Uganda: విరిగిపడిన కొండచరియలు..6 గ్రామాలు ధ్వంసం..15మంది దుర్మరణం..మృతుల సంఖ్య పెరిగే అవకాశం
Uganda: ఉగాండాలో విషాదం నెలకొంది. కొండచరియలు విరిగిపడటంతో ఆరు గ్రామాలు ధ్వంసమయ్యాయి. 15 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
తూర్పు ఉగాండాలోని ఆరు గ్రామాలపై కొండచరియలు విరిగిపడటంతో 15 మంది మరణించారు. 113 మంది అదృశ్యమయ్యారు. గాయపడిన 15 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో 40 ఇళ్లు ధ్వంసమైన తర్వాత 13 మృతదేహాలను వెలికితీసినట్లు ఉగాండా రెడ్‌క్రాస్ సొసైటీ గురువారం వెల్లడించింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపింది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశ ఉందని అధికారులు, స్థానిక మీడియా పేర్కొంది. బులంబులి జిల్లా బులంబులిలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లా రాజధాని కంపాలాకు తూర్పున 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి పరిస్థితి భయానకంగా ఉందని..వాతవరణ పరిస్థితులు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల్లో ఎక్కువ మంది చిన్నారులేనని 'డైలీ మానిటర్' వార్తాపత్రిక పేర్కొంది. కాగా, బుధవారం పక్వాచ్ వంతెన మునిగిపోవడంతో నైలు నదిలో రెస్క్యూ ఆపరేషన్‌లో రెండు పడవలు బోల్తా పడ్డాయి.