Imran Khan: ఇమ్రాన్ ఖాన్ అరెస్టును వ్యతిరేకిస్తూ పాక్ వ్యాప్తంగా నిరసనలు
Imran Khan: సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ఇమ్రాన్ మద్దతుదారులు
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ మీద ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక ఖాన్ అరెస్టుపై సోషల్ మీడియాలో సైతం తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ప్రపంచ ట్విట్టర్ ట్రెండులో ఇమ్రాన్ ఖాన్ అనే హ్యాష్‌ట్యాగ్ టాపులో ఉంది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వీడియోలను ఫొటోలను షేర్ చేస్తూ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తు్న్నారు.
తోషాఖానా కేసులో తనను అరెస్ట్ చేసేందుకు లాహోర్‌లోని ఈ జమాన్ పార్కులో ఉన్న ఆయన నివాసానికి చేరుకోక ముందే ఇమ్రాన్ ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. అరెస్ట్ అనంతరం ఆయన పార్టీ అయితే తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేతలు ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక పోలీసుల కంటే ముందే ఆయన నివాసానికి ఆయన మద్దతుదారులు, పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో పోలీసులకు పీటీఐ కార్యకర్తలకు మధ్య భారీ తోపులాట జరిగింది. ఇమ్రాన్ మద్దతుదారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. ఈ చర్యలో అనేక మంది గాయపడ్డారు. అనంతరం పోలీసులపై పీటీఐ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. విదేశాల నుంచి ఇమ్రాన్ అందుకున్న ఖరీదైన బహుమతులను లాభాల కోసం విక్రయించారని బలమైన ఆరోపణల నేపథ్యంలో తాజా అరెస్ట్ చోటు చేసుకుంది.