నట్టు విమర్శకులు చెబుతున్నారు. ఇటీవల టర్కీకి ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు భారత్‌తోనూ అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. క్రమంగా ఎర్డోగన్ పరపతిని కోల్పోతున్నాడు.
మొత్తంగా ముస్లిం సమాజం మద్దతు కోసం.. ఎర్డోగన్ పడరాని పాట్లు పడుతున్నాడు. సిరియాకు మద్దతు ఇస్తున్న ఇరాన్ విషయంలో ఎర్డోగన్ సరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్టుగా ఉంది. టర్కీలో పడిపోతున్న ఇమేజ్‌ను కాపాడుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు అధ్యక్షుడు ఎర్డోగన్.