గన్‌ కంట్రోల్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా.. మారని ట్రంప్‌ తీరు

America: చట్టాన్ని కఠినతరం చేయాల్సి అవసరం లేదన్న ట్రంప్‌

Update: 2022-05-29 13:30 GMT

గన్‌ కంట్రోల్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా.. మారని ట్రంప్‌ తీరు

America: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టెక్సాస్‌ స్కూల్‌లో కాల్పులతో గన్‌ కంట్రోల్‌పై కఠిన చట్టాలు తేవాలంటూ అమెరికాలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకెందరి ప్రాణాలను గన్నులు బలిగొనేవరకు ఎదురు చూస్తారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఐయాం నెక్ట్స్‌ అంటూ విద్యార్థులు సైతం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పలు నగరాల్లో నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌-ఎన్‌ఆర్‌ఏ కార్యాలయాల ఎదుట ప్రజలు ఆందోళనలకు దిగారు. కఠిన తుపాకీ చట్టాలను తేవాలని డిమాండ్‌ చేస్తూ.. భారీ ర్యాలీలను చేపట్టారు. ఓ వైపు నిరసనలు హోరెత్తుతుంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం కఠిన తుపాకీ చట్టాల అమలును వ్యతిరేకించారు. తమను తాము కపాడుకునేందుకు ఆయుధాలు అవసరమని తేల్చి చెప్పారు.

వరుస కాల్పులతో అమెరికాలోని పలు నగరాలు దద్ధరిల్లుతున్నాయి. తాజాగా టెక్సాస్‌లోని రాబ్‌ ప్రాథమిక పాఠశాలలో కాల్పులతో 18 ఏళ్ల దుండగుడు జరిపిన కాల్పుల్లో 19 మంది చిన్నారులతో సహా మొత్తం 21 మంది మృతి చెందారు. ఈ కాల్పుల ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మరోసారి గన్‌ కంట్రోల్‌ పై అమెరికాలో ఆందోళనలు వెల్లువెత్తాయి. గన్‌ కంట్రోల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. రెండ్రోజులుగా పలు నగరాల్లో భారీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తాజాగా దేశంలోని పలు నగరాల్లోని నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌-ఎన్‌ఆర్‌ఏ కార్యాలయాల ఎదుట ప్రజలు ఆందోళనకు దిగారు. గన్‌ కంట్రోల్‌ చట్టాన్ని కఠినతరం చేయకుండా ఎన్‌ఆర్‌ఏ అడ్డుపడుతోంది. ఈ నేపథ్యంలో చట్టాల మార్పును అడ్డుకోవద్దంటూ ఎన్‌ఆర్‌ఏను డిమాండ్‌ చేశారు. హోస్టన్‌, లాస్‌ ఏంజిల్స్‌, న్యూయార్క్‌, మిచిగాన్‌లోని ఆక్స్‌ఫోర్డ్‌, హాంప్టన్‌, వాసింగ్టన్‌ డీసీ, వర్జినియాలోని ఫెయిర్‌ఫాక్స్‌తో పాటు పలు నగరాల్లో ప్రజలు గన్‌ కల్చర్‌కు వ్యతిరేకంగా రోడ్లెక్కారు.

నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ వార్షికోత్సవానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరయ్యారు. ఈ వేడుకల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని స్కూళ్లలో భద్రతను పెంచేందుకు నిధులు కేటాయించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. చిన్నారులను కాపాడుకునేందుకు బైడెన్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. తుపాకీ చట్టాన్ని కఠినతరం చేయాల్సిన అవసరం లేదన్నారు. తమను తాము కాపాడుకునేందుకు మాత్రమే ఆయుధాలను ఉపయోగించాలని సూచించారు. ప్రపంచ దేశాలకు నిధులివ్వడం కాదని.. దేశంలోని స్కూళ్ల రక్షణకు బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ఎన్‌ఆర్‌ఏ కార్యాలయం లోపల ట్రంప్‌ ప్రసంగం చేస్తుండగానే.. బయట ప్రజలు నిరసన తెలిపారు. గన్‌ కంట్రోల్‌ చట్టాలను కఠినతరం చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఈ గన్‌ కల్చర్‌తో ఇంకెందరి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటారంటూ నిలదీశారు.

గన్‌ కంట్రోల్‌ వ్యవహారం రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన నేతలు గన్‌ కల్చర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. డెమోక్రాట్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పలువురు ఎన్‌ఆర్‌ఏలో సభ్యులు. పైగా ఆయుధ తయారీ కంపెనీల్లోనూ వారికి భారీగా వాటాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుపాకీ నియంత్రణ చట్టాన్ని కఠినతరం చేయకుండా.. సెనేట్‌లో ఎన్‌ఆర్‌ఏ సభ్యులైన రిపబ్లికన్లు అడ్డుకుంటున్నారు. రిపబ్లికన్‌ తీరుపై డెమోక్రాట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో తప్ప.. మరేదేశంలోనూ విచ్చలవిడి కాల్పుల ఘటనలు జరగవని డెమోక్రాట్‌ సెనేటర్‌ మర్పీ వాపోయారు. ఇప్పటికైనా తుపాకీ సంస్కృతిని అడ్డుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అధ్యక్షుడు బైడెన్‌ చట్టంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారీగా నిరసనలు హోరెత్తుతున్నా.. రిపబ్లికన్లు మాత్రం పట్టు వీడడం లేదు. గన్‌ కల్చర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

తుపాకుల నియంత్రణ చట్టం ప్రకారం.. 18 ఏళ్ల పైబడిన ఎవరైనా గన్నును పొందవచ్చు. ఎలాంటి నేర చరిత్ర, మానసిక సమస్యలు ఉండరాదని లేకపోతే చాలని చట్టం చెబుతోంది. అమెరికాలోని ప్రతి 100 మంది పౌరుల వద్ద 120 తుపాకీలు ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. రెండేళ్లుగా తుపాకుల విక్రయం అమెరికాలో ఊపందుకుంది. 2020లో కోటి 35 లక్షల గన్నులు అమ్ముడవగా, 2021లో 2 కోట్ల 20 లక్షల గన్నులు విక్రయమయ్యాయి. 2000 నుంచి రెండు దశాబ్దాలుగా 13 కోట్ల 90వేల తుపాకులు ఉత్పత్తయ్యాయి. మరో 7 కోట్ల 10 లక్షల గన్నులు దిగుమతయ్యాయి. ఇందులో అత్యాధునిక రైఫిళ్లు కూడా ఉన్నాయి. గన్నుల ధరలు 100 డాలర్ల నుంచి లభిస్తున్నాయి. అంటే మన రూపాయల్లో చెప్పుకుంటే.. 7వేలపైగా పెడితే చాలు గన్ను దొరుకుతుంది.

తుపాకీ తూటాల కారణంగా ఏటా వేలాది మంది చనిపోతున్నారు. 2020 ప్రకారం 19వేల 350 మంది తుపాకీ తూటాలకు బలయ్యారు. 2020లో 24వేల 245 మంది తుపాకీలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2009 నుంచి అమెరికాలో 274 సామూహిక కాల్పులు జరిగాయి. ఫలితంగా 15వందల 36 మంది తూటాలకు బలయ్యారు. 983 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

Full View


Tags:    

Similar News