Elon Musk compraes delay in vote counting in California with India: ఇండియా గురించి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో హైలైట్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. భారత్‌లో 640 మిలియన్ల ఓట్లు ఒక్క రోజులోనే లెక్కించారు. కానీ అమెరికాలోని క్యాలిఫోర్నియాలో మాత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపును ఉద్దేశించి ఎలాన్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఎన్నికలు ముగిసిన తరువాత మూడు లేదా నాలుగు రోజుల్లో ఏదో ఒక తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే ఓట్ల లెక్కింపు తేదీని కూడా వెల్లడిస్తారు. ఓట్ల లెక్కింపు నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిపోతుంది.
అయితే, అమెరికాలో మాత్రం ఇందుకు భిన్నమైన పద్ధతి కనిపిస్తుంది. ఓటింగ్ తేదీ నాడే ఓటింగ్ ముగిసిన మరుక్షణం నుండే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. తక్కువ ఓట్లు ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ ముగిసిన తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే అక్కడి ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో, ఓటింగ్‌లో క్లిష్టమైన పరిస్థితులు ఎదురైన చోట ఓట్ల లెక్కింపు ఆలస్యం అవుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ రోజుల తరబడి జరుగుతూనే ఉంటుంది.
నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా క్యాలిఫోర్నియాలో నమోదైన ఓట్ల లెక్కింపు విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలు జరిగి, ఓట్ల లెక్కింపు చేపట్టి దాదాపు 20 రోజులు కావస్తున్నప్పటికీ.. ఇప్పటికీ అక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతూనే ఉంది.
ఇదే విషయమై అమెరికాలోని న్యూస్ వీక్ అనే వార్తా సంస్థ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. "ఇండియాలో 640 మిలియన్స్ ఓట్లు ఒకే ఒక్క రోజులో లెక్కించారు" అని ఆ వార్తలో పేర్కొంది. క్యాలిఫోర్నియాలో ఇంకా జరుగుతున్న ఓట్ల లెక్కింపును ఉద్దేశిస్తూ వచ్చిన ఆ వార్తను వీ ద పీపుల్ | పాపులిజం ఈజ్ డెమొక్రసీ అనే ఎక్స్ యూజర్ (గతంలో ట్విటర్) ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను ఎలాన్ మస్క్ రిట్వీట్ చేశారు. ఇండియా ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లు లెక్కిస్తే క్యాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతూనే ఉందని గుర్తుచేశారు. ట్వీట్ చివర్లో తన అసహనాన్ని వ్యక్తంచేస్తూ ఒక ఎమోజీని కూడా జతచేశారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాదారణంగా ఇలాంటి సందర్భాల్లో మరొకరితోనో లేక మరొక దేశంతోనో పోల్చడం అంటే... వారిని చూసి నేర్చుకోండని సూచించడమే అవుతుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్ వెనుకున్న అర్థం కూడా అలాంటిదేననేది వారు అభిప్రాయపడుతున్నారు.