Tsunami: 2004 డిసెంబర్ 26..చరిత్రలో ఓ పీడకల. యావత్ ప్రపంచం ఉలిక్కిపడిన రోజు. భీకర సునామీకి దారితీసిన హిందూమహాసముద్ర గర్భంలో సంభవించిన భూకంపం అది. ఇండోనేషియాలోని సుమిత్రా దీవుల్లో 2004 డిసెంబర్ 26వ తేదీన 9.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సునామీ అంటేనే నేటికి ఉలిక్కిపడేలా చేసింది. ఈ పెను విపత్తును ప్రపంచం ఏనాటికీ మర్చిపోదు. భూకంపం ధాటికి సముద్రం పోటెత్తింది.
తీరప్రాంతాలన్నీ మునిగిపోయాయి. కడలి అరకిలోమీటరు వరకు భూభాగంపైకి చొచ్చుకొచ్చింది. ఈ మహా ప్రళయానికి 14దేశాల్లోని తీరప్రాంతాలు మరుభూములను తలపించాయి. 30కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగసిపడిన రాకాసి అలలు 2లక్షల 30వేల మందిని మింగాయి. ఒక్క భారతదేశంలోనే 16వేల మంది మరణించారు. ప్రపంచంలోనే అత్యంత ఘోర విపత్తుగా మారిన ఈ సునామీ కారణంగా సర్వస్వం కోల్పోయినవారికి లెక్కలేదు.
ఇండోనేషియా నుంచి భారత్, శ్రీలంక, థాయిలాండ్ సహా అనేక దేశాల్లో సముద్రతీరాల వెంబడి ఎటుచూసినా శవాలతో విధ్వంసం కనిపించింది. సునామీ సంభవించిన ఇండినేషియాలో లక్షా 70వేల మంది మరణించారు. ఐదులక్షల 70వేల మంది నిరాశ్రులయ్యారు. ఇండోనేషియాలోని అతే ప్రావిన్స్ లో సునామీ పెను విషాదం నింపింది. 23 జిల్లాలోలో 18 తీరప్రాంతాల్లో సుమారు 85వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
తమ ప్రాణాలు రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రులను తలచుకుంటూ వారి పిల్లలు ఇప్పటికీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లినవారి చివరిచూపు కూడా దక్కలేదని వారి కుటుంబాలు రోదిస్తున్నాయి. నాటి విపత్తును కళ్లారా చూసిన చిన్నారులు ఇప్పుడు పెద్దవాళ్లు అయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవం మళ్లీ వస్తుందేమోనని భయపడుతూనే ఉన్నారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో 1500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నాటి విధ్వంసాన్నికళ్లారా చూసినవారు దాన్ని గుర్తుచేస్తే ఉలిక్కిపడుతున్నారు. సముద్రపు నీరు ప్రాణాలను వెంటాడిందని, అడ్డొచ్చినవాటన్నింటినీ కబళించిందని చెబుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మోకాళ్లలోతు నీళ్లలో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీసినట్లు చెబుతున్నారు. తమిళనాడు తీరంలోనూ సునామీ చావు దెబ్బ కొట్టింది. సుమారు 8వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నాగపట్నం, చెన్నై, కడలూరు తీరప్రాంతాల్లో మరణాలు సంభవించాయి.